Showing posts with label Health Tips. Show all posts
Showing posts with label Health Tips. Show all posts

Tuesday, November 27, 2012

స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన కల్పిస్తే.. ...

‘కేర్’లో స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ 
భిన్న మతాలకు చెందిన వారైనా.. బంధువులు కాకపోయినా.. కిడ్నీల మార్పిడికి సిద్ధపడ్డ జంటలు

 ‘రక్త’సంబంధం ఇద్దరి ప్రాణాలను నిలిపింది. సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’(పరస్పర ఒప్పందంతో మార్పిడి) ద్వారా ఇద్దరు వ్యక్తులకు మూత్రపిండాలని అమర్చారు. సాధారణంగా ఎవరికైనా మూత్రపిండాలు అమర్చాలంటే.. ఆ వ్యక్తికి అవయవదానం చేసేవారు కుటుంబ సభ్యులై ఉండాలి లేదా వారి బంధువులైనా అయి ఉండాలి. లేదంటే కెడావర్ ఆర్గాన్ డొనేషన్ పద్ధతిలో భాగంగా క్లినికల్ డెత్(మరణశయ్యపై) అయిన వ్యక్తి నుంచి వాటిని తీసి ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ రెండు పద్ధతుల్లో కాకుండా రెండు బాధిత కుటుంబాలకు చెందిన దాతలు(భార్యలు) పరస్పర అవగాహనతో కిడ్నీలను దానం చేయడంతో వారి భర్తల ప్రాణాలు నిలిచాయి. 

జరిగిందిదీ.. 

కరీంనగర్‌కు చెందిన ఎంఏ బేగ్ మూత్రపిండాల వ్యాధితో గత కొంతకాలంగా కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఆయనకు మళ్లీ సమస్య వచ్చింది. అప్పట్లో బేగ్ తమ్ముడు కిడ్నీ ఇచ్చారు. ఈసారి బంధువులు మూత్రపిండం ఇవ్వడానికి ముందుకొచ్చినా అవి సరిపోలేదు. దీంతో బేగ్ భార్య అయేషా కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే, బేగ్ బ్లడ్‌గ్రూపు బి పాజిటివ్ కాగా.. అయేషాది ఎ పాజిటివ్. దీంతో ఆ ప్రయత్నమూ విఫలమైంది. అయితే, ఇదే సమయంలో కేర్ ఆస్పత్రికి కిడ్నీ సమస్యతోనేహైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ ప్రాంతానికి చెందిన దేవీదాస్ అనే వ్యక్తి వచ్చారు. 

దేవీదాస్ భార్య నిర్మల ఆయనకు మూత్రపిండం ఇవ్వడానికి అంగీకరించినా.. దేవీదాస్ రక్తం గ్రూపు ఎ పాజిటివ్ కాగా, భార్యది బి పాజిటివ్ అయింది. ఇద్దరి సమస్యా ఒకటే. విషయం తెలుసుకున్నారు. భర్తలను దక్కించుకోవడానికి ఇద్దరు దాతలు(నిర్మల, అయేషా) అంగీకారానికి వచ్చారు. నిర్మల భర్తకు అయేషా కిడ్నీ ఇచ్చేందుకు, అయేషా భర్తకు నిర్మల మూత్రపిండమిచ్చేందుకు ఒప్పుకున్నారు. వీరి ప్రతిపాదనను కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వానికి పంపించారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నవంబర్ 7న బేగ్, దేవీదాస్‌లకు విజయవంతంగా మూత్రపిండాల మార్పిడి చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఇరువురి కిడ్నీల పనితీరు సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకూ ముంబై, ఢిల్లీ, కోల్‌కతాల్లో మాత్రమే ఇలాంటి మార్పిడి జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారని ఈ ఆపరేషన్లలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు నిర్వహించిన డా.రాజశేఖర్ చక్రవర్తి, డా.విక్రాంత్‌రెడ్డి, డా.కె.రామరాజు, డా.కె.ప్రసాదరాజు, డా.బి.వి.రామరాజుల బృందం కిడ్నీ మార్పిడి చేయించుకున్న కుటుంబాలతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ విధానాన్ని ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అంటారని చెప్పారు. దేశంలో ఏటా 4 లక్షల మందికి కిడ్నీ సమస్య వస్తోందని, కానీ 4 వేల మందికి మాత్రమే అవయవ మార్పిడి జరుగుతోందని వైద్యులు తెలిపారు. స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన కల్పిస్తే.. మరింతమందికి కొత్త జీవితాన్నివ్వవచ్చని వైద్య బృందం పేర్కొంది.

Friday, November 23, 2012

మొలకెత్తే బలం...

మొలకలు తింటే మంచిది అంటారు.
జీవం ఏదైనా ఆరోగ్యమే.
గింజ నుంచి మొలకెత్తే జీవం ఇంకా ఆరోగ్యం.
కాని, రోజూ అలాగే... పచ్చిగానే... చప్పిడిగానే అంటే... కొంచెం బోర్.
మైండ్ అప్లయ్ చేయాలి.
కిచెన్ సరంజామాతో మ్యాజిక్ చేయాలి. కొంచెం టొమాటో తరుగు, కాసింత వెల్లుల్లి పొడి, జీలకర్ర, నిమ్మరసం...
అన్నింటినీ జత చేస్తే... ఆపైన రుచి చూస్తే... ఉదయానికి నమస్తే...
ప్రతి ఉదయానికీ ఆరోగ్యమస్తే!


మొలకెత్తిన పెసలు

కావలసినవి
మొలకెత్తిన పెసలు - ఒకటిన్నర కప్పు
టొమాటో తరుగు - కప్పు
కీరా తరుగు - కప్పు
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్
క్యాప్సికమ్ / పచ్చిమిర్చి తరుగు - తగినంత
సలాడ్ డ్రెస్సింగ్ కోసం...
మిరియాల పొడి - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
జీలకర్ర - టీ స్పూన్
నిమ్మరసం - టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్
పంచదార లేదా బెల్లం - టీ స్పూన్

తయారి
సలాడ్ డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి.

గిన్నెలో పావు కప్పు కన్నా తక్కువ నీళ్లు పోసి, ఉప్పు కలిపి మరిగించాలి. అందులో మొలకెత్తిన గింజలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గింజలను చల్లారనివ్వాలి.

సలాడ్ డ్రెస్సింగ్ కోసం కలిపిన మిశ్రమాన్ని, చల్లారిన గింజలపై వేసి కలపాలి.

సర్వ్ చేసే గిన్నెలో టొమాటో, కీరా తరుగు, ఆ పైన స్ప్రౌట్స్ ఉంచి, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుతో గార్నిష్ చేయాలి.

నోట్: మొలకెత్తిన గింజలను, కూరగాయల తరుగును కలిపి ఎక్కువసేపు ఉంచకూడదు. దీనివల్ల పచ్చి వాసన వేసి, తినాలనిపించదు.

బఠాణీ సలాడ్

కావలసినవి
మొలకెత్తిన /బాగా నానిన బఠాణీలు - అర కప్పు, క్యారట్ ముక్కలు - అర కప్పు, బంగాళదుంప - 1, బీన్స్ - అర కప్పు, పెరుగు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, నిమ్మరసం - టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత

తయారి
కూరగాయ ముక్కలను, బఠాణీలను ఉడికించి, పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో పెరుగు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.

పెరుగు మిశ్రమాన్ని బఠాణీలు, కూరగాయల ముక్కల్లో వేసి, బాగా కలిపి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.

శనగల సలాడ్

కావలసినవి
శనగలు (ఉడికించినవి) - 3 కప్పులు
బంగాళదుంప - 1 (ఉడికించి, ముక్కలు చేయాలి), పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి - 1 (తరగాలి), ఉల్లితరుగు - 2 టేబుల్ స్పూన్లు, టొమాటో - ఒకటి (తరగాలి)
పంచదార - అర టీ స్పూన్,
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - చిటికెడు
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్

తయారి
ఒక గిన్నెలో పచ్చిమిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయ, టొమాటో తరుగులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.

ఉడికించిన శనగలను పై మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

నోట్: మొలకెత్తిన శనగలకు కొద్దిగా నీరు కలిపి, 2 నిమిషాలు ఉడికించి సలాడ్‌కి వాడుకుంటే బాగుంటాయి.

మిక్స్‌డ్ బీన్స్ సలాడ్

కావలసినవి
బొబ్బర్లు+శనగలు+సోయా - కప్పు, టొమాటో - 1(గుండ్రంగా తరగాలి)
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్,
జీలకర్ర - అర టీ స్పూన్,
పసుపు - చిటికెడు
కరివేపాకు - రెమ్మ, కీరా - అరముక్క
(గుండ్రంగా తరగాలి)
ఉప్పు - తగినంత, ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్, నిమ్మరసం - టీ స్పూన్, మిరియాల పొడి - చిటికెడు

తయారి
బొబ్బర్లు, శనగలు, సోయా గింజలను ఉడకబెట్టి పక్కన పెట్టాలి.

ఆలివ్ ఆయిల్‌లో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర కలపాలి.

టొమాటో, కీరా, బొబ్బర్లు, శనగలు, సోయాగింజలు ఒక గిన్నెలో వేసి కలపాలి. అందులో ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని వే సి కలిపి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

గింజలు మొలకెత్తాలంటే...

పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, కందులు, పచ్చిబఠాణీలు, బీన్స్... ఇలా గింజధాన్యాలు మొలకెత్తాలంటే పది నుంచి పన్నెండు గంటలు నీళ్లలో నానబెట్టాలి.

ఆ తర్వాత గింజలను పల్చటి వస్త్రంలో వేసి, నీటిని వడకట్టాలి. తర్వాత కాస్త మందంగా ఉన్న వస్త్రంలో ఆ గింజలను వేసి, గట్టిగా మూట కట్టాలి. ఈ మూటను వెచ్చగా ఉండే చీకటి ప్రదేశం లో ఒక రోజు ఉంచాలి.

మొలకలకు నాణ్యమైన గింజలను ఎంచుకోవాలి. గింజ గట్టిదనాన్ని బట్టి కొన్ని రెండు రోజులకు కూడా మొలకలు రావచ్చు.

మొలకెత్తిన గింజలను ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే నాలుగైదు రోజుల పాటు వాడుకోవచ్చు.

మొలకెత్తిన గింజలను పచ్చిగాను, ఉడికించి గానీ తీసుకోవచ్చు. వీటిని ఆఫీస్, స్కూల్‌కు తీసుకెళ్లడం కూడా సౌలభ్యంగా ఉంటుంది.

మొలకెత్తిన గింజల్లో ఎక్కువ పీచుపదార్థాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పీచుపదార్థం అందుతుంది.

శాకాహారమే శ్రేష్టం


(నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం)

సంస్కృతిలో అంతర్భాగం ఆహారం. ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఎవరి ఆహార సం స్కృతి వాళ్లకుగొప్ప. కాబట్టి, ఫలానా ఆహారం మంచిది, ఫలానా ఆహారం చెడ్డ ది అన్న చర్చ అర్థంలేనిది. అయితే, వాతావరణంలో వస్తున్నమార్పు ప్రపంచాన్ని అమితంగా వేడెక్కిస్తున్న నేపథ్యంలో ఆహారాన్ని పర్యావరణ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. 

అంతర్జాతీయ శాకాహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు జరుపుకోవడంలేదు. ఉత్తర అమెరికా వెజిటేరియన్ సొసైటీ 1977 నుంచి అక్టోబర్ 1న శాకాహార దినోత్సవాన్ని నిర్వహిస్తుంటుంది. అక్టోబర్ నెలంతా శాకాహారం తో కూడిన జీవనశైలివల్ల కలిగేమేలు గురించి ప్రచారంచేస్తున్నారు. మన దేశం లో రుక్మిణీదేవి అరండేల్ సారథ్యంలో మద్రాసు కేంద్రంగా ఇండియన్ వెజిటేరియన్ కాంగ్రెస్ 1959లో కార్యకలాపాలు ప్రారంభించింది. దీన్ని ప్రస్తుతం ‘వరల్డ్ వెజిటేరియన్ కౌన్సిల్’గా మార్చారు. భారత్, ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లో నవంబర్ 25న ప్రపంచ శాకాహార దినోత్సవం నిర్వహిస్తున్నారు. 

అమెరికాలో ఈ మధ్య ‘సోమవారం మాంసం తినడం మానండి!’ పేరిట ఉద్యమం ప్రారంభమైంది. తద్వారా 15 శాతం మాంసం వినియోగం తగ్గుతుం దని అంటున్నారు. ‘సమతుల శాకాహారం అన్ని వయసుల వారికి, గర్భవతులకు, బాలింతలకు, క్రీడాకారులకు నూటికి నూరుపాళ్లూ పుష్టికరమైన ఆహా రం...’ అని అమెరికన్ డైట్ అసోసియేషన్ ప్రకటించింది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో పశుమాంసం వినియోగం చాలాఎక్కువ. 

అందుకోసం పారి శ్రామిక పద్ధతుల్లో భారీ సంఖ్యలో పశువుల్ని పెంచుతున్నారు. ఉష్ణోగ్రత ఈ శతాబ్దం అంతానికి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరిగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పారిశ్రామిక పశుపోషణ కేంద్రాలను 25 శాతం తగ్గించగలిగితే... వాతావరణ మార్పును చాలా వరకూ అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అడవులు నరికిన భూముల్లో పశువులకు దాణా సాగు కు ఉపయోగించడంవల్ల వాతావరణం వేడెక్కుతోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూభాగంలో 30 శాతా న్ని పశువుల పెంపకానికి వినియోగిస్తున్నారు. మాంసాహార వినియోగం 2050 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరిస్తోంది. మాంసకృత్తులను అందించడంలో శాకాహారమే అనేక విధాలుగా మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులను అం దించే ఆహారపదార్థాలలో ఏవి మెరుగైనవో చూస్తే ఆరు విధాలుగా శాకాహారమే మేలని తేలిందని ప్రపంచ బ్యాంక్‌కు సీనియర్ పర్యావరణ సలహాదారుగా పనిచేసిన రాబర్ట్ గుడ్‌లాండ్ అంటున్నారు. 

* ఖర్చులన్నీ కలిపి చూసినా గిట్టుబాటు కావడం.
* ట్రాన్స్ ఫ్యాట్స్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్, నైట్రేట్లు, నైట్రోసమైన్స్, సోడియం ప్రిజర్వేటివ్స్ వంటి హానికారకాలు తక్కువగా ఉండటం లేదా అసలు లేకుండా ఉండటం. 
* మాంసకృత్తులతోపాటు పీచు వంటి ఆరోగ్యదాయక పదార్థాలు ఉండటం.
* రోజువారీగా వినియోగించే ఆహారంలో అవసరమయ్యే అమినో యాసిడ్లన్నీ ఉండటం. 
* తక్కువ భూమిని ఉపయోగించి ఎక్కువ మాంసకృత్తులను ఉత్పత్తి చేయడం.
* పోషకాల సాంద్రత కలిగి ఉండటం. కూరగాయలు అత్యధిక పోషకాల సాంద్రత కలిగి ఉంటాయి. అవసరమైన అమినో యాసిడ్లు పంటల ద్వారా మాత్రమే లభిస్తాయి. 

ఎకరం పొలంలో పశువులను పెంచి ఉత్పత్తి చేసే మాంసకృత్తులకన్నా.. వివిధ పంటలసాగు ద్వారా అంతకు ఐదురెట్లు మాంసకృత్తులను ఉత్పత్తి చేయవచ్చు. సోయాచిక్కుళ్లలో మాంసకృత్తులు మరింత అధికంగా (10-15 రెట్లు) ఉంటాయి. రకరకాల పంటల ద్వారా వివిధ అమినో యాసిడ్లు శాకాహారులకు అందుబాటులోకివస్తాయి. మాంసంలో మాంసకృత్తులు అధికంగా లభించినప్పటికీ.. అవి సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్‌తో కూడి ఉంటాయి. పొట్టుతీయని ధాన్యాల పొడులు, చిరుధాన్యాలు, ముడి బియ్యం ద్వారా కేలరీలు, ఖనిజాలు, విటమిన్లు, పీచుపదార్థం పుష్కలంగా లభ్యమవుతాయి.

పప్పుధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉండడమేకాక అనారోగ్యకరమైన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బి12 వంటి అనేక విటమిన్లు, సూక్ష్మపోషకాలు వ్యవసాయోత్పత్తుల్లో కొరవడుతున్నాయి. పంటలను సారవంతమైన భూముల్లో పర్యావరణానికి హానిచేయని పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో సకల పోషకాలూ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తులకు శాకాహారంపై ఆధారపడ టం పెరిగితే రానున్న కాలంలో వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తవుడు తీసిన తెల్ల బియ్యానికి స్వస్తిచెప్పి... పీచుపదార్థంతో పాటు, సకల పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎదురే ఉండదు. 

Tuesday, November 20, 2012

ఉహుహూ వేళల్లో... ఆహాహా... ఆహారం

మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు అది ఆ సీజన్‌కు సరైనదా, కాదా అని ఆలోచించం. అయితే సీజన్‌ను బట్టి మనం తీసుకునే పదార్థాలను కొద్దిగా మార్చుకుంటే అది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. ఈ వింటర్‌లో మనం ఆరోగ్యం కోసం పాటించాల్సిన ఆహార జీవనశైలి ఈ కిందివిధంగా ఉంటే బెస్ట్. ప్రయత్నించి చూడండి.

బ్రేక్‌ఫాస్ట్

మీరు రోజూ తీసుకునే రెగ్యులర్ టిఫిన్ స్థానంలో వేడిగా ఉండే ఓట్‌మీల్‌తో తయారు చేసిన ఐటమ్స్ తీసుకోండి. బాగా కూరగాయలు ఎక్కువగా ఉండేలా ఉడికించిన కూరలతో బ్రెడ్ టోస్ట్ కూడా తీసుకోవచ్చు. ఆ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే దానికి బదులు ఈ వింటర్‌లో జింజర్ టీ తాగండి. వీలైతే అందులో ఒకటి రెండు తులసి ఆకులు వేసుకోండి.

దీనికి ఒక కారణం ఉంది. ఈ సీజన్‌లో చల్లగా ఉన్నందున మనం నీళ్లు తాగడం తగ్గిస్తాం. దానికి తోడు కాఫీ తాగితే మన శరీరంలో నీటి పాళ్లు మరింతగా తగ్గుతాయి. దానికి బదులు టీ తాగడం అన్నది మనకు చాలా మేలు చేస్తుంది. ఆ తర్వాత ఓ అరగంట వ్యవధి ఇచ్చి నారింజ, ఆపిల్ లేదా మరేదైనా ఒక పండు తినండి.

లంచ్

పొట్టుతీయని పిండితో చేసిన చపాతీలతో లేదా ముడిబియ్యంతో వండిన అన్నంతో చాలారకాల కూరగాయలతో చేసిన కూరలతో మధ్యాహ్న భోజనం మంచిది. ఇదెంతో మేలు చేస్తుంది. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే కూరల్లో అల్లం, ఉల్లి, కొత్తిమీర, వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. ఈ సీజన్‌లో వచ్చే అనేక రుగ్మతలను నివారించేలా అవి మీకు వ్యాధినిరోధక శక్తిని సమకూరుస్తాయి.

చలికాలం కదా అని కొందరు ఈ సీజన్‌లో నిమ్మకాయ వాడరు. మీకు అలర్జీ కలిగించకపోతే మీ లంచ్‌లోని కూరలపై కాస్తంత నిమ్మకాయ పిండండి. ఇది రుచిని పెంచడంతో పాటు మీకు ఈ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి అనేక జబ్బులనుంచి కాపాడేలా రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఇక ఈ సీజన్‌లో సూర్యరశ్మి కాస్తంత తగ్గుతుంది కాబట్టి మీకు అవసరమైన విటమిన్‌‘డి’, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమకూరేలా చేపలు పుష్కలంగా తినండి. గుడ్లు కూడా తీసుకోండి. ఈ సీజన్‌లో నీళ్లు తాగడం తగ్గిస్తాం. అది డీ-హేడ్రేట్ చేయవచ్చు. కాబట్టి దాహంగా లేకపోయినా నీళ్లు పుష్కలంగా తాగండి.



ఈవెనింగ్ శ్నాక్స్
సాయంత్రాల అలా పంటి కింద పటపటలాడించడానికి వేయించిన పల్లీలు, బాదంపప్పు మంచిది. ఇక కొవ్వు లేని పెరుగులో కొన్ని పండ్ల ముక్కలు వేసుకుని తినడం కూడా మేలే. దాంతోపాటు మొలకెత్తిన ధాన్యాలు. ఉడికించిన బఠాణీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.


డిన్నర్

ఈ సీజన్‌లో రాత్రివేళల్లో తినే భోజనంలో నూనె వీలైనంత తక్కువగా ఉండాలి. భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవడం ఎంతో మేలు. రాత్రి తినే భోజనంలో ఆకుకూరల్లో పాలకూర ఉంటే బెటర్. రాత్రి పూట చపాతీలు తీసుకునేవారు నూనెలేకుండా పుల్కాలు తినాలి. అందులో పుష్కలంగా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలాంటి కూరలు తినడం మేలు.

ఈ సీజన్‌లో వండే వంటలు ఆలివ్ నూనెతో వండితే... అది ఆరోగ్యానికిచేసే మేలు ఇంత అని చెప్పలేం. ఇక డిన్నర్ ముగించాక చివరన నిద్రకు ఉపక్రమించే ముందు వెన్న తీసిన పాలను వేడి చేసి గోరువెచ్చగా తాగడం మంచిది. పాలు క్యాల్షియమ్‌ను ఇస్తాయి. రాత్రి బాగా గాఢమైన నిద్రపట్టేలా చేస్తాయి.

పాప్‌కార్న్ తింటే పరమారోగ్యం...!


ఇప్పటివరకూ మీకు తెలిసిందేమిటి? సినిమా చూస్తూ ఏదో పంటి కింద పటపటలాడించడానికి పనికి వచ్చేదే పాప్‌కార్న్. అంతేగా? కానీ, న్యూట్రిషన్ పరంగా చూస్తే పాప్‌కార్న్ అంత తేలిగ్గా తీసిపారేయదగ్గ ఆహారమేమీ కాదు. అది షుగర్‌ను నియంత్రణలో పెడుతుంది. గుండెజబ్బుల్ని అదుపులో ఉంచుతుంది. ఇదేదో అల్లాటప్పాగా చెప్పడం కాదు. ఒక అధ్యయనంలో నిరూపితమైన సత్యం. కాబట్టి ఇది నిశ్చయంగా పాప్‌కార్న్ ప్రియులకు ఇది శుభవార్తే.

అమెరికాకు చెందిన నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహా నగరానికి చెందిన సెంటర్ ఫర్ న్యూట్రిషన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తెలిసిన విశేషాలు చాలా ఉన్నాయి. పాప్‌కార్న్ తిననివారితో పోలిస్తే రోజూ పాప్‌కార్న్ తినేవారికి ముడిధాన్యాలు తిన్నందువల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 250 శాతం అధికంగా ఉంటాయట. అంతేకాదు పొట్టుతీయని ధాన్యాన్ని పేలాలు (పాప్‌కార్న్)గా వేపడం వల్ల మిగతావారిలో పోలిస్తే పాప్‌కార్న్ తినేవారికి పీచుపదార్థాలు 22 శాతం అధికంగా లభ్యమవుతాయట.

అన్నట్టు దీన్నంతా చదివాక అదేపనిగా పాప్‌కార్న్ తినడం కూడా మంచిది కాదు. దానికీ ఒక కారణం ఉంది... పాప్‌కార్న్‌కు మరింత రుచిని ఇవ్వడం కోసం దానికి కలిపే ప్రతి టేబుల్ స్పూనంత వెన్న/నూనె/కొవ్వు పదార్థాల వల్ల్ల 100 క్యాలరీలు సమకూరడంతో పాటు గుండెకు రక్తసరఫరా చేసే ధమనిలో ఎనిమిది గ్రాముల కొవ్వు పేరుకునే అవకాశం కూడా ఉంది.

 
అంటే... నూనె వెయ్యని పొడి పేలాల వల్లనే పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. అంతేగాని నూనె లేదా బటర్ చేర్చే పాప్‌కార్న్‌తో కాదని గుర్తుంచుకోండి. ఇకపై పాప్‌కార్న్‌తో ప్రయోజనాలు పొందదలిచారా? షాపింగ్ మాల్స్‌లోనో లేదా సినిమా హాల్స్‌లోనో దొరికే నూనె చేర్చిన పాప్‌కార్న్స్ తినకండి. ఇంట్లో పొడిగా పేలాల్లా (ఎయిర్ పాప్‌డ్ కార్న్స్) వేపుకోండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి.

Thursday, November 1, 2012

చలికాలం... చర్మం పొడిబారుతోంది...

పొడిచర్మం గలవారికి చలికాలం సమస్యగానే ఉంటుంది. చలి కాబట్టి దాహం కూడా తక్కువే. అందుకే తక్కువ నీళ్లు తాగుతారు. దీంతో ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం ఇంకా పొడిబారుతుంది. అందుకని ఈ కాలం నీళ్లు ఎక్కువ తాగడానికి ప్రయ త్నించండి. కనీసం 2-5 లీటర్ల నీళ్లు తాగండి. ప్రతి మూడు గంటలకు ఒకసారి మాయిశ్చరైజర్‌ని రాసు కోవాలి. అయితే కోల్డ్‌క్రీమ్... మొటిమలు, యాక్నేకు కారణం కావచ్చు. అందుకని క్రీమ్ రాసుకోవడానికి ముందుగా ముఖాన్ని, చేతులను శుభ్రపరుచుకోవడం మరచిపోవద్దు. ఇంకా వారానికి ఒకసారి బాగా మగ్గిన అరటిపండు గుజ్జు తో ముఖాన్ని, చేతులను మసాజ్ చేసుకోవాలి. అలాగే ఆలివ్ ఆయిల్ కలిపిన పెరుగుతో వారానికి ఒకసారి శరీరాన్ని మసాజ్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలం ఈ సమస్య బాధించదు.

Monday, October 29, 2012

సైనసైటిస్‌కు పరిష్కారం

 విపరీతమైన తలనొప్పితో పాటు ముక్కు వెంట ద్రవాలు కారడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు సైనసైటిస్‌లో కనిపిస్తాయి. యాంటీబయోటిక్స్ ఎన్ని వేసినా ఫలితం శూన్యం.

తలనొప్పి తీవ్రంగా వేధిస్తోందా? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. సింపుల్‌గా చెప్పాలంటే సైనస్ గదుల్లో ఏర్పడే నొప్పినే సైనసైటిస్ అంటారు. ముక్కుకు ఇరువైపులా సైనస్ గదులుంటాయి. మనం పీల్చేగాలి వీటి ద్వారా ప్రయాణిస్తుంది. జలుబు, వాతావారణ కాలుష్యం, అలర్జీ వల్ల ఈ సైనస్ గదులు మూసుకుపోతాయి. దీనివల్ల మ్యూకస్ పేరుకుపోతుంది.

చలికి మాస్క్



చలికాలం వచ్చిందంటే చర్మానికి బోలెడె సమస్యలు. ముఖ్యంగా ముఖంపై చలి ప్రభావం పడకుండా ఉండడానికి బోలెడు ప్రయత్నాలు చేస్తుంటారు. అన్నింటికంటే ముఖానికి వేసుకునే మాస్క్‌లు మంచి ఫలితానిస్తాయి. వాటిలో కొన్ని ఇక్కడ ఇస్తున్నాం...

- మిగడతో ఉన్న పెరుగులో పెసరపిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత గోరువెచ్చటినీటితో కడిగేసుకోవాలి. చర్మంపొడిపారకుండా, పగుళ్లు రాకుండా ఉండాలంటే పెరుగు ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది.

వ్యక్తిత్వం ఎట్ నిద్రాభంగిమ...

మీరు కాలు ఇలా ముడుచుకుని(4వ చిత్రం) పడుకుంటారా? అయితే, మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరముంది. అలా పడుకున్నారంటే.. మీరు ఏదైనా విషయం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లేనట! ఎందుకంటే.. మనం పడుకునే భంగిమ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని శరీర భాషా నిపుణులు చెబుతున్నారు. వీరు ఇటీవల బ్రిటన్‌లో మనం పడుకునే భంగిమలపై పరిశోధన చేశారు. దాని ప్రకారం.. ఈ భంగిమలో పడుకుంటే.. వారి వ్యక్తిత్వం ఇలా ఉండే అవకాశముందంటూ వివరించారు. వాటిల్లో కొన్ని మీకోసం.

Sunday, October 28, 2012

‘లాలన, పాలన, పోషణ’ మీద అవగాహన

చిన్నపిల్లల్ని పుట్టిన దగ్గర నుండి 10 సంవత్సరాల వయసు వచ్చేవరకు పెంచి పెద్దచెయ్యడానికి తల్లిదండ్రులకు ‘లాలన, పాలన, పోషణ’ మీద అవగాహన కావాలి. లాలన వల్ల మనోవికాసం పదిలపడుతుంది. ఇది ప్రేమ, వాత్సల్యం వంటి ఉద్వేగాలకు సంబంధించింది. పాలన వల్ల పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ మెరుగుపడతాయి. పిల్లలకు ఎన్నో విషయాలను బోధపర్చడం, మంచి అలవాట్లను నేర్పించడం, సమాజ పోకడలకు గురిచేయడం వంటివి చెయ్యాలి. వీటికై తల్లిదండ్రులకు నేర్పు, ఓర్పు అవసరం. పోషణ వల్ల బరువు పెరగడం, క్షమత్వం అభివృద్ధి చెందడం, అనారోగ్యాలకు గురికాకుండా ఉండటం జరుగుతుంది. విటమిన్లు, ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి సహజ లవణాలు శిశువులకు తగు ప్రమాణాలలో అందించడం ముఖ్యం. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం కావలసిన ప్రమాణాలలో దేహానికి లభించనప్పుడు పాండురోగం, ఫక్కరోగం వంటివి కలుగుతాయి.

స్వైన్‌ఫ్లూ నివారణకు ఔషధాలు ...

స్వైన్‌ఫ్లూ, ఒక వైరస్ కలిగించే సాంక్రామిక వ్యాధి. ఇది శ్వాసకోశ సంస్థానానికి సంబంధించిన లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకడమనేది వ్యక్తి వ్యాధినిరోధకశక్తి, వైరస్ తీవ్రతల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయా రోగుల సంపర్కానికి దూరంగా ఉండాలి. ఈ కింద సూచించిన కషాయాన్ని అవసరమైనంత కాలం వాడుకుంటే ఈ వ్యాధిని నివారించుకోడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. వెల్లుల్లి, అల్లం, ధనియాలు, పసుపు ఐదేసి గ్రాములు తీసుకుని బాగా దంచి, దానికి 3 గ్రా. ‘దాల్చినచెక్క’ చూర్ణాన్ని కలపాలి. దీనికి పావులీటరు నీళ్లు కలిపి బాగా మరిగించాలి. 25 మి.లీ చొప్పున ఉదయం, రాత్రి తాగాలి. పిల్లలకు దీంట్లో సగం మోతాదు సరిపోతుంది. లభిస్తే ఒక చెంచా తులసి ఆకుల రసం గాని, ఉసిరికాయరసం గాని కషాయంలో కలుపుకుని తాగవచ్చు.

Wednesday, October 17, 2012

చక్కెరకూ - చర్మానికీ సంబంధం ....

చర్మం యౌవనంగా ఉండాలంటే... చక్కెర తక్కువ తినాలి. చక్కెరకూ, చర్మానికీ సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? ఉంది. చక్కెర పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో అది చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు దోహదపడే కొలాజెన్‌ను దెబ్బతీస్తుందట. ఫలితంగా చక్కెర పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో చర్మం చాలా త్వరగా సాగడం, బిగుతుగా ఉండటం అనే గుణా(ఎలాస్టిసిటీ)న్ని కోల్పోతుందట. ఈ విషయాన్ని ఇటీవలే యూ.ఎస్.లోని డార్ట్‌మౌత్ మెడికల్ స్కూల్ పరిశోధకులు తెలుసుకున్నారు. అందుకే దీర్ఘకాలం యౌవనంగా ఉండాలనుకున్నవారు తీపి పదార్థాలు కాస్త తక్కువ తీసుకోవడం మంచిది.

షూ కొనే వేళేది?

మంచి షూ వేసుకుంటే హుందాతనం అంతా ఇంతా కాదు. మరి మనం వేసుకునే షూ సౌకర్యవంతంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏ వేళలో కొనడం ఉత్తమం? ఇదీ ఒక ప్రశ్నేనా అనుకోకండి. వ్యాయామం చేసే వారికి ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తూ ఉండటం వల్ల అయ్యే వ్యాయామంతో అన్ని కండరాల్లాగే కాలి కండరాలు కూడా స్వల్పంగా పెరుగుతాయట. అందుకే సాయంత్రం వేళలో కాలి సైజ్ కాస్తంత ఎక్కువ ఉంటుంది. అలాగే రాత్రంతా విశ్రాంతి వల్ల ఉదయానికి కాలి కండరాలు కాస్తంత రిలాక్స్ అయి ఉంటాయి. కాబట్టి షూ కరెక్ట్ సైజ్ తెలుసుకోడానికి మధ్యాహ్నానికి, సాయంత్రానికి మధ్య వేళ అయితే బెటర్ అంటున్నారు నిపుణులు.

నవ్వుతో మేలు...

బరువు తగ్గడానికి ఇప్పటికే రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారా? వాటికి తోడు మరో మంచి మార్గం తెలుసుకోండి. విపరీతంగా నవ్వడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయన్నది ఇటీవలే యూ.ఎస్.లోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలుసుకున్న కొత్త సత్యం. ఇక్కడి నిపుణులు బాగా నవ్వించే విపరీతమైన కామెడీ సినిమాలను కొందరికి చూపించారు. ఆ సినిమాలు చూస్తూ నవ్వుతున్న వారికి 10 నుంచి 15 నిమిషాల్లో దాదాపు 50 క్యాలరీలు ఖర్చయినట్లు గుర్తించారు. అందుకే ఇకపై నవ్వుకు ఉన్న ప్రయోజనాలకు ఇది కూడా కలుపుకోవాలంటున్నారు వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు.

Tuesday, October 16, 2012

వ్యాయామంలో బిగుతైన అండర్‌గార్మెంట్స్ అవసరమా?


 సాధారణంగా ఎక్సర్‌సైజ్ చేసేవాళ్లు లేదా ఆటలాడే క్రీడాకారులు నడుముకు బిగుతుగా ఉండే బెల్ట్, లంగోటి, మంచి క్వాలిటీ అండర్‌వేర్, సపోర్టర్స్ వాడుతుంటారు. ప్రధానంగా స్థూలకాయం ఉన్నవారు, బిగుతుగా లేని లోవెయిస్ట్ ప్యాంట్స్ వేసుకునేవారిలో కడుపు కండరాలు బలహీనంగా ఉంటే... హైడ్రోసిల్, హెర్నియా సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే క్రీడాకారులు, డాన్సర్స్, మార్షల్ ఆర్ట్స్‌లో పాల్గొనేవారు నడుముకు బిగుతుగా ఉండే బెల్ట్స్ వాడుతుంటారు. దీనివల్ల కడుపు కండరాలకు బలమైన సపోర్ట్ ఉంటుంది.

Sunday, October 14, 2012

కాఫీతో క్యాన్సర్‌కు చెక్!

News TIP-1 on 14 sep 2012 

లండన్: రోజుకు ఆరు కప్పుల కాఫీ తాగడం చాలా మంచిదని హార్వర్డ్ యూని వర్సిటీ అధ్యయనం పేర్కొంది. దీని వల్ల మహిళల్లో గర్భాశయానికి, పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధి కి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడింది. 1,17,000 మందిపై జరిపిన అధ్యయనంలో ఇది తేలిందని పరిశోధకులు వివరించారు. ఇన్సులిన్ లెవల్స్‌ను ప్రభావితం చేయడం ద్వారా కాఫీ క్యాన్సర్ నిరోధకారిగా పనిచేస్తుందని అధ్యయన కర్తలు వివరించారు.

News TIP -2-on 17 sep 12

కాఫీతో కళ్లకు చేటు!


రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత గ్లకోమా (నీటి కాసులు) అనే కంటి వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది. ఆ ఫలి తాలు ‘ద జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫ్తాల్మాలజీ అండ్ విజువల్ సెన్సైస్’లో ప్రచురితమయ్యాయి. కంటిలో లెన్స్‌ను స్థిరంగా ఉంచేందుకు తోడ్పడే ఒక రకం ద్రవం తాలూకు ఒత్తిడి లెన్స్‌పై పెరగడం వల్ల క్రమంగా చూపు కోల్పోవడం అన్నది ‘గ్లకోమా’ వ్యాధిలో జరుగుతుంది. ఇటీవలే బర్మింగ్‌హమ్‌తో పాటు, బోస్టన్ వుమన్స్ హాస్పిటల్‌కు చెందిన కొందరు నిపుణులు కాఫీ వల్ల కంటిపై ప్రభావాన్ని అధ్యయనం చేయ డానికి పూనుకున్నారు.

నలభై ఏళ్లు దాటిక క్రమం తప్పకుండా కాఫీ తాగే లక్షా ఇరవై వేల మందిని, వాళ్ల ఆరోగ్య చరిత్రను, తీసుకునే మందులను, ఆరోగ్య సంబంధమైన ఇతర అంశాలను చాలా రోజుల పాటు పరిశీలించారు. ఇలా మితిమీరి కాఫీలు తాగుతుండేవారిలో... 40 ఏళ్లు దాటిన వారిలో ఒక శాతం మందిలోనూ, 65 ఏళ్లు దాటిన వారిలో 5 శాతం మందిలో గ్లకోమా వచ్చే రిస్క్ పెరిగినట్లు గుర్తించారు. అందుకే ఇకపై రోజులో మూడు కప్పుల కాఫీ కోటా కాస్తా పూర్తయిపోయే... నాలుగో కప్పు తాగే ముందు ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి.

Tuesday, October 9, 2012

మూలకణ పరిశోధకులకు నోబెల్

2012కుగాను వైద్యశాస్త్రంలో పురస్కారాల ప్రకటన


బ్రిటన్, జపాన్ శాస్త్రవేత్తలకు సంయుక్తంగా...

జాన్ గుర్డన్, షిన్యా యమనకలకు పురస్కారం

స్టాక్‌హోమ్: బ్రిటన్‌కు చెందిన జాన్ బి.గుర్డన్ (79), జపాన్‌కు చెందిన షిన్యా యమనకలకు సంయుక్తంగా ఈ ఏడాది వైద్యశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి దక్కింది. స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ కరోలిన్‌స్కా కమిటీ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. వైద్యశాస్త్రం లేదా ఫిజియాలజీ విభాగంలో 2012కి గానూ వీరికి నోబెల్ బహుమతి ప్రదానం చేయనున్నట్లు కమిటీ తెలిపింది. పరిణతి చెందిన మూలకణాన్ని ప్లూరిపొటెంట్ రకపు కణంగా మార్చవచ్చు అనే విషయాన్ని శాస్త్ర పూర్వకంగా నిరూపించినందుకు వీరికి సంయుక్తంగా నోబెల్ బహుమతిని ప్రకటిస్తున్నట్టు కమిటీ వివరించింది. కణ, జీవుల అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో వీరి పరిశోధనలు విప్లవాత్మకమైనవని అభిప్రాయపడింది.

Saturday, October 6, 2012

వాము మీ నేస్తం

వామును విరివిగా వాడితే వంటకాలకు మంచి రుచే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. వామును కొద్దిసేపు మంచినీటిలో నానబెట్టి, ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపి తాగితే వాంతుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాము తీసుకోవడం వల్ల శరీరంలోని వాతం తగ్గుముఖం పడుతుంది. కడపుబ్బరానికి కూడా వాము బాగా పనిచేస్తుంది. వాము, మిరియాలు,ఉప్పును సమభాగాలుగా తీసుకుని బాగా దంచి, రోజూ భోజనం చేసే ముందు తీసుకుంటే అజీర్తి సమస్య నుంచి గట్టెక్కవచ్చు. గుండెకు కూడా వాము వల్ల మేలు జరుగుతుంది. కరక్కాయ, తావికాయ,ఉసిరికాయలతో వామును కలిపి మెత్తటి ముద్దగా చేసి దంతాల కింది భాగంలో ఉంచితే ఎలాంటి దంత వ్యాధులూ దరిచేరవు. కొద్దిగా వామును తీసుకుని నములుతూ ఆ రసాన్ని చప్పరిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది.