Wednesday, November 21, 2012

ఇంధనం కోసం ఎన్ని తిప్పలో...!

బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయం ఒకటి గత ఏడాది మూత్రం ద్వారా తగు మోతాదులో ఇంధనాన్ని తయారుచేయడం సాధ్యమేనని నిరూపించింది.



ప్రపంచం సంప్రదాయేతర ఇంధనవనరుల కోసం అర్రులు జాస్తోంది.. బయోడీజిల్ తయారీ... వ్యర్థాల నుంచి మిథేన్ ఉత్పత్తి... అన్నీ ఇందులో భాగమే. అయితే ఈ జాబితాలోకి కొత్తగా చేరుతున్నదేమిటంటే... మూత్రం... వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల మనిషి సహజజీవక్రియలో భాగంగా వదిలించుకునే మూత్రాన్ని ఇంధనంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.



ప్రపంచ జనాభా దాదాపు 700 కోట్లు! అందరూ రోజూ లఘుశంక తీర్చుకోవాల్సిందే. నాసా జరిపిన అధ్యయనాల ప్రకారం ఒక్కో మనిషి సగటున రోజుకు దాదాపు 2.5 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. కొంతమోతాదులో యూరియా.... మరికొన్ని లవణాలు కలిగి ఉండే మూత్రం నేరుగా మురుగుకాలువలోకి కలిసిపోవడం వల్ల కొన్ని చిక్కులున్నాయి. నీరు కలుషితమవడం ఒకటైతే... యూరియాలోని అమ్మోనియా కారణంగా నీటివనరుల్లో నాచు పెరిగిపోతూంటుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడంతోపాటు... మూత్రంలోని లవణాలను ఉపయోగించుకుని ఇంధనాన్ని సృష్టించేందుకు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. సుమారు దశాబ్దం క్రితం కొంతమంది శాస్త్రవేత్తలు ‘అనమాక్స్’ అనే ఓ బ్యాక్టీరియాను గుర్తించారు.



ఆక్సిజన్ అవసరం లేకుండా బతకగలిగే ఈ బ్యాక్టీరియాకు ఓ వినూత్న లక్షణం ఉంది. అమ్మోనియా... నైట్రేట్‌లను కలిపి నైట్రోజన్‌ను ఉత్పత్తి చేయగలదు. అదేసమయంలో హైడ్రోజనేస్ అనే ఒకరకమైన ఉదజని సంబంధిత ఇంధనాన్ని తయారుచేయగలదు. మూత్రంతోపాటు ఈ అనమాక్స్ బ్యాక్టీరియాను ఉపయోగించి ఇంధనాన్ని తయారుచేయవచ్చునని శాస్త్రవేత్తలు అప్పట్లో అంచనా వేశారు. అయితే అప్పటి టెక్నాలజీ ద్వారా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వీలుకాలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది... బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయం ఒకటి గత ఏడాది మూత్రం ద్వారా తగు మోతాదులో ఇంధనాన్ని తయారుచేయడం సాధ్యమేనని నిరూపించింది. అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితం ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా మూత్రం నుంచి ఉదజనిని వేరు చేసి ఇంధనంగా వాడుకోవచ్చునని ప్రతిపాదించారు.



మూత్రం ద్వారా ఇంధనాన్ని తయారుచేసేందుకు ఒకవైపు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తూండగానే ఆఫ్రికాలోని డ్యూరో ఐనా అడెబోలా, అకిన్‌డేలే అబియోలా, ఫలాకే ఒట్టువాటోయెన్, బెల్లో ఎనియోలా అనే నలుగురు టీనేజ్ యువతులు ఈ పనిని సాధించి చూపారు. ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారానే మూత్రంలోని యూరియా నుంచి ఉదజనిని వేరుచేసి... దాన్ని ఒక సిలిండర్‌లో నింపారు. ఈ వాయువుతో జనరేటర్‌ను నడిపి చూపారు కూడా. గత వారం నైజీరియాలో జరిగిన ఓ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో ఈ టెక్నాలజీ ప్రదర్శితమైంది.

No comments: