Thursday, November 29, 2012

Tomorrow AIDS DAY

ఎయిడ్స్‌ను కనుగొన్ననాటి నుంచి ఇప్పటివరకూ చికిత్స లేని వ్యాధిగా ఇది తీవ్ర భయాందోళనలను, రోగుల పట్ల వివక్షనూ పెంచింది. ఇంతటి సంచలనాలకు కారణమైన ఈ వ్యాధిపై ఎన్నో అపోహలు, అనుమానాలు. వ్యాధిగ్రస్తులపై ఎన్నో ఆంక్షలు. అందుకే ఎయిడ్స్‌పై ప్రపంచవ్యాప్త అవగాహనను కలిగించడం తప్పనిసరై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1998 నుంచి డిసెంబరు మొదటితేదీని ‘ప్రపంచ ఎయిడ్స్‌దినం’ గా జరుపుకోవడం ప్రారంభమైంది. రేపు ప్రపంచ ఎయిడ్స్ డేసందర్భంగా హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై అవగాహన కలిగించేలా సమగ్రమైన ప్రత్యేక కథనం ఇది...

‘హ్యూమన్ ఇమ్యునో డెఫీషియెన్సీ వైరస్’కు ఇంగ్లిష్ సంక్షిప్తరూపమే ‘హెచ్‌ఐవీ’. ఈ వైరస్‌తో కలిగే ఇన్ఫెక్షన్ వల్ల మనకు వ్యాధినిరోధకశక్తిని ఇచ్చే కణాలు దెబ్బతిని (అంటే ప్రధానంగా సీడీ4 కణాలు, పాజిటివ్ టీ సెల్స్, మేక్రోఫేజెస్) రోగనిరోధకశక్తి క్రమంగా మందగిస్తూ ఒక దశలో అసలు వ్యాధినిరోధక వ్యవస్థే లేని పరిస్థితి వస్తుంది. దాంతో హెచ్‌ఐవీ ఉన్నవారికి ఏ చిన్నపాటి జబ్బు/ఇన్ఫెక్షన్ వచ్చినా... అది ప్రాణాపాయానికి దారితీస్తుంది.

హెచ్‌ఐవీని తెలుసుకోవడం ఎలా?

ఎయిడ్స్ అంటే ‘అక్వైర్డ్ ఇమ్యునో డెఫీషియెన్సీ సిండ్రోమ్’కి సంక్షిప్తరూపం. హెచ్‌ఐవీ సోకిన వారికి ముందుగా ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించవు. అసలు సోకినట్లే తెలియదు. కొద్దిమందిలో మాత్రం కాస్త టైమ్ గడిచాక వారిలో సీరోకన్వర్షన్ జరిగే సమయంలో (అంటే... వారిలో ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే మార్పులతో రక్తంలో యాంటీబాడీస్ ప్రవేశించేవేళ) ‘‘యాంటీ రెట్రోవైరల్ సిండ్రోమ్’’ అనే దశ కనిపిస్తుంది. ఇందులో జ్వరం రావడం, ఒళ్లంతా ర్యాష్, లింఫ్‌నోడ్స్ వాచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సీరో కన్వర్షన్‌లో ఉండే ఈ లక్షణాలు ఇన్ఫెక్షన్ సోకిన 1 నుంచి 6 వారాల వరకు ఎప్పుడైనా కనిపించవచ్చు. ఆ సమయంలో ఒక వ్యక్తికి హెచ్‌ఐవీ నిర్ధారణకు రక్తపరీక్ష చేసి హెచ్‌ఐవీ యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడమే మార్గం. హెచ్‌ఐవీ సోకాక వేర్వేరు దశల్లో కనిపించే లక్షణాల ద్వారా అది ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.

హెచ్‌ఐవీ లక్షణాలు...

జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు (ఈ లక్షణాలు రెండు వారాల పాటు ఉండవచ్చు) చర్మం కింద ఉండే కొన్ని శరీరభాగాల వాపు. ప్రధానంగా గొంతుభాగానికి ఇరుపక్కలా, బాహుమూలాల్లో ఉండే లింఫ్‌నోడ్స్ వాపు. (ఈ లక్షణం దీర్ఘకాలికంగా హెచ్‌ఐవీ తో బాధపడేవారిలోనూ కనిపిస్తుంది) ముఖం, మెడ, ఛాతీపై ర్యాష్.

దీర్ఘకాలంగా అంటే చాలా ఏళ్ల పాటు హెచ్‌ఐవీ ఉన్నప్పుడు:

జ్వరం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, అకస్మాత్తుగా బరువు తగ్గడం ఇతర ఇన్ఫెక్షన్లు (ప్రధానంగా ఊపిరితిత్తుల, మెదడు, కంటి ఇన్ఫెక్షన్స్‌తో పాటు నోటిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ కచ్చి దాంతో నోరంతా చేదుగా ఉండటంతో పాటు తెల్లమచ్చలు రావడం)

ఇలాంటి దశలన్నీ దాటాక... రోగనిరోధకశక్తి క్రమంగా తగ్గుతూ ఏ చిన్నపాటి ఇన్ఫ్‌క్షనైనా ప్రాణాపాయానికి దారితీసే కండిషన్‌ను ఎయిడ్స్‌గా చెప్పవచ్చు.

హెచ్‌ఐవీ రోగితో వ్యవహరించగానే ఏం చేయాలి?

హెచ్‌ఐవీ సోకినవారితో సెక్స్‌లో పాల్గొనడం లేదా అలాంటి వారికి చికిత్స చేసే సమయంలో ఉపయోగించిన సూది ప్రమాదవశాత్తూ ఇతరులకు గుచ్చుకోవడం వంటివి జరిగినప్పుడు... తక్షణం డాక్టర్‌ను కలిసి పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ చికిత్స తీసుకోవాలి. సోకినట్లు నిర్ధారణ కాకపోయినా... అంటే అనుమానం ఉండగానే తీసుకోవాల్సిన చికిత్స ఇదన్నమాట.

పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే...?

హెచ్‌ఐవీ రోగులతో వ్యవహరించే సమయంలో అది ఏదైనా చర్య వల్ల మనకు సోకినట్లుగా అనుమానించగానే కొన్ని యాంటీరిట్రోవైరల్ మందులను వాడాలి. ఇలా ముందుజాగ్రత్తగా మందులు వాడటాన్ని పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. అయితే దీనివల్ల నూరు శాతం ఇన్ఫెక్షన్ సోకదనే గ్యారంటీ లేదు. కాబట్టి ముందు జాగ్రత్త అవసరం. ఈ పోస్ట్ ప్రొఫిలాక్సిస్ ట్రీట్‌మెంట్ తీసుకోవడాన్ని రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి సోకిందని అనుమానించిన 72 గంటల లోపే మొదలుపెట్టాలి. ఇక 28 రోజుల పాటు ఎలాంటి అంతరాయమూ లేకుండా దాన్ని కొనసాగించాలి.

చికిత్స ఎలా?

హెచ్‌ఐవీ సోకినవారికి రోగనిరోధకశక్తిని కలిగించేలా ‘యాంటీ రెట్రోవైరల్’ (ఏఆర్‌వీ) మందులు ఇస్తే... వాళ్ల జీవన వ్యవధి (లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ) కూడా మామూలు వ్యక్తుల్లాగే ఉంటుంది. ఈ ఏఆర్‌వీ మందులు వైరస్‌ను తనను తాను కాపీ చేసుకుంటూ వృద్ధి చెందడాన్ని, రోగనిరోధకశక్తిని కలిగించే సీడీ-4

సెల్స్‌ను దెబ్బతీసే శక్తిని హరిస్తాయి. ఇలా ఏఆర్‌వీ మందులు ఇవ్వడాన్ని యాంటీ రెట్రోవైరల్ డ్రగ్ థెరపీ అంటారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏఆర్‌వీ మందులనే రెండు మూడింటిని కలిపి ఇస్తారు.

హెచ్‌ఐవీ వ్యాపించేదెలా?
సురక్షితం కాని సెక్స్ ద్వారా (యోని మార్గంలోనైనా, మలద్వారం సెక్స్, చాలా తక్కువ కేసుల్లో ఓరల్ సెక్స్ ద్వారా కూడా) ఒకరి నుంచి ఒకరికి హెచ్‌ఐవీ వ్యాపించవచ్చు

కలుషిత సిరంజ్‌లు, సూదులు లేదా ఇతరత్రా వాడిగా ఉండే వస్తువుల ద్వారా
తల్లికి హెచ్‌ఐవీ ఉంటే ప్రసవానంతరం బిడ్డకువచ్చే అవకాశం ఉంది. అలాగే హెచ్‌ఐవీ ఉన్న మహిళ ఇచ్చే చనుబాలతోనూ సోకవచ్చు

హెచ్‌ఐవీ ఉన్న వారి రక్తాన్ని ఎక్కించడం వల్ల.

ఈ కండిషన్లలో చికిత్స తప్పనిసరి...

హెచ్‌ఐవీ రోగుల్లో దానితో పాటు కొన్ని ఇరత వ్యాధులు ఉండే అవకాశం ఉంది. అవి...
హెచ్‌ఐవీ - అసోసియేటెడ్ నెఫ్రోపతి (హెచ్‌ఐవీ వల్ల వచ్చే కిడ్నీల వ్యాధి).

హెచ్‌ఐవీ - అసోసియేటెడ్ ఛేంజెస్ ఇన్ బ్రెయిన్ ఫంక్షనింగ్ (హెచ్‌ఐవీ కారణంగా మెదడు పనితీరులో మార్పులు రావడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు).

హెపటైటిస్ బి / హెపటైటిస్ సి.

టీబీ (ట్యూబర్క్యులోసిస్).

పై వ్యాధులు ఉన్నప్పుడు సీడీ కౌంట్‌తో నిమిత్తం లేకుండా చికిత్స తప్పనిసరి.

హెచ్‌ఐవీ ఎయిడ్స్‌గా మారే క్రమం ఇలా..

మన శరీరంలో ఉండే సీడీ-4 కణాలు రోగనిరోధకశక్తిని కలిగిస్తాయి. హెచ్‌ఐవీ ఆ సీడీ-4 కణాల సంఖ్య తగ్గిస్తుంది. హెచ్‌ఐవీ సోకిన తర్వాత ఎలాంటి చికిత్సా తీసుకోలేదనుకుందాం. అప్పుడు రోగనిరోధకశక్తి క్రమక్రమంగా తగ్గుతూ 10-12 ఏళ్ల తర్వాత ఏదైనా సాధారణ ఇన్ఫెక్షన్‌కూడా వెంటనే ప్రమాదకరంగా మారే పరిస్థితి వస్తుంది. అలాంటి స్థితిని ఎయిడ్స్ అంటారు. వైద్యపరిభాషలో చెప్పాలంటే సీడీ కౌంట్‌ను పరిగణనలోకి తీసుకుంటే అది 200/ఎంఎం క్యూబ్ కంటే తగ్గడం అన్నమాట. అప్పుడు రోగి ఏ సాధారణ ఇన్ఫెక్షన్‌తోనైనా ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ.

సెక్స్ ద్వారా వ్యాప్తిని నిరోధించడం ఎలా?
మీ భాగస్వామితో తప్ప ఇతరులతో సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటం.

ఒకవేళ పాల్గొనాల్సి వస్తే పురుషులు కండోమ్ వాడటం. స్త్రీలు ఫిమేల్ కండోమ్ వాడటం.

కండోమ్ ఎంత సురక్షితం?
సెక్స్ ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించడంలో కండోమ్ చాలా ప్రభావపూర్వకమైన పాత్ర పోషిస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ దాన్ని సరైన రీతిలో ఉపయోగించాలి. సరిగా ఉపయోగించనప్పుడు అది సెక్స్ మధ్యలోనే జారిపోవడం, పగిలిపోవడం వల్ల వ్యాధుల నుంచి రక్షణ అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

సున్తీ చేయించుకుంటే సోకదా?
సున్తీ చేయించుకున్నవారు హెచ్‌ఐవీ ఉన్న పార్ట్‌నర్‌తో సురక్షితం కాని సెక్స్‌లో (అంటే కండోమ్ లేకుండా) పాల్గొంటే హెచ్‌ఐవీ సోకే అవకాశాలు కాస్త తగ్గవచ్చు. అంతేగాని సున్తీ వల్లనే పూర్తి రక్షణ లభించడం మాత్రం జరగదు.

ఏయే చర్యల ద్వారా వ్యాప్తిచెందదు...?
షేక్‌హ్యాండ్ ఇవ్వడం ద్వారా

పొడి ముద్దుల వల్ల (ఒకరినుంచి ఒకరికి లాలాజలం వ్యాపించేలా పెట్టుకునే తడిముద్దుల వల్ల హెచ్‌ఐవీ వ్యాప్తిచెందుతుందని చెప్పేందుకు కూడా ఆధారాలేవీ లేవు. అయినప్పటికీ వీలైనంతవరకు తడిముద్దులను అవాయిడ్ చేయడమే మంచిది).

హెచ్‌ఐవీ ఉన్న రోగిని కాటేసిన దోమ ఇంకొకరిని కాటేయడం వల్ల.

హెచ్‌ఐవీ ఎక్కడ ఉంటుంది?
హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ సోకినవారిలో ఆ వైరస్ ప్రధానంగా శరీరంలోని ద్రవాల్లో ఉంటుంది. అంటే అది రక్తం, వీర్యం, మహిళల్లోనైతే యోనిద్రవాలు, చనుబాలలో ఉంటుంది.

ఇతరత్రా జాగ్రత్తలూ అవసరమే
మందులు క్రమం తప్పకుండా వాడటం.

బలవర్థకమైన ఆహారం, శుభ్రమైన నీరు తీసుకోవడం

వ్యక్తిగత పరిశుభ్రత పాటు పరిసరాల శుభ్రత

ఇన్ఫెక్షన్లకు కారణమయ్యేందుకు దోహదం చేసే చోట్లలో ఉండకుండా వాటిని అవాయిడ్ చేయడం.

No comments: