Thursday, October 4, 2012

రెండేళ్ల పరిశోధన అవసరం

- బీటీకి అనుమతిపై ఐరోపా శాస్త్రవేత్తల డిమాండ్


- తూతూ మంత్రం పరిశోధనల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు

- బీటీ మొక్కజొన్నను ఎలుకలకు ఇస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు

- అశాస్త్రీయ పరిశోధనలని బీటీ అనుకూల ప్రతినిధుల వాదన  
 బీటీ పంటల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఉందంటూ ‘యూరోపియన్ నెట్‌వర్క్ ఆఫ్ సైంటిస్ట్స్ ఫర్ సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రెస్పాన్సిబిలిటీ’ జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన చర్చ(సైడ్ ఈవెంట్) తీవ్ర వాదోపవాదాలకు వేదికయింది. జన్యు మార్పిడి పంటల విష ప్రభావం మీద ఫ్రాన్స్‌లోని కేన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సెరాలిని బృందం నిర్వహించిన పరిశోధన ఫలితాలను ఆ బృందంలో సభ్యుడైన రాబిన్ మెసంజే వెల్లడించారు. ఏ దేశంలోనైనా ఈ పరిశోధనలకు కనీసం రెండు సంవత్సరాల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతి సూక్ష్మస్థాయి విష ప్రభావాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జన్యు మార్పిడి ఆహార పదార్థాలకు ‘జన్యు మార్పిడి’(జీఎం) అని స్పష్టమైన ముద్ర వేసి విక్రయించాలని సూచించారు.





జన్యు మార్పిడి ఆహారం ఇచ్చి పెంచిన జంతువులకూ ఇదే విధానాన్ని అనుసరించాలన్నారు. బీటీ మొక్కజొన్నను ఎలుకలకు ఇచ్చి పరీక్షించగా కాలేయం, మూత్రపిండాలు, క్లోమం పనితీరు మందగించిందని... ఆడ ఎలుకలు రొమ్ము ప్రాంతంలో కణుతులు రావడంతో మరణించాయని ఆయన వివరించారు. బీటీ పంటలను అనుతించే విషయంలో జాగ్రత్తలు అవసరమని హెచ్చరించారు. బీటీ పంటలు వాణిజ్యపరంగా విస్తృతస్థాయిలో సాగులోకి రావడం వెనక బడా కంపెనీల కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఐరోపాలో బీటీ పంటల విష ప్రభావం మీద 90 రోజుల్లో పరిశోధనలు ముగిస్తున్నారని, స్వల్పకాలిక పరిశోధనల వల్ల దుష్ర్పభావాలు వెల్లడికావడం లేదని తెలిపారు.



అశాస్త్రీయ పరిశోధనలు...

మెసంజే వెల్లడించిన అంశాలపై జన్యు మార్పిడి పంటల అనుకూల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అశాస్త్రీయ పరిశోధన ఫలితాలను చూసి జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 10 ఎలుకల మీద పరిశోధనలు చేసి ఫలితాలను నిర్ధారించడం శాస్త్రీయత కాదని, పెద్ద సంఖ్యలో పరిశోధనలు జరిగిన తర్వాతే నిర్ణయానికి రావాలని చైనా ప్రతినిధి సూచించారు. కేన్ పరిశోధనల మీద వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇవ్వకుండా ఒకవైపు సమాచారాన్ని మాత్రమే వెల్లడిస్తున్నారంటూ ఈజిప్ట్ ప్రతినిధి విరుచుకుపడ్డారు. 90 రోజుల్లో తేలనిది రెండు సంవత్సరాల్లో తేలుతుందా? అని ప్రశ్నించారు. ఫ్రాన్స్‌కు చెందిన ఎన్జీవో ‘ఎకోరొప’ ప్రతినిధి క్రిస్టీనా వోన్ మాట్లాడుతూ.. జన్యు మార్పిడి పంటల వల్ల విష ప్రభావం లేదని తేలితే అనుమతించడానికి అభ్యంతరం ఉండదనే విషయాన్ని కంపెనీ ప్రతినిధులు గుర్తించాలని సూచించారు. జన్యు మార్పిడి పంటల విషయంలో ప్రభుత్వాలు ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటాయన్న నమ్మకం లేదని సామాజిక కార్యకర్త శ్రీధర్ చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశోధనలకు స్వతంత్ర శాస్త్రవేత్తలకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

No comments: