Friday, October 5, 2012

మన్మోహన్ దూకుడు

న్యూఢిల్లీ,అక్టోబర్ 4: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల పథంలో మరో అడుగు ముందుకేసింది. ఎలాగైనా అనుకున్న సంస్కరణల్ని అమలు చేయాలన్న మొండి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ భీమా, పింఛన్ల రంగంలోకీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) అనుమతించాలని నిర్ణయించింది. మన్మోహన్ సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మల్టి బ్రాండ్ చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలతోపాటు భాగస్వామ్య పార్టీలూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న తాజా నిర్ణయం ఆగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. భీమా రంగంతోపాటు పింఛన్ల రంగంలోకి కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నా వీటిని అమలులోకి తెచ్చేందుకు పార్లమెంటు అనుమతి పొందవలసి ఉంటుంది. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కోవలసి ఉంటుంది. భీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని ఇరవై ఆరు నుండి ఒక్కసారిగా నలభై తొమ్మిది శాతానికి పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనితోపాటు పింఛన్ల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నలభై తొమ్మిది శాతానికి అనుమతించాలని నిర్ణయించారు. యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం వామపక్షాల మద్దతుతో పరిపాలించినంత కాలం ఈ రెండు ప్రతిపాదనలను అమలు చేయలేకపోయింది. వామపక్షాలతోపాటు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా బైటికి వెళ్లిపోవటంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను అమలు చేసేందుకు శరవేగంతో ముందుకు దూసుకుపోతోంది. ఈ సంస్కరణలకు పార్లమెంటులో వ్యతిరేకత వస్తుంది అప్పుడు ఏలా అనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ, ‘సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం చూసుకోవచ్చు’నన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిజెపితి పాటు ఇతర పార్టీల మద్దతుతో ఈ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయితే విచిత్రం ఏమిటంటే బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సారధ్యం వహిస్తున్న పార్లమెంటు ఆర్థిక శాఖ స్థాయి సంఘం బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించకూడదంటూ ఏకగ్రీవంగా చేసిన సిఫారసును సంకీర్ణ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ స్థారుూ సంఘంలోని కాంగ్రెస్ సభ్యులు కూడా బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకించటం గమనార్హం.


No comments: