Tuesday, November 27, 2012

బిడ్డా.. కాల్మొక్తా........


  ఇంటికొస్తానని కొడుకును వేడుకున్న తండ్రి
నాలుగేళ్ల క్రితం ఇల్లు వదిలి.. 
వేములవాడలో కాకతాళీయంగా ఎదురుపడిన వైనం
వదిలించుకునేందుకు తనయుడి యత్నం... కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు
ఈ ఫొటోను చూశారా.. నడి రోడ్డుపై అమాయకంగా ఏదో అడుక్కుంటున్నట్టుందీ కదూ. ఔను.. తనను ఇంటికి తీసుకెళ్లాలని ఓ తండ్రి కన్నకొడుకును ప్రాధేయపడుతున్నాడు. బిడ్డా.. కాల్మొక్తా అని వేడుకున్నాడు. 

 
నాలుగేళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఓ తండ్రి మంగళవారం భిక్షాటన చేస్తూ వేములవాడ మండలంలోని తిప్పాపూర్ బస్టాండ్‌లో కాకతాళీయంగా కొడుకు ఎదురుపడటంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే, అతడిని ఇంటికి తీసుకెళ్లేందుకు కొడుకు ముఖం చాటేసేందుకు యత్నించడంతో అక్కడున్న వారు పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పంతిని గ్రామానికి చెందిన రాజయ్య(70) రిక్షా కార్మికుడు. ఆయనకు కొడుకు శంకర్, ఓ కుమార్తె ఉన్నారు. 

శంకర్‌కు మంచి చదువు చెప్పించాడు, కూతురికి వివాహం చేశాడు. వయసు పైబడింది. కడుపులో కణితి ఏర్పడడంతో సర్కార్ దవాఖానాలో ఆపరేషన్ చేయించుకున్నాడు. పూర్తిగా నీరసించి రిక్షా లాగలేకపోయాడు. తండ్రి సంపాదించకుండా ఇంట్లో ఉంటుండడంతో కొడుకుకు పట్టింపు కొరవడింది. అర్ధాకలితో ఉండలేక నాలుగేళ్ల క్రితం ఊరువదిలాడు. వేములవాడకు వచ్చి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి రాజన్న దర్శనానికి వచ్చిన శంకర్ తిరుగుప్రయాణంలో మంగళవారం తిప్పాపూర్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడే భిక్షాటన చేస్తున్న తండ్రిని చూసి ముఖం తిప్పుకోబోయాడు. తన కొడుకేనని పోల్చుకున్న రాజయ్య.. ఇంటికి తీసుకెళ్లమని కాళ్లుపట్టుకుని వేడుకున్నాడు. ఏం సంపాదిస్తున్నావని నిన్నుపోషించాలని దుర్భాషలాడుతూ తండ్రిని తన్నాడు. ఇది గమనించిన అక్కడి వారు వారిమధ్య అనుబంధాన్ని తెలుసుకుని శంకర్‌కు దేహశుద్ధి చేసేందుకు సిద్ధమయ్యారు. అనంతరం తండ్రీకొడుకులను ఠాణాకు తరలించారు. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు

No comments: