Tuesday, November 20, 2012

ఉహుహూ వేళల్లో... ఆహాహా... ఆహారం

మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు అది ఆ సీజన్‌కు సరైనదా, కాదా అని ఆలోచించం. అయితే సీజన్‌ను బట్టి మనం తీసుకునే పదార్థాలను కొద్దిగా మార్చుకుంటే అది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. ఈ వింటర్‌లో మనం ఆరోగ్యం కోసం పాటించాల్సిన ఆహార జీవనశైలి ఈ కిందివిధంగా ఉంటే బెస్ట్. ప్రయత్నించి చూడండి.

బ్రేక్‌ఫాస్ట్

మీరు రోజూ తీసుకునే రెగ్యులర్ టిఫిన్ స్థానంలో వేడిగా ఉండే ఓట్‌మీల్‌తో తయారు చేసిన ఐటమ్స్ తీసుకోండి. బాగా కూరగాయలు ఎక్కువగా ఉండేలా ఉడికించిన కూరలతో బ్రెడ్ టోస్ట్ కూడా తీసుకోవచ్చు. ఆ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే దానికి బదులు ఈ వింటర్‌లో జింజర్ టీ తాగండి. వీలైతే అందులో ఒకటి రెండు తులసి ఆకులు వేసుకోండి.

దీనికి ఒక కారణం ఉంది. ఈ సీజన్‌లో చల్లగా ఉన్నందున మనం నీళ్లు తాగడం తగ్గిస్తాం. దానికి తోడు కాఫీ తాగితే మన శరీరంలో నీటి పాళ్లు మరింతగా తగ్గుతాయి. దానికి బదులు టీ తాగడం అన్నది మనకు చాలా మేలు చేస్తుంది. ఆ తర్వాత ఓ అరగంట వ్యవధి ఇచ్చి నారింజ, ఆపిల్ లేదా మరేదైనా ఒక పండు తినండి.

లంచ్

పొట్టుతీయని పిండితో చేసిన చపాతీలతో లేదా ముడిబియ్యంతో వండిన అన్నంతో చాలారకాల కూరగాయలతో చేసిన కూరలతో మధ్యాహ్న భోజనం మంచిది. ఇదెంతో మేలు చేస్తుంది. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే కూరల్లో అల్లం, ఉల్లి, కొత్తిమీర, వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. ఈ సీజన్‌లో వచ్చే అనేక రుగ్మతలను నివారించేలా అవి మీకు వ్యాధినిరోధక శక్తిని సమకూరుస్తాయి.

చలికాలం కదా అని కొందరు ఈ సీజన్‌లో నిమ్మకాయ వాడరు. మీకు అలర్జీ కలిగించకపోతే మీ లంచ్‌లోని కూరలపై కాస్తంత నిమ్మకాయ పిండండి. ఇది రుచిని పెంచడంతో పాటు మీకు ఈ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి అనేక జబ్బులనుంచి కాపాడేలా రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఇక ఈ సీజన్‌లో సూర్యరశ్మి కాస్తంత తగ్గుతుంది కాబట్టి మీకు అవసరమైన విటమిన్‌‘డి’, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమకూరేలా చేపలు పుష్కలంగా తినండి. గుడ్లు కూడా తీసుకోండి. ఈ సీజన్‌లో నీళ్లు తాగడం తగ్గిస్తాం. అది డీ-హేడ్రేట్ చేయవచ్చు. కాబట్టి దాహంగా లేకపోయినా నీళ్లు పుష్కలంగా తాగండి.



ఈవెనింగ్ శ్నాక్స్
సాయంత్రాల అలా పంటి కింద పటపటలాడించడానికి వేయించిన పల్లీలు, బాదంపప్పు మంచిది. ఇక కొవ్వు లేని పెరుగులో కొన్ని పండ్ల ముక్కలు వేసుకుని తినడం కూడా మేలే. దాంతోపాటు మొలకెత్తిన ధాన్యాలు. ఉడికించిన బఠాణీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.


డిన్నర్

ఈ సీజన్‌లో రాత్రివేళల్లో తినే భోజనంలో నూనె వీలైనంత తక్కువగా ఉండాలి. భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవడం ఎంతో మేలు. రాత్రి తినే భోజనంలో ఆకుకూరల్లో పాలకూర ఉంటే బెటర్. రాత్రి పూట చపాతీలు తీసుకునేవారు నూనెలేకుండా పుల్కాలు తినాలి. అందులో పుష్కలంగా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలాంటి కూరలు తినడం మేలు.

ఈ సీజన్‌లో వండే వంటలు ఆలివ్ నూనెతో వండితే... అది ఆరోగ్యానికిచేసే మేలు ఇంత అని చెప్పలేం. ఇక డిన్నర్ ముగించాక చివరన నిద్రకు ఉపక్రమించే ముందు వెన్న తీసిన పాలను వేడి చేసి గోరువెచ్చగా తాగడం మంచిది. పాలు క్యాల్షియమ్‌ను ఇస్తాయి. రాత్రి బాగా గాఢమైన నిద్రపట్టేలా చేస్తాయి.

No comments: