Tuesday, November 27, 2012

స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన కల్పిస్తే.. ...

‘కేర్’లో స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ 
భిన్న మతాలకు చెందిన వారైనా.. బంధువులు కాకపోయినా.. కిడ్నీల మార్పిడికి సిద్ధపడ్డ జంటలు

 ‘రక్త’సంబంధం ఇద్దరి ప్రాణాలను నిలిపింది. సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’(పరస్పర ఒప్పందంతో మార్పిడి) ద్వారా ఇద్దరు వ్యక్తులకు మూత్రపిండాలని అమర్చారు. సాధారణంగా ఎవరికైనా మూత్రపిండాలు అమర్చాలంటే.. ఆ వ్యక్తికి అవయవదానం చేసేవారు కుటుంబ సభ్యులై ఉండాలి లేదా వారి బంధువులైనా అయి ఉండాలి. లేదంటే కెడావర్ ఆర్గాన్ డొనేషన్ పద్ధతిలో భాగంగా క్లినికల్ డెత్(మరణశయ్యపై) అయిన వ్యక్తి నుంచి వాటిని తీసి ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ రెండు పద్ధతుల్లో కాకుండా రెండు బాధిత కుటుంబాలకు చెందిన దాతలు(భార్యలు) పరస్పర అవగాహనతో కిడ్నీలను దానం చేయడంతో వారి భర్తల ప్రాణాలు నిలిచాయి. 

జరిగిందిదీ.. 

కరీంనగర్‌కు చెందిన ఎంఏ బేగ్ మూత్రపిండాల వ్యాధితో గత కొంతకాలంగా కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఆయనకు మళ్లీ సమస్య వచ్చింది. అప్పట్లో బేగ్ తమ్ముడు కిడ్నీ ఇచ్చారు. ఈసారి బంధువులు మూత్రపిండం ఇవ్వడానికి ముందుకొచ్చినా అవి సరిపోలేదు. దీంతో బేగ్ భార్య అయేషా కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే, బేగ్ బ్లడ్‌గ్రూపు బి పాజిటివ్ కాగా.. అయేషాది ఎ పాజిటివ్. దీంతో ఆ ప్రయత్నమూ విఫలమైంది. అయితే, ఇదే సమయంలో కేర్ ఆస్పత్రికి కిడ్నీ సమస్యతోనేహైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ ప్రాంతానికి చెందిన దేవీదాస్ అనే వ్యక్తి వచ్చారు. 

దేవీదాస్ భార్య నిర్మల ఆయనకు మూత్రపిండం ఇవ్వడానికి అంగీకరించినా.. దేవీదాస్ రక్తం గ్రూపు ఎ పాజిటివ్ కాగా, భార్యది బి పాజిటివ్ అయింది. ఇద్దరి సమస్యా ఒకటే. విషయం తెలుసుకున్నారు. భర్తలను దక్కించుకోవడానికి ఇద్దరు దాతలు(నిర్మల, అయేషా) అంగీకారానికి వచ్చారు. నిర్మల భర్తకు అయేషా కిడ్నీ ఇచ్చేందుకు, అయేషా భర్తకు నిర్మల మూత్రపిండమిచ్చేందుకు ఒప్పుకున్నారు. వీరి ప్రతిపాదనను కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వానికి పంపించారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నవంబర్ 7న బేగ్, దేవీదాస్‌లకు విజయవంతంగా మూత్రపిండాల మార్పిడి చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఇరువురి కిడ్నీల పనితీరు సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకూ ముంబై, ఢిల్లీ, కోల్‌కతాల్లో మాత్రమే ఇలాంటి మార్పిడి జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారని ఈ ఆపరేషన్లలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు నిర్వహించిన డా.రాజశేఖర్ చక్రవర్తి, డా.విక్రాంత్‌రెడ్డి, డా.కె.రామరాజు, డా.కె.ప్రసాదరాజు, డా.బి.వి.రామరాజుల బృందం కిడ్నీ మార్పిడి చేయించుకున్న కుటుంబాలతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ విధానాన్ని ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అంటారని చెప్పారు. దేశంలో ఏటా 4 లక్షల మందికి కిడ్నీ సమస్య వస్తోందని, కానీ 4 వేల మందికి మాత్రమే అవయవ మార్పిడి జరుగుతోందని వైద్యులు తెలిపారు. స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన కల్పిస్తే.. మరింతమందికి కొత్త జీవితాన్నివ్వవచ్చని వైద్య బృందం పేర్కొంది.

No comments: