Friday, November 23, 2012

శాకాహారమే శ్రేష్టం


(నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం)

సంస్కృతిలో అంతర్భాగం ఆహారం. ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఎవరి ఆహార సం స్కృతి వాళ్లకుగొప్ప. కాబట్టి, ఫలానా ఆహారం మంచిది, ఫలానా ఆహారం చెడ్డ ది అన్న చర్చ అర్థంలేనిది. అయితే, వాతావరణంలో వస్తున్నమార్పు ప్రపంచాన్ని అమితంగా వేడెక్కిస్తున్న నేపథ్యంలో ఆహారాన్ని పర్యావరణ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. 

అంతర్జాతీయ శాకాహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు జరుపుకోవడంలేదు. ఉత్తర అమెరికా వెజిటేరియన్ సొసైటీ 1977 నుంచి అక్టోబర్ 1న శాకాహార దినోత్సవాన్ని నిర్వహిస్తుంటుంది. అక్టోబర్ నెలంతా శాకాహారం తో కూడిన జీవనశైలివల్ల కలిగేమేలు గురించి ప్రచారంచేస్తున్నారు. మన దేశం లో రుక్మిణీదేవి అరండేల్ సారథ్యంలో మద్రాసు కేంద్రంగా ఇండియన్ వెజిటేరియన్ కాంగ్రెస్ 1959లో కార్యకలాపాలు ప్రారంభించింది. దీన్ని ప్రస్తుతం ‘వరల్డ్ వెజిటేరియన్ కౌన్సిల్’గా మార్చారు. భారత్, ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లో నవంబర్ 25న ప్రపంచ శాకాహార దినోత్సవం నిర్వహిస్తున్నారు. 

అమెరికాలో ఈ మధ్య ‘సోమవారం మాంసం తినడం మానండి!’ పేరిట ఉద్యమం ప్రారంభమైంది. తద్వారా 15 శాతం మాంసం వినియోగం తగ్గుతుం దని అంటున్నారు. ‘సమతుల శాకాహారం అన్ని వయసుల వారికి, గర్భవతులకు, బాలింతలకు, క్రీడాకారులకు నూటికి నూరుపాళ్లూ పుష్టికరమైన ఆహా రం...’ అని అమెరికన్ డైట్ అసోసియేషన్ ప్రకటించింది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో పశుమాంసం వినియోగం చాలాఎక్కువ. 

అందుకోసం పారి శ్రామిక పద్ధతుల్లో భారీ సంఖ్యలో పశువుల్ని పెంచుతున్నారు. ఉష్ణోగ్రత ఈ శతాబ్దం అంతానికి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరిగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పారిశ్రామిక పశుపోషణ కేంద్రాలను 25 శాతం తగ్గించగలిగితే... వాతావరణ మార్పును చాలా వరకూ అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అడవులు నరికిన భూముల్లో పశువులకు దాణా సాగు కు ఉపయోగించడంవల్ల వాతావరణం వేడెక్కుతోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూభాగంలో 30 శాతా న్ని పశువుల పెంపకానికి వినియోగిస్తున్నారు. మాంసాహార వినియోగం 2050 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరిస్తోంది. మాంసకృత్తులను అందించడంలో శాకాహారమే అనేక విధాలుగా మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులను అం దించే ఆహారపదార్థాలలో ఏవి మెరుగైనవో చూస్తే ఆరు విధాలుగా శాకాహారమే మేలని తేలిందని ప్రపంచ బ్యాంక్‌కు సీనియర్ పర్యావరణ సలహాదారుగా పనిచేసిన రాబర్ట్ గుడ్‌లాండ్ అంటున్నారు. 

* ఖర్చులన్నీ కలిపి చూసినా గిట్టుబాటు కావడం.
* ట్రాన్స్ ఫ్యాట్స్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్, నైట్రేట్లు, నైట్రోసమైన్స్, సోడియం ప్రిజర్వేటివ్స్ వంటి హానికారకాలు తక్కువగా ఉండటం లేదా అసలు లేకుండా ఉండటం. 
* మాంసకృత్తులతోపాటు పీచు వంటి ఆరోగ్యదాయక పదార్థాలు ఉండటం.
* రోజువారీగా వినియోగించే ఆహారంలో అవసరమయ్యే అమినో యాసిడ్లన్నీ ఉండటం. 
* తక్కువ భూమిని ఉపయోగించి ఎక్కువ మాంసకృత్తులను ఉత్పత్తి చేయడం.
* పోషకాల సాంద్రత కలిగి ఉండటం. కూరగాయలు అత్యధిక పోషకాల సాంద్రత కలిగి ఉంటాయి. అవసరమైన అమినో యాసిడ్లు పంటల ద్వారా మాత్రమే లభిస్తాయి. 

ఎకరం పొలంలో పశువులను పెంచి ఉత్పత్తి చేసే మాంసకృత్తులకన్నా.. వివిధ పంటలసాగు ద్వారా అంతకు ఐదురెట్లు మాంసకృత్తులను ఉత్పత్తి చేయవచ్చు. సోయాచిక్కుళ్లలో మాంసకృత్తులు మరింత అధికంగా (10-15 రెట్లు) ఉంటాయి. రకరకాల పంటల ద్వారా వివిధ అమినో యాసిడ్లు శాకాహారులకు అందుబాటులోకివస్తాయి. మాంసంలో మాంసకృత్తులు అధికంగా లభించినప్పటికీ.. అవి సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్‌తో కూడి ఉంటాయి. పొట్టుతీయని ధాన్యాల పొడులు, చిరుధాన్యాలు, ముడి బియ్యం ద్వారా కేలరీలు, ఖనిజాలు, విటమిన్లు, పీచుపదార్థం పుష్కలంగా లభ్యమవుతాయి.

పప్పుధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉండడమేకాక అనారోగ్యకరమైన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బి12 వంటి అనేక విటమిన్లు, సూక్ష్మపోషకాలు వ్యవసాయోత్పత్తుల్లో కొరవడుతున్నాయి. పంటలను సారవంతమైన భూముల్లో పర్యావరణానికి హానిచేయని పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో సకల పోషకాలూ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తులకు శాకాహారంపై ఆధారపడ టం పెరిగితే రానున్న కాలంలో వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తవుడు తీసిన తెల్ల బియ్యానికి స్వస్తిచెప్పి... పీచుపదార్థంతో పాటు, సకల పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎదురే ఉండదు. 

No comments: