Sunday, November 25, 2012

యుద్ధం చేద్దాం!

కాంగ్రెస్ 56 ఏళ్లుగా తెలంగాణను మోసం చేస్తోంది.. టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామన్నారు.. మళ్లీ వంకర బుద్ధి చూపించారు 
కాంగ్రెస్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. స్వీయ రాజకీయ అస్తిత్వంతోనే తెలంగాణ సాధ్యం 
వీధుల్లో పోరాడుతూనే.. రాజకీయశక్తిగా ఎదగాలి 
బాబు పాలనలో రిటైర్మెంట్లే.. రిక్రూట్‌మెంట్లు లేవు
మాకు రాజన్న, చంద్రన్న రాజ్యాలు వద్దు..
తెలంగాణ రాజ్యం కావాలి...
తెలంగాణ కోసం డప్పుకొట్టి దండోరా వాయించే నాయకత్వం కావాలి: కోదండరాం 


(సూర్యాపేట సమరభేరి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి):తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆది నుంచీ మోసం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. కుక్కతోక వంకరలా ఆ పార్టీ బుద్ధి మారటం లేదన్నారు. అందుకే సూర్యాపేట సమరభేరితో కాంగ్రెస్‌పై యుద్ధం ప్రకటిస్తున్నట్లు స్పష్టంచేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వం సాధించటం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. ఉద్యమ సందర్భంలో పోరాడుతూనే రాజకీయ సందర్భంలో స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని సాధించుకోవటం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సిద్ధించుకోవాలని పిలుపునిచ్చారు. 

నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని కొండేటి వేణుగోపాల్‌రెడ్డి సభా ప్రాంగణంలో ఆదివారం జరిగిన ‘తెలంగాణ సమరభేరి’లో కేసీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణను 56 ఏండ్ల నుండి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారే నన్ను ఢిల్లీకి పిలిచిండ్రు. ఎందుకని అడిగితే తెలంగాణ ఇస్తం.. మాట్లాడుకుందాం రమ్మన్నరు. కాంగ్రెస్‌పై నమ్మకం లేకున్నా పాండవుల పక్షాన కౌరవుల వద్దకు శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లినట్లు.. అయిననూ పోయిరావలె హస్తినకు అన్నట్లుగా పోయిన. పన్నెండు ఏండ్లుగా కొట్లాడుతున్న పార్టీని విలీనం చేస్తే తెలంగాణ ఇస్తమన్నరు. ఏం చేద్దామని కోదండరాంను అడిగిన. ఎట్లయితేంది తెలంగాణ వచ్చుడే ముఖ్యమని చెప్పిండు. ఎంతోమంది నాయకుల రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి విలీనం చేయటానికి కూడా ఒప్పుకున్నం. అయినా కుక్కతోక వంకర అన్నట్లుగా కాంగ్రెస్ బుద్ధి మార్చుకోలేదు. కాంగ్రెస్ పైనే పోరాటం చేద్దామని సమరభేరితో యుద్ధం ప్రకటిస్తున్నం’’ అని ఆయన చెప్పారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై విరుచుకుపడుతూనే వైఎస్సార్ కాంగ్రెస్‌పైనా కేసీఆర్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. 

బాబుకు విశ్వసనీయత ఏం తెలుసు? 


‘‘విశ్వసనీయత అంటే ఏమిటని చంద్రబాబు అడుగుతున్నడు. విశ్వసనీయత అంటే సింగపూర్ సిటీలోని దుకాణాల్లో దొరకదు. అట్లా కొంచెం ఎక్కువ దొరికితే హెరిటేజ్ దుకాణాల్లో పెట్టుకుని కమీషన్లకు అమ్ముకుంటవా? విశ్వసనీయత అంటే ఇచ్చిన మాటను అమలు చేయటం.. మాట తప్పటం కాదు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి డిసెంబర్ 9 నాడు ప్రకటన రాగానే అడ్డంపడిన చంద్రబాబుకు విశ్వసనీయతంటే ఏం తెలుస్తుంది?’’ అని కేసీఆర్ ఎద్దేవాచేశారు. అలాంటి చంద్రబాబు కాళ్లయాత్ర కాదు మోకాళ్లయాత్ర చేసినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ‘‘ఒకాయన ఒక లాయర్‌ను పిలిపించుకుని వీలునామా రాస్తున్నాడట. పెద్ద కొడుకుకు 70 ఎకరాల మామిడి తోట, చిన్న కొడుకుకు వందెకరాల నిమ్మతోట, బిడ్డకో 10 లక్షల రూపాయలు చెందాలని రాయమన్నాడట. అవన్నీ రాసింతర్వాత వివరాల కోసం ఎక్కడున్నాయని లాయర్ అడిగాడట. ‘ఇప్పుడైతే అవి లేవు కానీ భవిష్యత్తులో సంపాదిస్తా’ అని అన్నాడట. చంద్రబాబునాయుడు చేస్తున్న హామీలు, చెప్తున్న మాటలు అట్లనే ఉన్నయి’’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 

వాళ్లేమన్నా కిన్నెరకింపురుషులా? 

‘‘పాదయాత్ర పేర్లతో ఉడుముల లెక్క తెలంగాణ మీద పడుతున్నరు. ఆచరణ సాధ్యం కాని హామీలతో చంద్రన్న రాజ్యం, రాజన్న రాజ్యం అంటున్నరు. వాళ్ల రాజ్యాలను చూడలేదా? ఏదంటే అది చేయటానికి వాళ్లేమన్నా గాంధర్వులా? కిన్నెరకింపురుషులా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘చంద్రన్న రాజ్యంలో ఎవరన్నా సుఖంగా ఉన్నరా? రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్‌మెంట్లు లేవు. ఉద్యోగాలను తీసేసి కాంట్రాక్టు ఉద్యోగాలు చేయించిండు. పరిపాలనా సంస్కరణల పేరుతో ఉన్న ఉద్యోగాలను కుదించిండు. ఇలాంటి రాజ్యం కావాల్నా?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘పులిచింతల, పోలవరంతో తెలంగాణ నీళ్లను దోచుకుపోయిన వైఎస్ పాలన మనం చూడలేదా? నలభై ఏండ్లయినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేయకుండా పోతిరెడ్డిపాడును మూడేండ్లలోనే కట్టేసిన రాజన్న పాలన కావాల్నా?’’ అని అడిగారు. పదిహేను వందల మంది రైతుల ఆత్మహత్యలు వైఎస్ పాలన ఫలితం కాదా అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం తమకొద్దని, తెలంగాణ రాజ్యమే కావాలని పేర్కొన్నారు. 


స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలి... 

వంద కోట్ల మంది దేశ ప్రజలు ఒప్పుకుంటే తెలంగాణ రాష్ట్రమని చెప్పిన వైఎస్ హయాంలో తెలంగాణను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ విమర్శించారు. వైఎస్ కడపలో యోగివేమన యూనివర్సిటీని పూర్తిచేసి తెలంగాణ యూనివర్సిటీని నిర్లక్ష్యం చేశారన్నారు. కడపలోనే రిమ్స్‌ను ఆగమేఘాల మీద పూర్తిచేసి బీబీనగర్‌లోని నిమ్స్‌ను దిక్కులేకుండా చేశారని ఆరోపించారు. వక్ఫ్ భూములను లగడపాటికి ఇచ్చారన్నారు. పోలవరం కట్టి భద్రాద్రి రాముడిని ముంచే రాజ్యం మనకెందుకని ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీలతోనే పార్లమెంటును వారం రోజుల పాటు స్తంభింపజేశామన్నారు. అదే 16 మంది ఎంపీలు గులాబీ జెండాలు కప్పుకుని పార్లమెంటులో ఉంటే రాష్ట్రం వచ్చేదన్నారు. తెలంగాణ కోసం వీధుల్లో పోరాడుతూనే స్వీయ రాజకీయశక్తిగా తెలంగాణ ప్రజలు ఎదగాలన్నారు.

సీమాంధ్ర సంపన్నులతోనే యుద్ధం: కోదండరాం 

ఇది తెలంగాణ ప్రజలకు, సీమాంధ్ర సంపన్నవర్గాలకు జరుగుతున్న పోరాటమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నేతలతోనూ, ప్రజలతోనూ వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలను దోచుకుపోయిన పార్టీలపైనే తమ పోరాటమన్నారు. డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను.. సీమాంధ్ర సంపన్నవర్గాల బలానికి అమ్ముడుపోయిన కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. ‘‘తెలంగాణను అడ్డుకున్నానా అని అంటున్న చంద్రబాబుకు, టీడీపీకి ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత లేదా?’’ అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న, కేసులు ఎదుర్కొంటున్న, ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి మాట్లాడకుండా కేవలం అధికారం కోసమే విజయమ్మ, షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు. నాలుగైదురోజుల్లో జేఏసీ సమావేశమై పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతుందన్నారు. డిసెంబరు 9న స్ఫూర్తి దినంగా, డిసెంబరు 23న నిరసనల దినంగా పాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ పేర్వారం రాములు, రిటైర్డ్ సీఈ విద్యాసాగర్‌రావు, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. 

విజయశాంతి డుమ్మా: సమరభేరికి ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ విజయశాంతి హాజరుకాలేదు. రెండో దశ ఉద్యమంలో కీలకంగా భావిస్తున్న సూర్యాపేట సమరభేరికి ఆమె దూరంగా ఉండటంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘ఆమెను టీఆర్‌ఎస్ పిలవలేదా..? లేక కావాలనే ఆమె గైర్హాజరయ్యారా..! లేక ఇతర కారణాలున్నాయా?’ అని పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకున్నాయి.


వైఎస్సార్ కాంగ్రెస్సే కేసీఆర్ లక్ష్యం!

సమరభేరి సభకు.. నల్లగొండ జిల్లా నుంచే కాకుండా పొరుగునే ఉన్న వరంగల్ జిల్లా నుంచి కూడా జనాన్ని సమీకరిం చారు. దీంతో సభాస్థలి నిండిపోయింది. కేసీఆర్ తన ప్రసంగం లో ప్రధానంగా.. ఇటీవల తెలంగాణ జిల్లాల్లో మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ముఖ్య నాయకుల చేరికలతో బలపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా ఎంచుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను కూడా వదల్లేదు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో చేపట్టిన జలయజ్ఞంలో తెలంగాణలోని ప్రాజెక్టులే పూర్తి కాలేదని ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల, నెట్టంపాడు, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టులను ఉదహరించారు. తెలంగాణలో ఆంధ్ర పార్టీలను లేకుండా చేయాలని, ఆంధ్ర పార్టీల్లో పనిచేసే నాయకులను తరిమివేయాలని, స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపు ఇచ్చారు.

No comments: