 |
| హిల్లరీతో మంత్రి కృష్ణ చర్చలు |
న్యూయార్క్: అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో భేటీ అయిన భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అమెరికా వీసా ఫీజు పెంపుపై చర్చించారు. ఐరాస సాధారణ సభ సమావేశాలకు హాజరైన వారిద్దరూ దాదాపు 45 నిమిషాల సేపు ద్వైపాక్షిక చర్చలు సాగించారు. వారి చర్చల్లో విస్కాన్సిన్ గురుద్వారాలో జరిగిన కాల్పుల సంఘటన, పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకునేందుకు భారత్ చేపడుతున్న చర్యలు తదితర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. వీసా ఫీజు పెంపుపై భారత్ ఆందోళనను తాను హిల్లరీ దృష్టికి తెచ్చానని మంత్రి కృష్ణ మీడియాకు చెప్పారు. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నందున ఈ అంశాన్ని ఇప్పటికిప్పుడే పరిష్కరించలేమని, ఎన్నికల తర్వాత ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారని తెలిపారు.
కొత్త కేటగిరి హెచ్1బీ వీసాలకు 10,000 డాలర్లు(రూ.5 లక్షలకు మించి), గ్రీన్‌కార్డ్‌కు 15,000 డాలర్లు(రూ.7.5 లక్షలకు మించి) ఫీజును వసూలు చేయాలని అమెరికా ప్రభుత్వానికి సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రతిపాదించింది. హెచ్1బీ వీసాలకు 20 వేలకు పరిమితం చేయాలని సూచించింది. ఈవిధంగా సమకూరిన నిధులను స్టెమ్ విద్యా కార్యక్రమాల బలోపేతానికి వాడాలని ప్రతిపాదించింది. మెక్సికో సరిహద్దులో భద్రత బలోపేతానికి నిధుల సమీకరణకు 2010లో అమెరికా వీసాఫీజులు పెంచింది. దీని ప్రభావం భారత ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మహీంద్రా సత్యంపై తీవ్రంగా పడింది.
No comments:
Post a Comment