Friday, November 23, 2012

మొలకెత్తే బలం...

మొలకలు తింటే మంచిది అంటారు.
జీవం ఏదైనా ఆరోగ్యమే.
గింజ నుంచి మొలకెత్తే జీవం ఇంకా ఆరోగ్యం.
కాని, రోజూ అలాగే... పచ్చిగానే... చప్పిడిగానే అంటే... కొంచెం బోర్.
మైండ్ అప్లయ్ చేయాలి.
కిచెన్ సరంజామాతో మ్యాజిక్ చేయాలి. కొంచెం టొమాటో తరుగు, కాసింత వెల్లుల్లి పొడి, జీలకర్ర, నిమ్మరసం...
అన్నింటినీ జత చేస్తే... ఆపైన రుచి చూస్తే... ఉదయానికి నమస్తే...
ప్రతి ఉదయానికీ ఆరోగ్యమస్తే!


మొలకెత్తిన పెసలు

కావలసినవి
మొలకెత్తిన పెసలు - ఒకటిన్నర కప్పు
టొమాటో తరుగు - కప్పు
కీరా తరుగు - కప్పు
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్
క్యాప్సికమ్ / పచ్చిమిర్చి తరుగు - తగినంత
సలాడ్ డ్రెస్సింగ్ కోసం...
మిరియాల పొడి - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
జీలకర్ర - టీ స్పూన్
నిమ్మరసం - టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్
పంచదార లేదా బెల్లం - టీ స్పూన్

తయారి
సలాడ్ డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి.

గిన్నెలో పావు కప్పు కన్నా తక్కువ నీళ్లు పోసి, ఉప్పు కలిపి మరిగించాలి. అందులో మొలకెత్తిన గింజలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గింజలను చల్లారనివ్వాలి.

సలాడ్ డ్రెస్సింగ్ కోసం కలిపిన మిశ్రమాన్ని, చల్లారిన గింజలపై వేసి కలపాలి.

సర్వ్ చేసే గిన్నెలో టొమాటో, కీరా తరుగు, ఆ పైన స్ప్రౌట్స్ ఉంచి, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుతో గార్నిష్ చేయాలి.

నోట్: మొలకెత్తిన గింజలను, కూరగాయల తరుగును కలిపి ఎక్కువసేపు ఉంచకూడదు. దీనివల్ల పచ్చి వాసన వేసి, తినాలనిపించదు.

బఠాణీ సలాడ్

కావలసినవి
మొలకెత్తిన /బాగా నానిన బఠాణీలు - అర కప్పు, క్యారట్ ముక్కలు - అర కప్పు, బంగాళదుంప - 1, బీన్స్ - అర కప్పు, పెరుగు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, నిమ్మరసం - టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత

తయారి
కూరగాయ ముక్కలను, బఠాణీలను ఉడికించి, పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో పెరుగు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.

పెరుగు మిశ్రమాన్ని బఠాణీలు, కూరగాయల ముక్కల్లో వేసి, బాగా కలిపి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.

శనగల సలాడ్

కావలసినవి
శనగలు (ఉడికించినవి) - 3 కప్పులు
బంగాళదుంప - 1 (ఉడికించి, ముక్కలు చేయాలి), పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి - 1 (తరగాలి), ఉల్లితరుగు - 2 టేబుల్ స్పూన్లు, టొమాటో - ఒకటి (తరగాలి)
పంచదార - అర టీ స్పూన్,
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - చిటికెడు
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్

తయారి
ఒక గిన్నెలో పచ్చిమిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయ, టొమాటో తరుగులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.

ఉడికించిన శనగలను పై మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

నోట్: మొలకెత్తిన శనగలకు కొద్దిగా నీరు కలిపి, 2 నిమిషాలు ఉడికించి సలాడ్‌కి వాడుకుంటే బాగుంటాయి.

మిక్స్‌డ్ బీన్స్ సలాడ్

కావలసినవి
బొబ్బర్లు+శనగలు+సోయా - కప్పు, టొమాటో - 1(గుండ్రంగా తరగాలి)
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్,
జీలకర్ర - అర టీ స్పూన్,
పసుపు - చిటికెడు
కరివేపాకు - రెమ్మ, కీరా - అరముక్క
(గుండ్రంగా తరగాలి)
ఉప్పు - తగినంత, ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్, నిమ్మరసం - టీ స్పూన్, మిరియాల పొడి - చిటికెడు

తయారి
బొబ్బర్లు, శనగలు, సోయా గింజలను ఉడకబెట్టి పక్కన పెట్టాలి.

ఆలివ్ ఆయిల్‌లో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర కలపాలి.

టొమాటో, కీరా, బొబ్బర్లు, శనగలు, సోయాగింజలు ఒక గిన్నెలో వేసి కలపాలి. అందులో ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని వే సి కలిపి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

గింజలు మొలకెత్తాలంటే...

పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, కందులు, పచ్చిబఠాణీలు, బీన్స్... ఇలా గింజధాన్యాలు మొలకెత్తాలంటే పది నుంచి పన్నెండు గంటలు నీళ్లలో నానబెట్టాలి.

ఆ తర్వాత గింజలను పల్చటి వస్త్రంలో వేసి, నీటిని వడకట్టాలి. తర్వాత కాస్త మందంగా ఉన్న వస్త్రంలో ఆ గింజలను వేసి, గట్టిగా మూట కట్టాలి. ఈ మూటను వెచ్చగా ఉండే చీకటి ప్రదేశం లో ఒక రోజు ఉంచాలి.

మొలకలకు నాణ్యమైన గింజలను ఎంచుకోవాలి. గింజ గట్టిదనాన్ని బట్టి కొన్ని రెండు రోజులకు కూడా మొలకలు రావచ్చు.

మొలకెత్తిన గింజలను ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే నాలుగైదు రోజుల పాటు వాడుకోవచ్చు.

మొలకెత్తిన గింజలను పచ్చిగాను, ఉడికించి గానీ తీసుకోవచ్చు. వీటిని ఆఫీస్, స్కూల్‌కు తీసుకెళ్లడం కూడా సౌలభ్యంగా ఉంటుంది.

మొలకెత్తిన గింజల్లో ఎక్కువ పీచుపదార్థాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పీచుపదార్థం అందుతుంది.

No comments: