Wednesday, November 7, 2012

టోఫెల్, జి.ఆర్.ఇ., జి-మాట్: ప్రిపరేషన్ టిప్స్

యు.ఎస్ యూనివర్సిటీలలో ప్రవేశం కోసం మన విద్యార్థులు రాసే అడ్మిషన్ టెస్టుల వివరాలలోకి వెళ్ళే ముందు టోఫెల్, జి.ఆర్.ఇ., జి-మాట్‌ల ప్రిపరేషన్ టిప్స్ కూడా తెలుసుకోండి.
ఇంటర్నెట్ ఆధారిత టోఫెల్ ఐ.బి.టి.లో రైటింగ్, లిజనింగ్ రీడింగ్, స్పీకింగ్ అనే నాలుగు విభాగాలలో సెక్షన్‌కి 30 పాయింట్ల చొప్పున మొత్తం 120 పాయింట్లు ఉంటాయి. యు.ఎస్ ఎడ్యుకేషన్‌లో పోటీ ఎక్కువ అవ్వడం వల్ల విదేశీ విద్యార్థులు అడ్మిషన్ పరీక్షల్లో మనుపటి కంటే బాగా కష్టపడవలసి వస్తోంది. టోఫెల్‌లో మంచి స్కోర్లు రావాలంటే ఇంగ్లిష్ మీద మంచి పట్టు ఉండాలి. చివరగా ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా కనీసం రెండేళ్ల ముందు నుంచే ప్రాక్టీస్ టెస్టులు తీసుకోవాలి.

రెగ్యులర్ పద్ధతిలో ప్రిపేర్ అవ్వడంతో పాటు ఇంగ్లిష్ కార్టూన్ ఫిలింలు చూడడం వల్ల ఇంగ్లిష్ తొందరగా అభివృద్ధి చెందుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. అలాగే రేడియోలో ఇంగ్లిష్‌న్యూస్, ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ సహా వచ్చే ఇంగ్లిష్ సినిమాలు కూడా ఉపయోగ పడతాయి అని ఒక పరిశీలనలో తేలింది. వీటివల్ల ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారి ఉచ్ఛారణ, శైలి మీద త్వరగా పట్టు దొరుకుతుందని కొందరు టోఫెల్ గురువులు సూత్రీకరించారు.

ఇక జి.ఆర్.ఇ.కి హాజరయ్యే వారిలో ఎక్కువభాగం ఇదివరలో నేర్చుకున్న హైస్కూల్ మాథమాటిక్స్ మూలసూత్రాలతో పరిచయం కోల్పోయి ఉండడం సహజం. అయితే అవి జి.ఆర్.ఇ. పరీక్షలోని క్వాంటిటేటివ్ సెక్షన్‌లో మళ్ళీ ముఖ్యమైనవిగా ఎదురుపడతాయి కనుక ఆల్జీబ్రా, జామెట్రీ సిద్ధాంతాలని మరొక్కసారి పునశ్చరణ చేసుకోవాలి. ప్రొఫెషనల్ కాలేజీలో చేరినప్పటి నుంచి నాలుగేళ్లపాటు శ్రద్ధగా రకరకాల ఇంగ్లిషుపదాలను మనసుకు ఎక్కించుకుంటే భాషాసంపద మీ సొంతమై పరీక్షకి కావలసిన వొకాబ్యులరీ మీకు ఏర్పడుతుంది.

కోచింగ్ సెంటర్లు మీకు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చినా మీ దగ్గర మొదటి నుంచి గుజ్జు లేకపోతే ఎంత పండితులైనా ప్రొఫెసర్లు కూడా మీ కోసం స్వల్పకాలంలో మిరకిల్స్ సృష్టించలేరు. జి.ఆర్.ఇ. మీ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తుంది. కనుక మీరు మూడు నాలుగేళ్ల వ్యవధి తీసుకుని క్రమేణా మిమ్మల్ని మీరు ఒక గన్‌లాగా రూపొందించుకుంటే ఆపైన మీకు అవసరమైన బుల్లెట్లని ఏ కోచింగ్ సెంటరో సమకూర్చగలుగుతుంది.

ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సెంటర్ (ఇ.టి.ఎస్) వెబ్‌సైట్‌లో ఉచితంగా లభించే వనరుల ద్వారా ప్రాక్టీస్ చేస్తే కూడా మీ క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. కంప్యూటర్ ప్రాక్టిస్ టెస్ట్‌లు ఎన్ని చేస్తే అంత మంచిది. ఇంగ్లిష్‌లో మీరు పండితులైనా కాకపోయినా అనలిటికల్ సెక్షన్‌లోని రెండు ఎస్సేలు టెస్టు సమయంలో మూడోవంతు తీసేసుకుంటాయి. కనుక ఉన్నత ప్రమాణాలు గల ఒక ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సుని ఆన్‌లైన్‌లో గాని, బయట గాని ఒక ఏడాది ముందు నుంచి చెయ్యగలిగితే మంచి ఫలితం ఉంటుంది.

రివైజ్ చేసిన జి-మాట్ పరీక్ష మొదట అనుకున్నంత టఫ్‌గా ఏమీలేదని దానికి హాజరైన కొందరు అన్నారు. ఇందులోని ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ సెక్షన్ అంత కష్టమైనదేమీ కాకపోయినా ఇందులోని గ్రాఫులని, ఛార్టుల్ని దాటుకుంటూ వెళ్లడంలోనే సమయం అయిపోతుంది కాబట్టి వీటిని అలవాటు చేసుకోవడానికి ముందుగా ప్రాక్టీసు తప్పనిసరి. ఈ పరీక్షలో సాల్వ్ చెయ్యాల్సిన ప్రాబ్లమ్స్‌ని కూడా బాగా ముందు నుంచే ప్రాక్టీస్ చెయ్యాలి.

యు.ఎస్ జిబినెస్ స్కూల్స్‌కి 2013లో అప్లికేషన్‌లు వెల్లువెత్తబోతున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాంపిటీషన్ పెరిగే అవకాశాల వల్ల జి.ఆర్.ఇ., జి-మాట్ రాసే విద్యార్థులు ఈ పరీక్షలలో వీలైనంత ఎక్కువ స్కోర్లు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి.

No comments: