Friday, November 2, 2012

సోనియా, రాహుల్ మోసం

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని సొంతం చేసుకున్నారు
యంగ్ ఇండియన్ పేరిట సొంత కంపెనీ
10, జన్‌పథ్‌లో వాటాదారుల సమావేశం
వందల కోట్ల ఆస్తుల కోసం పన్నాగం
సీబీఐ దర్యాప్తు జరపాలి: సుబ్రమణ్య స్వామి
కాంగ్రెస్ అప్పు ఇచ్చిదంటూ పత్రాలు

న్యూఢిల్లీ, నవంబర్ 1: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి మరోసారి ఆరోపణలు చేశారు. వీరు ఒక 'పబ్లిక్ లిమిటెడ్' కంపెనీని తమ సొంత కంపెనీగా మార్చుకున్నారని తెలిపారు. ఢిల్లీలో రూ.1600 కోట్ల విలువ చేసే 'హెరాల్డ్ హౌస్'ను, మరిన్ని విలువైన ఆస్తులను సొంతం చేసుకునేలా పావులు కదిపార ని ఆరోపించారు. గురువారం స్వామి దీనిపై ఒక ప్రకటన జారీ చేశారు. దాని సారాంశం ఇది...

'అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్' (ఏజేఎల్) అనే సంస్థ నేషన ల్ హెరాల్డ్, ఖ్వామీ ఆవాజ్ అనే రెండు పత్రికలకు యజమాని. దీనిని అప్పట్లో నెహ్రూ స్థాపించారు. ఈ సంస్థకు ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని అనేక చోట్ల అత్యంత విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ విలువే దాదాపు 1600 కోట్లు. ఇన్ని ఆస్తుల కు యజమాని అయిన ఏజేఎల్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు... 'యంగ్ ఇండియన్' అనే మరో సంస్థ విషయానికి వద్దాం. ఇది సోనియా, రాహుల్ కలిసి స్థాపించిన ప్రైవేటు కంపెనీ. తల్లీ కొడుకులకు ఇందులో 38 శాతం చొప్పున వాటాలున్నాయి.

అచ్చంగా ప్రైవేటు కంపెనీ అయిన యంగ్ ఇండియన్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని చట్టవిరుద్ధంగా సొంతం చేసుకుంది. దీనికోసం చాలా తతంగమే నడిపారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లోని రికార్డు ల్లో... ఏజేఎల్‌కు సంబంధించి నెహ్రూ, ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ, జీడీ బిర్లా వంటి ప్రముఖులను (వీరంతా ఎప్పుడో మరణించారు) షేర్ హోల్డర్లుగా పేర్కొన్నారు. నిజానికి... ఏజేఎల్‌లో 80 శాతం షేర్ హోల్డర్లు ప్రస్తుతం జీవించి లేరు. షేర్లు ఉన్న కంపెనీలు కూడా పనిచేయడంలేదు. వీటిలో కొన్ని కోల్‌కతాకు చెందిన అనుమానాస్పద కంపెనీలు కూడా ఉన్నాయి.

గత ఏడాది ఫిబ్రవరి 26న ఏజేఎల్ డైరెక్టర్ల బోర్డు సమావేశమై ఒక తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ తమకు 90 కోట్ల రుణం ఇచ్చినట్లు తెలిపింది. నిజానికి ఒక రా జకీయ పార్టీ ఇతరులకు అప్పులివ్వడం చట్ట విరుద్ధం. ఆ విషయా న్ని పక్కనపెడితే... కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రూ.10 విలువైన 9 కోట్ల షేర్లను 'యంగ్ ఇండియన్' కంపెనీకి బదిలీ చేసింది. ఈ విధంగా మొత్తం షేర్లలో 75 శాతం షేర్లు యంగ్ ఇండియన్‌కు దఖలు పడ్డాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే...షేర్ హోల్డర్ల సమావేశం సోనియాగాంధీ అధికార నివాసమైన 10, జన్‌పథ్‌లో జరగడం. ప్రభుత్వం కేటాయించి న ఈ బంగళాను వ్యాపార, వాణిజ్య అవసరాలకోసం ఉపయోగించుకోరాదు.

10, జన్‌పథ్‌లో జరిగినట్లు చెబుతున్న షేర్‌హోల్డర్ల సమావేశ వివరాలను యంగ్ ఇండియ న్ సంస్థ ఆర్వోసీకి సమర్పించింది. ఇలా రకరకాల అవాస్తవాలు చెబుతూ, చట్టవిరుద్ధ వ్యవహారాలు నడుపుతూ ఏజేఎల్‌ను సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన యంగ్ ఇండియన్ సంస్థ సొం తం చేసుకుంది. ఏజేఎల్ చైర్మన్ మరెవ రో కాదు. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా! 'అందరూ ఒక తానులోని ముక్కలే! పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఆస్తులు సోనియా యజమానిగా ఉన్న ప్రైవేట్ కంపెనీకి దఖలు పడ్డాయి.

ఇదంతా పెద్ద ఫ్రాడ్' అని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. రూ.90 కోట్ల అప్పును కేవలం రూ.50 లక్షలకే కొట్టివేశారని తెలిపారు. దీనిపై తీవ్ర ఆర్థిక మోసాల సంస్థ లేదా సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 'యంగ్ ఇండియన్'లో తనకు 38 శాతం వాటా ఉన్న విషయాన్ని రాహుల్ తన ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.

రాహుల్ కన్నెర్ర
సుబ్రమణ్య స్వామి ఆరోపణలపై రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కేసు వేసి, కోర్టుకులాగుతానని హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియన్‌కు సంబంధించి ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు, నిరాధారాలని తెలిపారు. స్వామి మీడియా సమావే శం ముగిసిన కొన్ని గంటల్లోనే రాహుల్ కార్యాలయం నుంచి నోటీసు వెళ్లింది. "విలేకరుల సమావేశంలో మీరు చేసిన ఆరోపణల ను పరిశీలించాం. ఈ మీడియా సమావేశం వెనుక ఉద్దేశమేమిటో సులువుగానే అర్థమవుతుంది. మీరు చేసిన హేయమైన వ్యాఖ్యలపై, మీ బాధ్యతారాహితమైన ఆరోపణలపై అన్నిరకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని ఆ నోటీసులో హెచ్చరించారు.

No comments: