Thursday, November 1, 2012

చిన్న నేరానికి అరెస్టయినా పెద్ద సమస్య రావచ్చు

పిల్లలు బస్సు ఎక్కుతున్నా, దిగుతున్నా బస్సు నుంచి ఎరుపు రంగు ఫ్లాష్ లైట్, స్టాప్ సిగ్నల్ వెలుగుతుంటాయి. అప్పుడు వెనక వస్తున్న ఏవాహనమైనా బస్సుకి కనీసం పది అడుగుల దూరంలో నిలిచి పోవలసిందే. అలా కాకుండా బస్సుని క్రాస్ చేస్తే 250 డాలర్ల జరిమానా విధించి, 60రోజుల వరకు డ్రైవింగ్ లెసైన్నుని సస్పెండ్ చేస్తారు. జరిమానాలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.

ఆపినా ఆగకుండా వెళ్తే వెంటపడి పట్టుకుని మరీ అరెస్ట్ చేస్తారు. ఇక డ్రంకెన్ డ్రైవింగ్, చిన్న చిన్న యాక్సిడెంట్‌ల లాంటి వాటికి కూడా అక్కడ అరెస్ట్‌లు తప్పవు. మనవాళ్లకి అక్కడ కొన్నిచట్టాలు కొత్తగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకునేలోగానే ఒక్కోసారి అరెస్టులు కూడా జరుగుతాయి. అయితే చిన్న నేరాలకైనా సరే అరెస్టు వరకు తెచ్చుకోవడం అమెరికాలో ‘ఏలియన్స్’ కి పీకల మీదికి తీసుకొస్తుంది. (హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్స్ అంటే అన్యగ్రహవాసులు. అమెరికాలో ఏలియన్స్ అంటే విదేశీయులు.

చట్టాలని బ్రేక్ చేసే విదేశీయులని గుర్తించి అవసరమైతే వాళ్లని దేశం నుంచి పంపించి వేసే ఒక ప్రత్యేక కార్యక్రమం యు.ఎస్‌లో అమలు జరుగుతోందని అక్కడికి వెళ్లే మనవాళ్లలో చాలా మందికి తెలియదు. చట్టాలని పదే పదే ఉల్లంఘిస్తూ అమెరికాలో ప్రజల భద్రతకి ముప్పుగా పరిణమించే కొందరు ఇమ్మిగ్రెంట్ల పైనే ఈ కార్యక్రమంలో ఎక్కువ దృష్టి పెట్టినా అరెస్టుల దాకా వెళ్లే నాన్ - ఇమ్మిగ్రెంట్లకి కూడా అసలుకి మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఆయా ప్రాంతాలలో వివిధ నేరాలకి, నిబంధనల అతిక్రమణకి అరెస్టయ్యే విదేశీయుల వేలి ముద్రల్ని స్థానిక పోలీసులు చాలాకాలంగా ఎఫ్.బి.ఐ.కి ఇస్తూ వస్తున్నారు. ‘సెక్యూర్ కమ్యూనిటీస్’ అనే ఒక ప్రోగ్రామ్‌లో ఎఫ్.బి.ఐ నుంచి ఈ ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డి.హెచ్.ఎస్) కి ఆటోమ్యాటిక్‌గా వెళ్లిపోతాయి. ఆ వేలిముద్రల తాలూకు వ్యక్తి అప్పటికే అక్రమంగా యు.ఎస్‌లో ఉన్నాడా అన్నది డి.హెచ్.ఎస్ సరిపోల్చుకుని ఆ సమాచారాన్ని తిరిగి ఐ.సి.ఐ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కి ఇస్తుంది. ఆ వ్యక్తి అప్పటికే వీసా స్టేటస్ కోల్పోయి ఉన్నా, లేక తన నేర ప్రవృత్తి వల్ల అమెరికాలో పబ్లిక్ లైఫ్‌కి ముప్పు అని భావించినా, ఐ.సి.ఇ. ఆ వ్యక్తిని యు.ఎస్. నుంచి డిపోర్ట్ చెయ్యడానికి చర్యలు ప్రారంభిస్తుంది.

విదేశీయులు రాష్ట్ర, స్థానిక చట్టాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే ఈ ‘రాడార్’ కిందికి వస్తారు. 2008 లో కేవలం 14 జ్యూరిస్ డిక్షన్‌లలో అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని డి.హెచ్.ఎస్ ఇప్పుడు మూడువేల జ్యూరిస్ డిక్షన్లకి పెంచింది. 2013లో దీనిని అమెరికాలోని ప్రతి ఒక్క లా ఎన్‌ఫోర్స్‌మెంట్ జ్యూరిస్ డిక్షన్‌కి విస్తరించాలని కూడా నిర్ణయించారు. కాగా, ‘సెక్యూర్ కమ్యూనిటీస్’ రహస్య కార్యక్రమం ఏమీ కాదు. యు.ఎస్. కాంగ్రెస్ (పార్లమెంటులోని ప్రతినిధుల సభ) పరిధిలోనే ఇది అమలు జరుగుతుంది.

అమెరికాలో ఒక కోటిమందికి పైగా విదేశీయులు చట్టబద్ధమైన స్టేటస్ లేకుండా లేదా వివిధ నేరాలకు శిక్షలు పడి ఉన్నారు. ఏటా ఒక పరిమితి మేరకు వీరిని దేశం నుంచి పంపించి వెయ్యడానికి అవ సరమైన నిధులను కాంగ్రెస్ మంజూరు చేస్తుంటుంది కూడా.

No comments: