Thursday, October 4, 2012

అన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు

దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత పట్ల సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పాఠశాలల్లో ఆరునెలల్లోగా మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యంతోపాటు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను గడువులోగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. 
  అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేకించి బాలికలకోసం మరుగుదొడ్లు కట్టించాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబర్ 18న కూడా ఆదేశించింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ, దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా సుప్రీం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరుగుదొడ్ల సౌకర్యంలేని పక్షంలో, తల్లిదండ్రులు తమ పిల్లలను, ప్రత్యేకించి బాలికలను స్కూళ్లకు పంపడంలేదని సర్వేలో తేలినట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. స్కూళ్లలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం అంటే... పిల్లలకు నిర్బంధ, ఉచిత విద్యాహక్కు కల్పించాలన్న రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘించినట్టేనని వ్యాఖ్యానించింది.




మరుగుదొడ్లు లేక చదువు మానేస్తున్న బాలికలు

పాఠశాలల్లో సరైన మరుగుదొడ్ల సదుపాయం లోపించినందునే బాలికలు ఎక్కువ సంఖ్యలో అర్ధంతరంగా చదువు మానేస్తున్నారని చైల్డ్ రైట్స్ అండ్ యు (సీఆర్‌వై) అన్న స్వచ్ఛంద సంస్థ అభిప్రాయపడింది. స్కూళ్లలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించడం అవసరమని పేర్కొంది. దేశంలోని 24.3కోట్ల మందికిపైగా ఉన్న బాలికల్లో 40 శాతం మంది అసలు స్కూలుకు వెళ్లకపోవడమో, వె ళ్లినా అర్ధంతరంగా చదువు మానేయడమో జరుగుతోందని, విడిగా మరుగుదొడ్లులేక పోవడమే ఇందుకు కారణమని సీఆర్‌వై ప్రాంతీయ ప్రతినిధి అతీంద్రనాథ్ దాస్ చెప్పారు. విద్యాహక్కు చట్టం పరిధిలోకి వచ్చే స్కూళ్లలో 44శాతం పాఠశాలలకు మాత్రమే విడిగా మరుగుదొడ్ల సౌకర్యం ఉందని ఆయన అన్నారు.

No comments: