Wednesday, November 28, 2012

ఇక్రిశాట్... రైతుకోసం.... రైతే లోకం.....

పేద రైతులకు ఒక వరం... 
తగిన వర్షపాతం లేని కరవు దేశాలకు ఆలంబన...
ఉష్ణమండల ప్రాంత పంటల అభివృద్ధికి దిక్సూచి... 
భారత్‌సహా 55 దేశాల్లోని కోట్లాది పేద రైతులకు వెలుగుదారి... 
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ‘ఇక్రిశాట్’ ఘనత ఇది!
తన సుదీర్ఘ సేవా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అందుకొన్న ఈ సంస్థ ప్రస్తుతం 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.. 
ఈ సందర్భంగా.. సమాజానికి ఇక్రిశాట్ అందించిన కొన్ని ‘రత్నాల’ గురించి తెలుసుకుందాం...
 

వాటర్‌షెడ్‌లతో సుస్థిర గ్రామీణాభివృద్ధి

సామాజిక కోణంలో వాటర్‌షెడ్‌ల నిర్వహణ తో సమీకృత గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. వర్షపాతం తక్కువగా ఉండే ఉష్ణమండల పొడినేలల ప్రాంతాల్లో నీటికొరతే పేదరికానికి తొలి కారణమవుతోంది. సహజవనరుల లేమితోపాటు పంటల దిగుబడి చిన్న రైతులకు సవాలే. దీనికి చెక్ పెట్టేందుకు ఇక్రిశాట్ సామాజిక వాటర్‌షెడ్ నిర్వహణను చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలను, పౌర, వ్యవసాయ సంఘాలను సంఘటితం చేసి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. 
ఇవీ ఫలితాలు... రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి సుస్థిర అభివృద్ధి సాధించిన గ్రామంగా రికార్డులకెక్కింది. సైన్స్ ఆధారిత గ్రామీణాభివృద్ధికి మార్గదర్శిగా మారింది. ఇక్రిశాట్ సహకారంతో అమలుచేసిన ఆద ర్శ్ వాటర్‌షెడ్ నిర్వహణ , ఇతర కార్యక్రమాలే గ్రామ రూపురేఖలు మార్చేశాయి. వాటర్‌షెడ్‌లతో నీటి లభ్యత పెంచడం, కూరగాయలతోపాటు విలువ గల పంటలు పండించడం, దిగుబడులు పెంచడం వల్లే ఇది సాధ్యమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని పవర్‌గూడ గ్రామంలోనూ పశుపోషణ, ఆయిల్ విత్తనాల పంటలు, నర్సరీలు, వర్మీ కంపోస్టింగ్ వంటివాటితో గ్రామస్థుల సగటు ఆదాయం ఏకంగా 77% పెరిగింది. రాజస్థాన్‌లో భూగర్భజలాలు 5.7 మీటర్ల వరకూ పెరిగాయి. దిగుబడులు 2-3 రెట్లు పెరిగాయి. పంటల విస్తీర్ణం 51% పెరిగింది. చైనా, వియత్నాం దేశాల్లోనూ ఈ వాటర్‌షెడ్‌లను ఇక్రిశాట్ అమలు చేస్తోంది. దీనివల్ల ఆసియాలో కనీసం 2 కోట్ల మంది జీవితాలు మారిపోయాయని అంచనా. 

సూక్ష్మమోతాదులతో భారీ ప్రయోజనాలు..

సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఎరువులను సూక్ష్మ మోతాదులో వినియోగించడం ద్వారా వ్యవసాయంలో భారీ ప్రయోజనాలను పొందే ఈ కార్యక్రమాన్ని ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాంతంలోని పలు దేశాల్లో ఇక్రిశాట్ అమలుచేసింది. పంట విత్తే సమయంలో పొలమంతా ఎరువులు చల్లకుండా విత్తనంతోపాటే కొద్ది మోతాదులో- అదీ నేలకు అవసరమైన ఎరువునే వేసే ఈ పద్ధతి వల్ల పంట దిగుబడి, ఆదాయం గణనీయంగా పెరిగింది. జొన్న, తృణధాన్యాల దిగుబడులు సుమారుగా 44-120 శాతం వరకూ పెరిగాయి. జింబాబ్వే తదితర దేశాల్లోని వేలాది పేద రైతుల ఆదాయం ఏకంగా 50-130 శాతం వరకూ పెరిగింది. 2012 చివరికల్లా ఈ పద్ధతిని ఆఫ్రికాలో 3.60 లక్షల మంది రైతులకు నేర్పించాలన్నది ఇక్రిశాట్ ప్రాంతీయ ప్రాజెక్టు లక్ష్యం. 

వ్యవసాయ అభివృద్ధికి గ్రామస్థాయి అధ్యయనాలు...

గ్రామస్థాయిలో ప్రజలను ఆధారం చేసుకుని అంతర్జాతీయ అధ్యయనం ద్వారా ఉష్ణమండల ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ఉన్న మార్గాలు, ఆటంకాలను గుర్తించే గ్రామస్థాయి అధ్యయనాలకు శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సమగ్ర సమాచారాన్ని ఒకచోటికి చేర్చి డాటా బ్యాంక్‌గా అందుబాటులో ఉంచేందుకు నడుం కట్టింది. ఇక్రిశాట్ 1975 నుంచి సేకరిస్తున్న ఈ సమాచారమే ఇప్పుడు అనేక అంతర్జాతీయ పరిశోధనలకు కీలకమవుతోంది. 

ఎఫ్లాటాక్సింగ్ టెస్టింగ్ కిట్...

