Tuesday, November 20, 2012

వ్యాయామం తర్వాత ఏం తినాలి,

వ్యాయామం రూపంలో బాగా శారీరక శ్రమ చేశాక ఏం తినాలో, ఏం తినకూడదో అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. చెమటలు కక్కుతూ జిమ్ బయటకు రాగానే పొగలు కక్కుతూ ఉండే తమకిష్టమైన ఆహారం తీసుకోవచ్చా లేదా అని తికమకపడుతుంటారు. ఈ విషయంలో కొమ్ములు... అదే... కండలు తిరిగిన వీరులు కాస్త కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి సందేహాలను తీర్చడానికి ఉపయోగపడేదే ఈ కథనం.

వ్యాయామం తర్వాత ఏం తినాలి, ఏ వేళలో తినాలి అన్న విషయం చాలా ప్రధానం. అది తెలుసుకోకపోతే చాలా సందర్భాల్లో కండలూ, బరువునే కాదు... శక్తినీ, పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాన్నీ కోల్పోవాల్సి వస్తుంది. అందుకే మంచి వ్యాయామం తర్వాత తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉంటే ఆరోగ్యకరమో తెలుసుకుందాం.

శాకాహారమైతే: మనం తీసుకునే కార్బోహైడ్రేట్లతో పాటు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు తీసుకోవడం అన్నది చాలా మంచిది. సాధారణంగా ఆకుపచ్చని ఆకుకూర (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్) లో లేని పోషకాలంటూ ఏవీ ఉండవంటే అది అతిశయోక్తి కాదు. ఆకుకూరలన్నింటిలోనూ పాలకూర ఇంకా మంచిది. ఇందులోని ఐరన్ వల్ల ఎప్పుడూ కొత్త రక్తం పడుతుండటంతో ఉరకలు వేసేంత ఉత్సాహంగా ఉంటారు. ఇందులోని ఫైటో స్టెరాయిడ్స్ (అంటే మొక్కల నుంచి లభ్యమయ్యే స్వాభావికమైన స్టెరాయిడ్స్) వేగంగా కండరాలు పెరిగేందుకు, మళ్లీ శక్తిని పుంజుకునేందుకు ఉపయోగపడతాయి.

మాంసాహారానికి వస్తే: వ్యాయామం తర్వాత మాంసాహారం తీసుకోవాలని అనుకుంటే చికెన్ లేదా చేపలు తినడం మంచిది. మాంసాహారానికి ఒక నిబంధన ఉంది. మాంసం కోసం ఆధారపడే జంతువు పరిమాణం పెరుగుతున్న కొద్దీ... ఆ మాంసం అంత ఆరోగ్యకరమైనది కాదని గుర్తుంచుకోవాలి. వ్యాయామం తర్వాత మన శరీరానికి ప్రోటీన్లు అవసరమని గుర్తించాలి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తలచుకుంటే తొలుత స్ఫురించేవి చికెన్, చేపలు. వాటిలోని పోషకాలు బాడీబిల్డింగ్‌కు, కండరాల టోన్ నిర్వహణకు ఉపయోగపడతాయి.


ఏం తాగాలి : మనం ఒక గంట లేదా అంతకు మించి వ్యాయామం చేస్తే మన శరీరం చాలా ద్రవాలను కోల్పోతుంది. ఎంత పరిమాణంలో ద్రవాలను కోల్పోతుందన్న విషయం మనం చేసే వ్యాయామ తీవ్రతను బట్టి, మనం వ్యాయామం చేసే సీజన్‌ను బట్టి ఉంటుంది. అయితే వ్యాయామ తీవ్రత పెరిగి, మన శరీరం ఎక్కువ నీటిని కోల్పోతే డీ-హైడ్రేషన్‌కు లోనయ్యే ఆస్కారం ఉంది. అందుకే ఆగకుండా వ్యాయామం చేసే సందర్భాల్లో శరీరం డీ-హైడ్రేట్ కాకుండా ప్రతి అరగంట వ్యాయామం తర్వాత కాస్తంత బ్రేక్ ఇచ్చి... ఆ టైమ్‌లో కనీసం గ్లాసెడు నీళ్లు తాగుతూ ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్లెయిన్ వాటర్ మాత్రమే తాగితే మనం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్ భర్తీ కాకపోవచ్చు.

అందుకే 45 నిమిషాల తీవ్రమైన వ్యాయామం తర్వాత మనం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్ భర్తీ అయ్యేలా లెమన్ జ్యూస్ లేదా ఉప్పు కలిపిన నిమ్మకాయ నీళ్లే మంచివి. వ్యాయామం చేసేవారికి అప్పటికే రక్తపోటు ఉండి ఉంటే వాళ్లు నిమ్మకాయ నీళ్లలో ఉప్పు కలుపుకోకపోవడమే మంచిది. డయాబెటిస్‌తో బాధపడుతూ ఉన్నవారు కార్బోహైడ్రేట్స్ ఉండే ద్రవాహారాలను తీసుకోకూడదు. తాజా పండ్ల రసాల్లో సుక్రోజ్ పాళ్లు ఎక్కువగా ఉండి, కొవ్వులు దాదాపుగా ఉండవు. కాబట్టి ఒకవేళ డయాబెటిస్ లేకుండా ఉన్నవారు ఇలాంటి తాజాపండ్ల ద్రవాహారాన్ని తీసుకోవడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారితో పాటు తాజాగా బేరియాట్రిక్ సర్జరీ అయిన వారు కూడా తాజాపండ్ల రసాలను తీసుకోకపోవడమే మంచిది.





ఎప్పుడు తినాలి...

చాలామందిలో ఒక అపోహ ఉంది. అదేమిటంటే వ్యాయామం చేశాక తినడానికి చాలా వ్యవధి ఇవ్వాల్సి ఉంటుందని. అలాగని మరీ ఎక్కువ వ్యవధి ఇవ్వడం కూడా సరికాదు. దానివల్ల వ్యాయామం చేసినవారు మరీ నీరసపడిపోయే ప్రమాదం ఉంది. మన వ్యాయామ తీవ్రత ఎంతైనప్పటికీ వ్యాయామం పూర్తయ్యాక ఎంత వ్యవధి తర్వాత తినాలనే విషయంలో అన్నిటికంటే ఉత్తమమైన గడువు 30 నిమిషాలు. కాకపోతే 45 నిమిషాలు. అంతకంటే ఎక్కువ వ్యవధి ఇవ్వడం సరికాదు.



ఏయే సీజన్స్‌లో ఆయా పండ్లు...

వ్యాయామం చేసే ప్రతివారూ తాము తీసుకునే ఆహారం గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాళ్లలో చాలామందికి పండ్ల గురించి ఆలోచన తక్కువే. వ్యాయామం చేసేవారు ఏయే సీజన్‌లలో లభించే పండ్లను ఆయా సీజన్‌లలో తప్పక తీసుకోవాలి. కొందరు చలికాలంలో లభించే శీతాఫలం వల్ల జలుబు చేస్తుందని, అలాగే వేసవిలో దొరికే మామిడి పండు అసలే వ్యాయామం వల్ల పెరిగే వేడిని మరింత పెంచుతుందని... ఇలాంటి అపోహలతో ఆయా సీజన్ పండ్లను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ పండ్లలో ఆరోగ్యకరమైన విటమిన్లు, ఎండినపండ్లలో ప్రత్యేక పోషకాలు ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో నాలుగో వంతు పాళ్లలో వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుంది.



మిల్క్ షేక్స్: ‘ఈ రోజు హార్డ్ ఎక్సర్‌సైజ్ అయ్యింది’... ‘ఇవ్వాళ్ల వర్కవుట్ చాలా హెవీగా ఉంది’... ఒకలాంటి సంతృప్తి ధ్వనిస్తూ అప్పుడప్పుడూ వ్యాయామవేత్తలు చెప్పే మాట ఇది. ఇలా ఒక్కోసారి వ్యాయామం మరీ తీవ్రం చేసినప్పుడు, శారీరక శ్రమ ఎక్కువైనప్పుడల్లా తక్షణ శక్తి అవసరం. అందుకే మంచి మార్గం ద్రవాహారం రూపంలో పోషకాలు తీసుకోవడం. తీక్షణ వ్యాయామం తర్వాత కండరాలకు తక్షణ శక్తిని అందించడానికి ప్రోటీన్లు కావాలి. అయితే అది ఘనరూపంలో తీసుకోవడం వల్ల కండరాలకు చేరే వ్యవధి పెరుగుతుంది. అందుకే ప్రోటీన్లను ద్రవరూపంలో తీసుకుంటే అవి తేలిగ్గా, త్వరగా జీర్ణమవుతాయి. బాగా ఒంటికిపడతాయి. వెంటనే కండరాలకు చేరతాయి. అందుకే వ్యాయామం తర్వాత మిల్క్‌షేక్స్ తాగడం మంచిదే.

No comments: