Thursday, November 29, 2012

HIV......తల్లీ, బిడ్డా క్షేమం కోసం...

తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపించడాన్ని ‘మదర్ టు ఛైల్డ్ ట్రాన్స్‌మిషన్’ అంటారు. తల్లికి హెచ్‌ఐవీ ఉన్న ప్పుడు ప్రసవం ముందర కొద్దికాలంపాటు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇవ్వాలి, ఏ మోతాదులో ఇవ్వాలి, ఏ సమయం వరకు ఇవ్వాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. ప్రసవం తర్వాత పుట్టిన పాపకూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చనుబాల విషయానికి వస్తే, తల్లికి ఇన్ఫెక్షన్ ఉంటే బిడ్డకు చనుబాలు ఇవ్వకపోవడమే మంచిది.

తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపించకుండా ఉండేందుకు వాడే మందుల్లో నెవిరపిన్, జిడోవుడిన్ (దీన్ని ఏజడ్‌టీ అని కూడా అంటారు) అనే ఔషధాలు ఉంటాయి. తల్లికి హెచ్‌ఐవీ ఉందని గుర్తించడంలో ఆలస్యం జరిగి ప్రసవానికి కొద్దిరోజుల ముందే ఆ విషయాన్ని కనుగొంటే... హెచ్‌ఐవీ బిడ్డకు రాకుండా నివారించడం కోసం ‘నెవరపిన్’ వాడటం మినహా మార్గాంతరం లేదు.

దీనివల్ల పూర్తిగా నివారణ సాధ్యమవుతుందని చెప్పలేం. కానీ ముందు నుంచీ తీసుకునే చర్యల ద్వారా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తిని నిరోధించడం సాధ్యమైంది. తద్వారా అక్కడ తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి చెందే అవకాశాలు కేవలం 1% కంటే కూడా తక్కువే. కాబట్టి ఇప్పుడు గర్భవతులకు ముందే పరీక్షలు నిర్వహించి హెచ్‌ఐవీ ఉందా లేదా తెలుసుకోవడం తప్పనిసరి అయ్యింది.

No comments: