Showing posts with label Agriculture. Show all posts
Showing posts with label Agriculture. Show all posts

Wednesday, November 28, 2012

ఇక్రిశాట్... రైతుకోసం.... రైతే లోకం.....

పేద రైతులకు ఒక వరం... 
తగిన వర్షపాతం లేని కరవు దేశాలకు ఆలంబన...
ఉష్ణమండల ప్రాంత పంటల అభివృద్ధికి దిక్సూచి... 
భారత్‌సహా 55 దేశాల్లోని కోట్లాది పేద రైతులకు వెలుగుదారి... 
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ‘ఇక్రిశాట్’ ఘనత ఇది!
తన సుదీర్ఘ సేవా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అందుకొన్న ఈ సంస్థ ప్రస్తుతం 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.. 
ఈ సందర్భంగా.. సమాజానికి ఇక్రిశాట్ అందించిన కొన్ని ‘రత్నాల’ గురించి తెలుసుకుందాం...
 

వాటర్‌షెడ్‌లతో సుస్థిర గ్రామీణాభివృద్ధి

సామాజిక కోణంలో వాటర్‌షెడ్‌ల నిర్వహణ తో సమీకృత గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. వర్షపాతం తక్కువగా ఉండే ఉష్ణమండల పొడినేలల ప్రాంతాల్లో నీటికొరతే పేదరికానికి తొలి కారణమవుతోంది. సహజవనరుల లేమితోపాటు పంటల దిగుబడి చిన్న రైతులకు సవాలే. దీనికి చెక్ పెట్టేందుకు ఇక్రిశాట్ సామాజిక వాటర్‌షెడ్ నిర్వహణను చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలను, పౌర, వ్యవసాయ సంఘాలను సంఘటితం చేసి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. 
ఇవీ ఫలితాలు... రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి సుస్థిర అభివృద్ధి సాధించిన గ్రామంగా రికార్డులకెక్కింది. సైన్స్ ఆధారిత గ్రామీణాభివృద్ధికి మార్గదర్శిగా మారింది. ఇక్రిశాట్ సహకారంతో అమలుచేసిన ఆద ర్శ్ వాటర్‌షెడ్ నిర్వహణ , ఇతర కార్యక్రమాలే గ్రామ రూపురేఖలు మార్చేశాయి. వాటర్‌షెడ్‌లతో నీటి లభ్యత పెంచడం, కూరగాయలతోపాటు విలువ గల పంటలు పండించడం, దిగుబడులు పెంచడం వల్లే ఇది సాధ్యమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని పవర్‌గూడ గ్రామంలోనూ పశుపోషణ, ఆయిల్ విత్తనాల పంటలు, నర్సరీలు, వర్మీ కంపోస్టింగ్ వంటివాటితో గ్రామస్థుల సగటు ఆదాయం ఏకంగా 77% పెరిగింది. రాజస్థాన్‌లో భూగర్భజలాలు 5.7 మీటర్ల వరకూ పెరిగాయి. దిగుబడులు 2-3 రెట్లు పెరిగాయి. పంటల విస్తీర్ణం 51% పెరిగింది. చైనా, వియత్నాం దేశాల్లోనూ ఈ వాటర్‌షెడ్‌లను ఇక్రిశాట్ అమలు చేస్తోంది. దీనివల్ల ఆసియాలో కనీసం 2 కోట్ల మంది జీవితాలు మారిపోయాయని అంచనా. 

సూక్ష్మమోతాదులతో భారీ ప్రయోజనాలు..

సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఎరువులను సూక్ష్మ మోతాదులో వినియోగించడం ద్వారా వ్యవసాయంలో భారీ ప్రయోజనాలను పొందే ఈ కార్యక్రమాన్ని ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాంతంలోని పలు దేశాల్లో ఇక్రిశాట్ అమలుచేసింది. పంట విత్తే సమయంలో పొలమంతా ఎరువులు చల్లకుండా విత్తనంతోపాటే కొద్ది మోతాదులో- అదీ నేలకు అవసరమైన ఎరువునే వేసే ఈ పద్ధతి వల్ల పంట దిగుబడి, ఆదాయం గణనీయంగా పెరిగింది. జొన్న, తృణధాన్యాల దిగుబడులు సుమారుగా 44-120 శాతం వరకూ పెరిగాయి. జింబాబ్వే తదితర దేశాల్లోని వేలాది పేద రైతుల ఆదాయం ఏకంగా 50-130 శాతం వరకూ పెరిగింది. 2012 చివరికల్లా ఈ పద్ధతిని ఆఫ్రికాలో 3.60 లక్షల మంది రైతులకు నేర్పించాలన్నది ఇక్రిశాట్ ప్రాంతీయ ప్రాజెక్టు లక్ష్యం. 

వ్యవసాయ అభివృద్ధికి గ్రామస్థాయి అధ్యయనాలు...

గ్రామస్థాయిలో ప్రజలను ఆధారం చేసుకుని అంతర్జాతీయ అధ్యయనం ద్వారా ఉష్ణమండల ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ఉన్న మార్గాలు, ఆటంకాలను గుర్తించే గ్రామస్థాయి అధ్యయనాలకు శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సమగ్ర సమాచారాన్ని ఒకచోటికి చేర్చి డాటా బ్యాంక్‌గా అందుబాటులో ఉంచేందుకు నడుం కట్టింది. ఇక్రిశాట్ 1975 నుంచి సేకరిస్తున్న ఈ సమాచారమే ఇప్పుడు అనేక అంతర్జాతీయ పరిశోధనలకు కీలకమవుతోంది. 

ఎఫ్లాటాక్సింగ్ టెస్టింగ్ కిట్...

శిలీంధ్రాల నుంచి విడుదలయ్యే ఎఫ్లాటాక్సిన్ అనే విషపూరిత రసాయనం నుంచి వేరుశనగ తదితర పంటలకు అతితక్కువ ఖర్చుతోనే విముక్తి కలిగిస్తూ పేదదేశాల రైతులకు ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశంతో చేసిన ఆవిష్కరణ ఇది. ఎఫ్లాటాక్సిన్ విషపూరిత రసాయనం వల్ల వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, మిరప వంటి అనేక పంటలు కలుషితమవుతాయి. ఎఫ్లాటాక్సిన్ బీ1 అనే రసాయనం పశువులకు, మనుషులకూ చాలా ప్రమాదకరం. అందుకే వెనకబడిన దేశాల రైతుల పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ బాగా పడిపోతోంది. అయితే, తేలికైన, చవకైన ఎఫ్లాటాక్సింగ్ టెస్టింగ్ కిట్ వల్ల పంటలను పరీక్షించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సులభం కావడంతో భారత్ సహా ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

రైతు నేస్తాలుగా ఇక్రిశాట్ వంగడాలు... 

ఆసియా, ఆఫ్రికా దేశాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ మంచి దిగుబడులనిచ్చే జొన్న, సజ్జ, కంది, శనగ తదితర పంటల వంగడాలను ఇక్రిశాట్ రూపొందించింది. 

కరవును తట్టుకునే వేరుశనగ...

వ్యాధులను, కరవును తట్టుకునేలా ఇక్రిశాట్ రూపొందించిన నాణ్యమైన వేరుశనగ వంగడం.. 60 ఏళ్లుగా వాడకంలో ఉన్న అనేక వంగడాల స్థానాన్ని ఆక్రమించి లక్షలాది బడుగు రైతుల్లో వెలుగులు నింపింది. ఇక్రిశాట్ రూపొందించిన అనంతజ్యోతి వంగడం ఇప్పుడు ఆ జిల్లా రైతులకు లబ్ధి కలిగిస్తోంది. 

40 శాతం అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కంది... 

సంప్రదాయ కందివంగడాలతో పోల్చితే 40% వరకూ అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కంది వంగడాలను ప్రైవేటు సంస్థలతో కలిసి ఇక్రిశాట్ రూపొందించింది. కెన్యా, మలావీ తదితర ఆఫ్రికా దేశాల రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంది వంగడాలు నాణ్యమైన దిగుబడులతో వారి ఆదాయాన్ని 80 శాతం వరకూ పెంచాయి. ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాల్లో ప్రధాన పంటల్లో ఒకటైన కంది జీనోమ్ (జన్యుపట ం)ను కూడా ఇక్రిశాట్ ఆవిష్కరించి పంట అభివృద్ధికి అనేక మార్గాలు అవలంబించేందుకు కృషిచేసింది. 

తీపి జొన్న...

ఇక్రిశాట్ రూపొందించిన ఈ వంగడం బహుళ ప్రయోజనకరం. ఆహారంగా మాత్రమే కాకుండా పీచు, ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. కరవును, వాతావరణ మార్పును తట్టుకుంటుంది. జొన్న, మొక్కజొన్న కంటే రైతులకు ఎంతో లాభదాయకమైనది. 

అందరికీ అందుబాటులో విజ్ఞానం...

ఆహార భద్రతను పెంపొందించేందుకోసం ఇక్రిశాట్ జన్యు వనరులతో కూడిన జీన్‌బ్యాంకును నిర్వహిస్తోంది. ఈ బ్యాంకులో 1,20,000 జన్యువనరులు ఉన్నాయి. ఇక్రిశాట్ వెబ్‌సైట్‌లో ఇంటర్నేషనల్ పబ్లిక్ గూడ్స్ (ఐపీజీఎస్) పేరుతో పొందుపర్చిన జన్యువనరుల సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ పేరెంట్స్ రీసెర్చ్ కన్సార్షియం పేరుతో నిర్వహించే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య శాస్త్రీయ ఆవిష్కరణలు, ఉత్పత్తులు పేదలకు ఐపీజీఎస్‌లో అందుబాటులో ఉంటాయి. సంస్థాగతమైన అనేక ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రాజెక్టుల వివరాలను కూడా భాగస్వాములు, ఔత్సాహికులు ఉచితంగానే పొందవచ్చు.

పేదల జీవనాధారం మెరుగుపర్చింది... 

ఇక్రిశాట్‌కు 40వ ఏడాది అయిన 2012 సంవత్సరాన్ని మైలురాయిగా భావిస్తున్నాం. ఉష్ణమండల ప్రాంత పేద ప్రజలకు ఇన్నేళ్లుగా సంస్థ చేసిన సేవలు, సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ‘ద జివెల్స్ ఆఫ్ ఇక్రిశాట్’ పుస్తకాన్ని ప్రచురించాం. ఆసియా, ఆఫ్రికాలలోని 55 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సుమారు 80 కోట్లమందికి ఇక్రిశాట్ సేవలు అందుతున్నాయి. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఇక్రిశాట్ చేపట్టిన అనేక కార్యక్రమాలు గ్రామీణుల జీవనాధారాన్ని మెరుగుపర్చాయి. ఇక్రిశాట్ భాగస్వామిగా ఉన్న సీజీఐఆఏఆర్ సంస్థ పెట్టిన ప్రతి డాలరుకీ 17 డాలర్ల ప్రతిఫలాన్ని నమోదుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాముల వల్లే ఈ ఘన విజయాలు సాధ్యమయ్యాయి.
- ‘ది జివెల్స్ ఆఫ్ ఇక్రిశాట్’ ముందుమాటలో ఆ సంస్థ డెరైక్టర్ జనరల్ విలియం డీ డార్

Sunday, November 25, 2012

పాడిపై పిడుగు

ఏపీ డెయిరీ చరిత్రలో తొలిసారి..
సెల్ మెసేజ్‌ల ద్వారా జారీ అయిన ఆదేశాలు

 పాడి రైతులను ప్రభుత్వం దెబ్బ కొట్టింది. నెలకు ఏకంగా మూడురోజుల పాటు పాలసేకరణను నిలిపివేసింది. పదిరోజుల కో రోజు చొప్పున నెలలో మూడురోజులు పాలసేకరణకు ‘సెలవు’ ప్రకటించింది. ఈ మేరకు ‘ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (ఏపీడీడీసీ) నుంచి ఆయా జిల్లాలకు సెల్ మెసేజ్‌ల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఇలా పాల సేకరణను ఉన్న పళాన నిలిపివేయడం పాడిరైతుల పాలిట పిడుగుపాటు కానుంది. రోజుకు 6 లక్షల లీటర్ల చొప్పున మూడురోజుల్లో 18 లక్షల లీటర్ల పాలు రైతుల వద్ద మిగిలిపోనున్నాయి. ‘ప్రపంచ వ్యవసాయ సదస్సు’ సన్నాహక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాడిరైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించి 24 గంటలైనా కాకముందే.. పాడిరైతుల నడ్డి విరిచే ఆదేశాలు జారీ కావడం గమనార్హం.

Tuesday, November 20, 2012

కాయగూరల చెట్ల పై పేనుబంక తెగులు పోవాలంటే..?

పేనుబంక తెగులును ఎఫిడ్స్ అంటారు. ఇది సాధారణంగా చిక్కుడు, కాకర, సొర, పొట్ల వంటి తీగమొక్కలకు వచ్చే తెగులే. దీనిని నివారించేందుకు పల్లెటూళ్లలో ఆకుల మీద బూడిదను చల్లుతుంటారు. తొలిదశలో ఇది కొంతవరకు పని చేస్తుంది కాని ఆ తర్వాత అంతగా ఫలితాలనివ్వదు. దాంతో చిక్కుడు పాదు నిలువెల్లా ఎండిపోతుంది, కాపు తగ్గిపోతుంది. కాబట్టి ‘రోగోర్’ అనే ద్రావకాన్ని లీటరుకు రెండు మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. దీని శాస్త్రీయనామం. డై మెథోయేట్. ఈ ద్రావకం ఆకులకు అంటుకునేందుకు కొద్దిపాటి సర్ఫును కూడా కలపాలి. సాధారణంగా ఈ ద్రావకాన్ని పొద్దున పూట లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. అలా పిచికారీ చేసేటప్పుడు ఆకుల కిందిభాగం తడిసేటట్లు చూడడం ముఖ్యం. ఎందుకంటే ఈ తెగులు ఆకుల కిందిభాగంలో ఎక్కువగా ఉంటుంది.

Wednesday, October 17, 2012

ప్రాణహిత-చేవెళ్ల ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి

తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిపథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వ విప్ టి.జగ్గారెడ్డి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. జీవవైవిధ్య సదస్సులో మంగళవారం నాడు పాల్గొన్న ప్రధానమంత్రిని విప్ జగ్గారెడ్డి కలిశారు. తెలంగాణలోని పది జిల్లాల్లో వ్యవసాయమంతా వర్షాధారంపైనే సాగుతున్నదని విప్ జగ్గారెడ్డి ప్రదానికి వివరించారు. అంతేగాక సాగునీటి రంగంలో భారీ, మధ్య తరహాప్రాజెక్టులు కూడా లేవని పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ ప్రాంత రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా ప్రాణహిత-చేవెళ్ల పథకం అత్యంత అవసరమన్నారు.

Friday, October 12, 2012

జన్యు మార్పిడి (జీఎం) విత్తనాలపై స్వామినాథన్ ఆందోళన

దేశంలోకి జన్యు మార్పిడి (జీఎం) విత్తనాలను అనుమతించే ముందు వాటిపై సమగ్రమైన, లోతైన అధ్యయనం, పరిశోధనలు సాగాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. స్వామినాథన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైటెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన,  జీఎం పంటలతో చాలా ప్రమాదాలున్నాయని, ముఖ్యంగా స్థానిక జీవ వైవిధ్యానికి విఘాతమేర్పడే ముప్పు ఉందని స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు.

జీఎం విత్తనాలను ఒక దేశం నుంచి మరో దేశానికి బదిలీ చేసే క్రమంలో స్థానిక పంటలు, మొక్కలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని.. అందుకే అమెరికా అధికారులు జీఎం విత్తనాల దిగుమతిలో చాలా జాగ్రత్తలు పాటిస్తారని వివరించారు. అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎఫ్‌డీఏ) తదితర మూడు సంస్థలు సమగ్ర అధ్యయనం, లోతైన పరిశీలన జరిపాకే అమెరికాలో జీఎం విత్తనాలను అనుమతిస్తారని తెలిపారు. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు జన్యు పరివర్తిత జీవాల (ఎల్ఎంవో)ల విషయంలో మరింత జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ పంటలను అనుమతించే ముందు.. స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటిస్తున్న ప్రభుత్వాలు.. స్థానికుల హక్కులను మాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అనేది స్థానికులకు ఉపాధి కల్పించేదిగా ఉండాలిగానీ.. వారి పొట్టకొట్టి సాగించే వృద్ధి నిజమైన అభివృద్ధి కాదని అభిప్రాయపడ్డారు.

Thursday, October 4, 2012

సైడ్ ఈవెంట్స్ విధానాలను ప్రభావితం చేయవు




‘సైడ్ ఈవెంట్స్’పై చార్లెస్ బిడెమా

హైదరాబాద్ : సదస్సుకు హాజరవుతున్న విభిన్న వర్గాలకు నిర్ణీత అంశం మీద అవగాహన పెంపొందించడమే ‘సైడ్ ఈవెంట్’ నిర్వహణ లక్ష్యమని, అక్కడ వ్యక్తమయ్యే అన్ని రకాల అభిప్రాయాలను విధాన నిర్ణయాన్ని ప్రభావం చేయవని జీవ భద్రత సదస్సు అధికార ప్రతినిధి చార్లెస్ బిడెమా తెలిపారు. ఆయన సదస్సు ప్రాంగణంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... భిన్నవాదనలు, ఆలోచనలను సదస్సు భాగస్వామ్య పక్షాలకు చేరవేయడానికి ఎన్జీవోలు, కంపెనీలు, ప్రభుత్వాలు సైడ్ ఈవెంట్స్‌ను సమర్థవంతంగా   వినియోగించుకుంటున్నాయని  చెప్పారు. తొలి రెండు రోజులు చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు. ఒప్పందం అమలు చేయడానికి అవసరమైన వ్యూహాత్మక ప్రణాళిక ఖరారు దిశగా ఆశించిన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండేళ్ల పరిశోధన అవసరం

- బీటీకి అనుమతిపై ఐరోపా శాస్త్రవేత్తల డిమాండ్


- తూతూ మంత్రం పరిశోధనల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు

- బీటీ మొక్కజొన్నను ఎలుకలకు ఇస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు

- అశాస్త్రీయ పరిశోధనలని బీటీ అనుకూల ప్రతినిధుల వాదన  
 బీటీ పంటల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఉందంటూ ‘యూరోపియన్ నెట్‌వర్క్ ఆఫ్ సైంటిస్ట్స్ ఫర్ సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రెస్పాన్సిబిలిటీ’ జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన చర్చ(సైడ్ ఈవెంట్) తీవ్ర వాదోపవాదాలకు వేదికయింది. జన్యు మార్పిడి పంటల విష ప్రభావం మీద ఫ్రాన్స్‌లోని కేన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సెరాలిని బృందం నిర్వహించిన పరిశోధన ఫలితాలను ఆ బృందంలో సభ్యుడైన రాబిన్ మెసంజే వెల్లడించారు. ఏ దేశంలోనైనా ఈ పరిశోధనలకు కనీసం రెండు సంవత్సరాల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతి సూక్ష్మస్థాయి విష ప్రభావాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జన్యు మార్పిడి ఆహార పదార్థాలకు ‘జన్యు మార్పిడి’(జీఎం) అని స్పష్టమైన ముద్ర వేసి విక్రయించాలని సూచించారు.

పంటల్లో వైవిధ్యం ‘హరీ’ !

- స్వాతంత్య్రంనాటికి రెండు లక్షల వరి వంగడాలు

- ఇప్పుడు పది వంగడాల ద్వారానే 85 శాతం ధాన్యం
- సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆందోళన
- 17 ఏళ్లలో 2.7 లక్షల మంది రైతుల ఆత్మహత్య
- చిన్నరైతుల పాలిట మరణశాసనంగా పత్తిసాగు
- వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన
- ‘పురుగుమందుల్లేని సాగు’

- రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలకు విస్తరణ

ఆధునికం పేరుతో ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హరిత విప్లవం, జన్యుమార్పిడి సాంకేతికతలవల్ల మన దేశంలో పంటల జీవవైవిధ్యం సర్వనాశనమైందని సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్‌ఏ) పేర్కొంది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ప్రాంగణంలో బుధవారం భోజన విరామ సమయంలో సీఎస్‌ఏ ఆధ్వర్యంలో వ్యవసాయక జీవవైవిధ్యంపై ఒక కార్యక్రమం (సైడ్ ఈవెంట్) నిర్వహించారు. విభిన్న వ్యవసాయక వాతావరణ మండలాల్లో వేల ఏళ్లుగా సాగవుతున్న దేశవాళీ విత్తనాల్లో వైవిధ్యానికి మన దేశం పెట్టింది పేరు.

వారికి సైన్స్ అర్ధం కాదేమో !

జన్యుమార్పిడి పంటల వ్యతిరేకులపై ఐసీఏఆర్ డీడీజీ స్వపన్‌కుమార్ దత్తా వ్యాఖ్య
అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు వేదికగా జన్యుమార్పిడి పంటలపై మరోమారు వాడివేడి చర్చలు మొదలయ్యాయి. ఈ పంటలతో రైతుకు చేటు తప్పదని కొందరు... మేలు తప్ప కీడు లేదని ఇంకొందరు తమతమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ... భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ స్వపన్ కుమార్ దత్తా మాత్రం సైన్స్ గురించి తెలియని వారే జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకిస్తారని స్పష్టం చేస్తున్నారు. బయోటెక్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుతో ప్రస్తుతమున్న గందరగోళ పరిస్థితులు సర్దుకుంటాయని, తగిన అనుమతులు లభిస్తే... త్వరలోనే గోల్డెన్ రైస్‌తోపాటు ఐరన్ రైస్ కూడా అందుబాటులోకి రావచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూ ఇలా అన్నారు
ఆ వివరాలు...