శిలీంధ్రాల నుంచి విడుదలయ్యే ఎఫ్లాటాక్సిన్ అనే విషపూరిత రసాయనం నుంచి వేరుశనగ తదితర పంటలకు అతితక్కువ ఖర్చుతోనే విముక్తి కలిగిస్తూ పేదదేశాల రైతులకు ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశంతో చేసిన ఆవిష్కరణ ఇది. ఎఫ్లాటాక్సిన్ విషపూరిత రసాయనం వల్ల వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, మిరప వంటి అనేక పంటలు కలుషితమవుతాయి. ఎఫ్లాటాక్సిన్ బీ1 అనే రసాయనం పశువులకు, మనుషులకూ చాలా ప్రమాదకరం. అందుకే వెనకబడిన దేశాల రైతుల పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ బాగా పడిపోతోంది. అయితే, తేలికైన, చవకైన ఎఫ్లాటాక్సింగ్ టెస్టింగ్ కిట్ వల్ల పంటలను పరీక్షించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సులభం కావడంతో భారత్ సహా ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

రైతు నేస్తాలుగా ఇక్రిశాట్ వంగడాలు... 

ఆసియా, ఆఫ్రికా దేశాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ మంచి దిగుబడులనిచ్చే జొన్న, సజ్జ, కంది, శనగ తదితర పంటల వంగడాలను ఇక్రిశాట్ రూపొందించింది. 

కరవును తట్టుకునే వేరుశనగ...

వ్యాధులను, కరవును తట్టుకునేలా ఇక్రిశాట్ రూపొందించిన నాణ్యమైన వేరుశనగ వంగడం.. 60 ఏళ్లుగా వాడకంలో ఉన్న అనేక వంగడాల స్థానాన్ని ఆక్రమించి లక్షలాది బడుగు రైతుల్లో వెలుగులు నింపింది. ఇక్రిశాట్ రూపొందించిన అనంతజ్యోతి వంగడం ఇప్పుడు ఆ జిల్లా రైతులకు లబ్ధి కలిగిస్తోంది. 

40 శాతం అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కంది... 

సంప్రదాయ కందివంగడాలతో పోల్చితే 40% వరకూ అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కంది వంగడాలను ప్రైవేటు సంస్థలతో కలిసి ఇక్రిశాట్ రూపొందించింది. కెన్యా, మలావీ తదితర ఆఫ్రికా దేశాల రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంది వంగడాలు నాణ్యమైన దిగుబడులతో వారి ఆదాయాన్ని 80 శాతం వరకూ పెంచాయి. ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాల్లో ప్రధాన పంటల్లో ఒకటైన కంది జీనోమ్ (జన్యుపట ం)ను కూడా ఇక్రిశాట్ ఆవిష్కరించి పంట అభివృద్ధికి అనేక మార్గాలు అవలంబించేందుకు కృషిచేసింది. 

తీపి జొన్న...

ఇక్రిశాట్ రూపొందించిన ఈ వంగడం బహుళ ప్రయోజనకరం. ఆహారంగా మాత్రమే కాకుండా పీచు, ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. కరవును, వాతావరణ మార్పును తట్టుకుంటుంది. జొన్న, మొక్కజొన్న కంటే రైతులకు ఎంతో లాభదాయకమైనది. 

అందరికీ అందుబాటులో విజ్ఞానం...

ఆహార భద్రతను పెంపొందించేందుకోసం ఇక్రిశాట్ జన్యు వనరులతో కూడిన జీన్‌బ్యాంకును నిర్వహిస్తోంది. ఈ బ్యాంకులో 1,20,000 జన్యువనరులు ఉన్నాయి. ఇక్రిశాట్ వెబ్‌సైట్‌లో ఇంటర్నేషనల్ పబ్లిక్ గూడ్స్ (ఐపీజీఎస్) పేరుతో పొందుపర్చిన జన్యువనరుల సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ పేరెంట్స్ రీసెర్చ్ కన్సార్షియం పేరుతో నిర్వహించే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య శాస్త్రీయ ఆవిష్కరణలు, ఉత్పత్తులు పేదలకు ఐపీజీఎస్‌లో అందుబాటులో ఉంటాయి. సంస్థాగతమైన అనేక ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రాజెక్టుల వివరాలను కూడా భాగస్వాములు, ఔత్సాహికులు ఉచితంగానే పొందవచ్చు.

పేదల జీవనాధారం మెరుగుపర్చింది... 

ఇక్రిశాట్‌కు 40వ ఏడాది అయిన 2012 సంవత్సరాన్ని మైలురాయిగా భావిస్తున్నాం. ఉష్ణమండల ప్రాంత పేద ప్రజలకు ఇన్నేళ్లుగా సంస్థ చేసిన సేవలు, సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ‘ద జివెల్స్ ఆఫ్ ఇక్రిశాట్’ పుస్తకాన్ని ప్రచురించాం. ఆసియా, ఆఫ్రికాలలోని 55 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సుమారు 80 కోట్లమందికి ఇక్రిశాట్ సేవలు అందుతున్నాయి. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఇక్రిశాట్ చేపట్టిన అనేక కార్యక్రమాలు గ్రామీణుల జీవనాధారాన్ని మెరుగుపర్చాయి. ఇక్రిశాట్ భాగస్వామిగా ఉన్న సీజీఐఆఏఆర్ సంస్థ పెట్టిన ప్రతి డాలరుకీ 17 డాలర్ల ప్రతిఫలాన్ని నమోదుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాముల వల్లే ఈ ఘన విజయాలు సాధ్యమయ్యాయి.
- ‘ది జివెల్స్ ఆఫ్ ఇక్రిశాట్’ ముందుమాటలో ఆ సంస్థ డెరైక్టర్ జనరల్ విలియం డీ డార్

No comments: