Wednesday, November 7, 2012

మీ ఆహారంలో పరిమితంగా వెన్న.........


 


 స్వాభావికంగా లభించే ఏ ఆహార పదార్థం కూడా పరిమితులకు లోబడి తీసుకుంటే హానికరం కాదు. ఏదైనా పరిమితికి మించి తినడం అన్నది అనర్థదాయకం అవుతుంది. అందుకే అతి సర్వత్ర వర్జయత్ అనే సామెత పుట్టింది. అపరిమితంగా వెన్న తినడం వల్ల జరిగే అనర్థాల గురించి మీరు వినే ఉంటారు కాబట్టి మీ భయాందోళనలు తొలగించడానికి మీరు మీ ఆహారంలో పరిమితంగా వెన్న తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ......
ఆహార పదార్థంగా వెన్న వల్ల కలిగే లాభాల గురించి చాలామందికి పెద్దగా తెలియదు. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి. విటమిన్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు చదివి ఉంటారని భావిస్తూ... నిపుణులకు తప్ప సాధారణ ప్రజలకు అంతగా తెలియని బ్యుటిరేట్, సీఎల్‌ఏ గురించి కాస్త చదవండి ....


బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల (మెంటల్ ఇల్‌నెస్) నుంచి రక్షణ కల్పిస్తుంది. దాంతోపాటు మనకు శక్తి వనరుగా ఉపయోగపడుతూ అవసరమైన శక్తిని ఇస్తుంది. మనం తిన్న ఆహారం చిన్న పేగుల నుంచి ఒంటికి పడుతుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా జరిగే క్రమంలో తిన్న ఆహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది బ్యుటిరేట్. అంటే ఒంటికి పట్టకుండా వృథా అయిపోయే ఆహారాన్ని వీలైనంతగా తగ్గిస్తుందన్నమాట.

పైగా చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుంది. ఇక కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) విషయానికి వస్తే - మనకు అవసరమైన పోషకాలలో దానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. గుండె ఆరోగ్యానికి అదెంతో మంచిది. నిజానికి చాలామంది వెన్న తినడం వల్ల కొవ్వు పెరిగి, గుండె ఆరోగ్యానికి అదంత మంచిది కాదని అనుకుంటారు. కానీ పరిమితమైన వెన్న వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. ముఖ్యంగా పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న దోహదపడుతుంది.

తద్వారా కొంతవరకు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు వెన్నలో యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు వెన్నను మానేయాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని పరిమితంగా తీసుకుంటూ ఉండండి. నెయ్యి కంటే వెన్న చాలా శ్రేష్టమైనది. నిజానికి చిన్నప్పుడు మనం వెన్నపూస ఒంటికి మర్దనా చేసుకునే వాళ్లం. దొరికినప్పుడల్లా వెన్నను లొట్టలేసుకుంటూ తినేవాళ్లం. అవన్నీ మరచిపోవడం వల్ల, అపోహలకు గురవ్వడం వల్ల వ్యాధిగ్రస్తులమవుతున్నాం. మీరు నిశ్చితంగా పరిమితమైన మోతాదులో వెన్నను తినవచ్చు. అన్ని వయసుల వారు కూడా వెన్న తినవచ్చు. ఫ్రెండ్స్ చెప్పే మాటలతో అయోమయానికి లోనైనప్పుడు నిపుణులను సంప్రదించి నిశ్చింతగా ఉండండి.

No comments: