Tuesday, November 27, 2012

పురుషుల్లో వీర్యకణాల లోపాలు

పురుషుల్లో వీర్యకణాల లోపాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సంతానలేమితో బాధపడుతున్న పురుషుల్లో శృంగార సమస్యల వల్ల సంతానం కలగడంలేదని భావిస్తుంటారు. కానీ వీర్యకణాల సంఖ్య, వీర్యకణాల కదలికలు, ఆకృతుల్లో లోపాలు సంతానలేమికి ప్రధాన కారణమవుతుంటాయి. కొందరిలో వీర్యకణాల సంఖ్య బాగున్నా వాటి కదలికలు సరిగ్గా లేకపోవడం వల్ల సంతానం కలగడం కష్టమవుతుంది. వీర్యకణాలలో కదలికలు తక్కువగా ఉండటాన్ని 'అస్థినోస్పెర్మియా'గా పేర్కొంటారు. వీర్యకణాలలో చురుకుగా ముందుకు దూసుకొని పోయేవి కనీసం 50 శాతం వరకు ఉండాలి.

వీర్యకణాల కదలికలను 3 రకాలుగా విభజిస్తారు. మొదటి రకం చురుకుగా ముందుకు దూసుకొని పోయేవి(యాక్టివ్ మొబిలిటి), రెండవ రకం తక్కువ చురుకుదనం కలవి(స్లగిస్ మొటిలిటి), మూడవ రకం పూర్తిగా కదలికలేనివి ( నాన్ మొటిలిటి). ఇవే కాకుండా వీటిని గ్రేడింగ్‌లలో కూడా గుర్తిస్తారు. అవి గ్రేడ్-ఎ, గ్రేడ్-బి, గ్రేడ్-సి, గ్రేడ్-డి. వీర్యకణాల కదలికలతో పాటు వీర్యం ఉత్పత్తి సక్రమంగా ఉండటం, వీర్యవాహికలలోకి పక్వం చెంది రావడం, ప్రొస్టేట్ గ్రంథి స్రావాలు సక్రమంగా స్రవించడం వంటి వాటి ప్రభావం ప్రధానంగా ఉంటుంది.

కారణాలు
వీర్యకణాల కదలికలలో లోపాలకు అనేక కారణాలున్నాయి. అందులో వెరికోసిల్ ఒకటి. వృషణాలలో వెరికోసిల్ సమస్య ఉండటం వల్ల వీర్యకణాల కదలికలలో 70 శాతం వరకు లోపాలు ఏర్పడతాయి.

- సుఖవ్యాధులు ముఖ్యంగా గనేరియా, క్లామిడియా ఇన్‌ఫెక్షన్ల వల్ల వీర్యకణాల కదలికలలో లోపాలు ఏర్పడతాయి.

- యాంటి స్పెర్మ్ యాంటి బాడీల వల్ల వీర్యకణాల కదలికలు తగ్గిపోతాయి.

- శృంగారంలో పాల్గొన్నప్పుడు లూబ్రికెంట్స్ వాడతారు. వాటి వలన కూడా వీర్యకణాల కదలికలు తగ్గిపోతాయి.

- హార్మోన్ల లోపాలు కూడా వీర్యకణాల కదలికలు తగ్గిపోవడానికి కారణమవుతుంది.

- వీర్యకణాలలో నిర్జీవ కణాలు ఎక్కువగా ఉండటాన్ని నెక్రోస్పెర్మియా అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు కదలికలు లోపిస్తాయి.

- వీర్యకణాల ఆకృతులలో లోపాలు ఉండటాన్ని టెరటోస్పెర్మియా అంటారు. ఇందులో కూడా వీర్యకణాల కదలికలు తగ్గిపోతాయి.

- శృంగారానికి ఎక్కువ రోజులు దూరంగా ఉన్నా కూడా వీర్యకణాల సంఖ్య పెరిగి కదలికలు తగ్గిపోతాయి.

- వృషణాలకు దెబ్బతగలడం, మెలితిరగడం వల్ల కూడా కదలికలు తగ్గిపోతాయి.

- వేడి వాతావరణంలో పనిచేసే వారిలోనూ, ఎక్కువ నిలబడి పనిచేసే వారిలోనూ వీర్యకణాల కదలికలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది.

- పోషకాహారలోపం ముఖ్యంగా జింక్ లోపం, ఎక్కువగా మద్యపానం చేయడం, పొగతాగడం, గుట్కాలు నమలడం కూడా కారణమవుతుంది.

- కొన్ని మందుల వల్ల ముఖ్యంగా కెటకెనజోల్, సల్ఫాడ్రగ్స్, స్టెరాయిడ్స్ వల్ల వీర్యకణాల కదలికలు తగ్గవచ్చు.

- ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల వృషణాలలో వేడి ఉత్పత్తి జరిగి వీర్యకణాల కదలికలు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది.

వ్యాధి నిర్ధారణ
వీర్యపరీక్ష(సెమన్ అనాలసిస్), హార్మోన్ల పరీక్ష, స్క్రోటల్ డాప్లర్ స్టడీ వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.

వాజీకరణ చికిత్స
పురుషులలో సంతానలేమికి ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గిన వారికి లేదా పూర్తిగా లేని వారికి, కదలికలు తక్కువగా ఉన్నవారికి ఆయుర్వేదంలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఈ చికత్స వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. శృంగార సమస్యలకు, సంతానలే మి సమస్యలకు ఆయుర్వేదం ప్రత్యేకంగా చెప్పబడిన వాజీకరణ ఔషధాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. వెరికోసిల్ గ్రేడ్-1, గ్రేడ్-2 ఉన్న వారికి ఆయుర్వేద ఔషధాల ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు. 

ఆయుర్వేద ఔషధాలు శారీరక, మానసిక వ్యవస్థ మొత్తాన్ని ఆరోగ్యంగా చేస్తాయి కాబట్టి శృంగార సమస్యలు, సంతానలేమి సమస్యలు తొలగిపోతాయి. వీర్యకణాలలో లోపాలకు ఆధునిక వైద్య విధానంలో కచ్చితమైన ఫలితాలు ఇచ్చే మందులు లేకపోవడం వల్ల టెస్ట్‌ట్యూబ్ బేబీ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారు. కానీ ఆయుర్వేద చికిత్స సంతానలేమికి చక్కని పరిష్కారం చూపుతోంది. పురుషుల్లో వీర్యకణాల లోపాలకు, శృంగార సమస్యలకు నిపుణులైన ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.

No comments: