‘సైడ్ ఈవెంట్స్’పై చార్లెస్ బిడెమా
హైదరాబాద్ : సదస్సుకు హాజరవుతున్న విభిన్న వర్గాలకు నిర్ణీత అంశం మీద అవగాహన పెంపొందించడమే ‘సైడ్ ఈవెంట్’ నిర్వహణ లక్ష్యమని, అక్కడ వ్యక్తమయ్యే అన్ని రకాల అభిప్రాయాలను విధాన నిర్ణయాన్ని ప్రభావం చేయవని జీవ భద్రత సదస్సు అధికార ప్రతినిధి చార్లెస్ బిడెమా తెలిపారు. ఆయన సదస్సు ప్రాంగణంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... భిన్నవాదనలు, ఆలోచనలను సదస్సు భాగస్వామ్య పక్షాలకు చేరవేయడానికి ఎన్జీవోలు, కంపెనీలు, ప్రభుత్వాలు సైడ్ ఈవెంట్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయని చెప్పారు. తొలి రెండు రోజులు చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు. ఒప్పందం అమలు చేయడానికి అవసరమైన వ్యూహాత్మక ప్రణాళిక ఖరారు దిశగా ఆశించిన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక ఆర్థిక అంశాల్లో స్పష్టత ముఖ్యం
జన్యు మార్పిడి మొక్కలు, జీవుల(ఎల్‌ఎంవో) వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రతలు, ఎల్‌ఎంవోల ప్రవేశం వల్ల తలెత్తే సమస్యలను అంచనా వేయడం, అనుకోని నష్టం జరిగితే బాధ్యత వహించాల్సిన పార్టీలను గుర్తించే అంశం మీద ఏర్పాటైన రెండు వర్కింగ్ గ్రూప్‌లు వేర్వేరుగా పాక్షికంగా రూపొందించిన నివేదికలను బుధవారం సమర్పించాయి. ఇప్పటి వరకు రెండు గ్రూపులు చేసిన చర్చలను ప్లీనరీ సమీక్షించింది. జన్యు మార్పిడి జీవులు, మొక్కల వినియోగంవల్ల తలెత్తే సామాజిక, ఆర్థిక సమస్యలు, ఇతర ప్రభావిత అంశాలను గుర్తించాలని అభిప్రాయపడింది. సామాజికార్థిక అంశాల్లో స్పష్టత దిశగా చర్చలు జరపాలని సూచించింది. అనంతరం రెండు వర్కింగ్ గ్రూపులు మళ్లీ చర్చలు ప్రారంభించాయి. గురువారం కూడా చర్చలు కొనసాగనున్నాయి.
No comments:
Post a Comment