Tuesday, November 20, 2012

పాప్‌కార్న్ తింటే పరమారోగ్యం...!


ఇప్పటివరకూ మీకు తెలిసిందేమిటి? సినిమా చూస్తూ ఏదో పంటి కింద పటపటలాడించడానికి పనికి వచ్చేదే పాప్‌కార్న్. అంతేగా? కానీ, న్యూట్రిషన్ పరంగా చూస్తే పాప్‌కార్న్ అంత తేలిగ్గా తీసిపారేయదగ్గ ఆహారమేమీ కాదు. అది షుగర్‌ను నియంత్రణలో పెడుతుంది. గుండెజబ్బుల్ని అదుపులో ఉంచుతుంది. ఇదేదో అల్లాటప్పాగా చెప్పడం కాదు. ఒక అధ్యయనంలో నిరూపితమైన సత్యం. కాబట్టి ఇది నిశ్చయంగా పాప్‌కార్న్ ప్రియులకు ఇది శుభవార్తే.

అమెరికాకు చెందిన నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహా నగరానికి చెందిన సెంటర్ ఫర్ న్యూట్రిషన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తెలిసిన విశేషాలు చాలా ఉన్నాయి. పాప్‌కార్న్ తిననివారితో పోలిస్తే రోజూ పాప్‌కార్న్ తినేవారికి ముడిధాన్యాలు తిన్నందువల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 250 శాతం అధికంగా ఉంటాయట. అంతేకాదు పొట్టుతీయని ధాన్యాన్ని పేలాలు (పాప్‌కార్న్)గా వేపడం వల్ల మిగతావారిలో పోలిస్తే పాప్‌కార్న్ తినేవారికి పీచుపదార్థాలు 22 శాతం అధికంగా లభ్యమవుతాయట.

అన్నట్టు దీన్నంతా చదివాక అదేపనిగా పాప్‌కార్న్ తినడం కూడా మంచిది కాదు. దానికీ ఒక కారణం ఉంది... పాప్‌కార్న్‌కు మరింత రుచిని ఇవ్వడం కోసం దానికి కలిపే ప్రతి టేబుల్ స్పూనంత వెన్న/నూనె/కొవ్వు పదార్థాల వల్ల్ల 100 క్యాలరీలు సమకూరడంతో పాటు గుండెకు రక్తసరఫరా చేసే ధమనిలో ఎనిమిది గ్రాముల కొవ్వు పేరుకునే అవకాశం కూడా ఉంది.

 
అంటే... నూనె వెయ్యని పొడి పేలాల వల్లనే పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. అంతేగాని నూనె లేదా బటర్ చేర్చే పాప్‌కార్న్‌తో కాదని గుర్తుంచుకోండి. ఇకపై పాప్‌కార్న్‌తో ప్రయోజనాలు పొందదలిచారా? షాపింగ్ మాల్స్‌లోనో లేదా సినిమా హాల్స్‌లోనో దొరికే నూనె చేర్చిన పాప్‌కార్న్స్ తినకండి. ఇంట్లో పొడిగా పేలాల్లా (ఎయిర్ పాప్‌డ్ కార్న్స్) వేపుకోండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి.

No comments: