Sunday, November 4, 2012

గ్రామీణ విద్యార్థులు కూడా టోఫెల్‌ని సాధించవచ్చు!

అమెరికాలో పైచదువులకు వెళ్ళాలంటే అన్నిటికంటే ముందు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉండాలి. అయితే అంతమాత్రం చేత ఒకటోతరగతి నుంచే తెలుగు వదిలేసి పూర్తిగా ఇంగ్లిషులోనే విద్యాభ్యాసం చెయ్యాల్సిన పని లేదు. మాతృభాష మీద పట్టు సంపాదించిన తర్వాత కూడా ఇంగ్లిషులో స్కిల్స్ పెంచుకోవచ్చు. అలాగే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇంగ్లిషులో వెనుకబడి ఉంటారనుకోవడం సరికాదు. కృషి, పట్టుదల ఉంటే ఇంగ్లీషు మీద కమాండ్ తెచ్చుకోవడం ఎవరికైనా తేలికే.
టోఫెల్: మీరు అమెరికాలో గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్ సంపాదించాలంటే ముందుగా ఆలోచించవలసింది టోఫెల్ పరీక్ష గురించే. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్ అనే ఈ పరీక్ష అమెరికా సహా 130కిపైగా దేశాలలో 8వేలకి పైబడిన కాలేజీలు, యూనివర్శిటీల గుర్తింపు పొంది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గౌరవానికి పాత్రమవుతోంది. టోఫెల్ స్కోర్సుని అంగీకరించే విద్యా సంస్థలలో ప్రపంచంలోని 100 అగ్రశ్రేణి యూనివర్శిటీలు కూడా వున్నాయంటే ఈ కోర్సుకి సర్వత్రా వున్న గుర్తింపు అర్థమవుతుంది.
విద్యార్థులకి గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం ఇచ్చేటప్పుడు వారి టోఫెల్ స్కోరుని ఒక ముఖ్యమైన కొలబద్దగా యు.ఎస్. యూనివర్శిటీలు భావిస్తాయి. ఒక అమెరికన్ యూనివర్శిటీలో చేరిన తర్వాత అక్కడ క్లాసు రూములో ఉపయోగించడానికి అవసరమైన ఆంగ్ల భాషా నైపుణ్యం మీకు వున్నదని టోఫెల్ టెస్టు స్కోర్లు ద్వారా మీరు రుజువు చేసుకుంటారు. 165 దేశాలలో 4,500కి పైగా టెస్టు సైట్లలో విద్యార్థులు టోఫెల్ పరీక్ష రాసే సౌలభ్యం వుంది. ఈ టెస్టు మొత్తం ఒక్కరోజులోనే పూర్తి కావడం ఇంకొక వెసులుబాటు.


టోఫెల్‌లో ఇంటర్నెట్ ఆధారంగా జరిగే పరీక్షని ఐ.బి.టి అని, పేపర్‌పైన రాసే పరీక్షని పి.బి.టి అని అంటారు. ఐ.బి.టి. అందుబాటులో లేని కొన్ని దేశాలలో పి.బి.టి.ని నిర్వహిస్తారు. టోఫెల్ ఐ.బి.టి. పరీక్ష ఒక ఏడాదిలో 30 నుంచి 40సార్లు నిర్వహిస్తారు. ఏటా దాదాపు 10లక్షల మంది ఈ పరీక్షకి హాజరవుతుంటారు.
ఐ.ఇ.ఎల్.టి.ఎస్.: ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అనేది గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఉన్న మరొక ప్రతిష్ఠాత్మకమైన ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్టు. 135 దేశాలలో 6,000కి పైగా విద్యా సంస్థలు గుర్తించిన ఈ టెస్టుకి ఏటా 14లక్షల మందికిపైగా విద్యార్ధులు హాజరవుతారు.

ఆస్ట్రేలియా, బ్రిటన్‌తో పాటు కొన్ని యు.ఎస్. యూనివర్శిటీలు కూడా ఈ టెస్టు స్కోర్లని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ యు.ఎస్. విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులలో టోఫెల్‌కే ఆదరణ ఎక్కువ. అమెరికాలో ఏ యూనివర్శిటీ ఏ టెస్టుని ప్రిఫర్ చేస్తుందనేది ఆయా యూనివర్శిటీల వెబ్‌సైట్ల నుంచి తెలుసుకోవాలి.

యు.ఎస్. వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఒక ప్రొఫెషనల్ కోర్సులో చేరినప్పటి నుంచే టోఫెల్‌కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాలి. బయట సంకోచం లేకుండా ఇంగ్లీషులో మాట్లాడాలి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ న్యూస్‌పేపర్లు కూడా క్రమం తప్పకుండా చదవాలి.
పిల్లల్ని యు.ఎస్. పంపించాలనుకున్న పేరెంట్స్ ఈ విషయాల మీద మొదటినుంచి శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు గ్రామాల నుంచి వచ్చినా, గవర్నమెంటు స్కూళ్ళలో చదివినా టోఫెల్‌లో మంచి స్కోర్లు సంపాదించడం కష్టమేమీ కాదు. 

No comments: