Thursday, October 4, 2012

పంటల్లో వైవిధ్యం ‘హరీ’ !

- స్వాతంత్య్రంనాటికి రెండు లక్షల వరి వంగడాలు

- ఇప్పుడు పది వంగడాల ద్వారానే 85 శాతం ధాన్యం
- సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆందోళన
- 17 ఏళ్లలో 2.7 లక్షల మంది రైతుల ఆత్మహత్య
- చిన్నరైతుల పాలిట మరణశాసనంగా పత్తిసాగు
- వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన
- ‘పురుగుమందుల్లేని సాగు’

- రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలకు విస్తరణ

ఆధునికం పేరుతో ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హరిత విప్లవం, జన్యుమార్పిడి సాంకేతికతలవల్ల మన దేశంలో పంటల జీవవైవిధ్యం సర్వనాశనమైందని సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్‌ఏ) పేర్కొంది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ప్రాంగణంలో బుధవారం భోజన విరామ సమయంలో సీఎస్‌ఏ ఆధ్వర్యంలో వ్యవసాయక జీవవైవిధ్యంపై ఒక కార్యక్రమం (సైడ్ ఈవెంట్) నిర్వహించారు. విభిన్న వ్యవసాయక వాతావరణ మండలాల్లో వేల ఏళ్లుగా సాగవుతున్న దేశవాళీ విత్తనాల్లో వైవిధ్యానికి మన దేశం పెట్టింది పేరు.




అయితే, మన రాష్ట్రంలో 75 శాతం వ్యవసాయోత్పత్తులు కేవలం నాలుగు పంటల ద్వారానే లభిస్తున్నాయని, జీవవైవిధ్యపరంగా ఇది వినాశకరమైన పరిణామమని సీఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ జీ వీ రామాంజనేయులు ఆందోళన వ్యక్తంచేశారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో రెండు లక్షల వరి వంగడాలున్నాయనీ, కనీసం 50 వేల రకాలు సాగవుతూ ఉండేవనీ తెలిపారు. అయితే ప్రస్తుతం 85 శాతం ధాన్యం దిగుబడి కేవలం పది వంగడాల ద్వారానే జరుగుతోందని, వరిలో జీవవైవిధ్యం దుస్థితికి ఇదే నిదర్శనమని చెప్పారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల్లో దేశవాళీ వంగడాలు చాలావరకూ కనుమరుగయ్యాయని తెలిపారు.


మన దేశంలో ఐదు వేల ఏళ్ల నుంచే పత్తి మెట్టపంటగా సాగవుతోందని చెప్పారు. అయితే స్పిన్నింగ్ మిల్లులకు అనువుగా ఉంటుందన్న సాకుతో అమెరికా పత్తి వంగడాలను అలవాటు చేయడం, 2002లో బీటీ పత్తిని ప్రవేశపెట్టడంతో... పత్తిసాగు చిన్నరైతుల పాలిట మరణశాసనంగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. గత 17 ఏళ్లలో దేశంలో 2,70,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. 2003 నుంచి 99 పత్తి వంగడాలు/హైబ్రిడ్లను కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో అందుబాటులో ఉంచడం పూర్తిగా మానేయడంతో దేశీ విత్తనాల జాడ లేకుండా పోయిందన్నారు. బీటీ పత్తి వచ్చిన పదేళ్లలో రసాయనిక పురుగుమందుల వాడకం దేశంలో భారీగా పెరిగిందని తెలిపారు.



వైఎస్ హయాంలో ప్రారంభమై..

పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతుల గురించి ఎక్కడెక్కడో వెదుకుతున్నారు గానీ.. మన దేశంలో విజయవంతంగా అమలవుతున్న మేలైన ప్రత్యామ్నాయాలపై పాలకులు దృష్టి సారించడంలేదని రామాంజనేయులు ఆక్షేపించారు. ‘‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మన రాష్ట్రంలో ఎన్‌పీఎం (పురుగుమందుల్లేని వ్యవసాయం) ప్రారంభమైంది. ఇప్పుడు అది రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలకు విస్తరించింది. లక్షలాది మంది చిన్న రైతులు ఈ పద్ధతిలో పంటలు పండించి లబ్ధిపొందుతున్నారు.

ఈ కారణంగానే మన రాష్ట్రంలో పురుగుమందుల వాడకం తగ్గింది. జీవవైవిధ్య సదస్సుకు ఆతిథ్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక వర్క్‌షాపును, ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేసి ఉండాల్సింది. అలా జరగకపోవడం దురదృష్టకరం. డాడాక్టర్ వైఎస్సార్ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించారు. బీటీ పత్తి విత్తన కంపెనీలపై న్యాయపోరాటం చేసి ప్యాకెట్ ధరను రూ. 1,800 నుంచి 650కి తగ్గేలా చేశారు’’ అని గుర్తు చేసుకున్నారు.



ధూర్త దేశాల కనుసన్నల్లోనే: రాధాకృష్ణన్

అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సులో కొన్ని ధూర్త దేశాల కనుసన్నల్లోనే చర్చలు సాగుతున్నాయని కోలిషన్ ఫర్ జీఎం ఫ్రీ ఇండియా కన్వీనర్ శ్రీధర్ రాధాకృష్ణన్ ధ్వజమెత్తారు. జీవవైవిధ్యంపై ఒప్పందం, క్యోటో ప్రొటోకాల్‌వంటి చాలా అంతర్జాతీయ ఒడంబడికలపై ఆమోద ముద్ర వేయని అమెరికా వంటి కొన్ని దేశాలు ఈ సదస్సుకు పరిశీలకుల హోదాలో హాజరై కథ నడిపిస్తున్నాయని ఆరోపించారు.

వీరి సరసన భారత్ కూర్చొని చర్చించడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జన్యుమార్పిడి పంటలపై కొనసాగుతున్న క్షేత్ర ప్రయోగాలు జన్యుకాలుష్యాన్ని కలిగిస్తుండగా... ఇక్కడ అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కార్యక్రమంలో వీణ, రైతు స్వరాజ్య వేదిక నిర్వాహకుడు విస్సా కిరణ్, వ్యవసాయ శాఖాధికారులు విజయలక్ష్మి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

No comments: