Thursday, October 4, 2012

జలగలు - వైద్యం

ఒకరు మనల్ని పట్టి పీడిస్తుంటే ‘‘అబ్బా! జలగలా పట్టుకున్నాడురా బాబూ’’ అనుకోవటం పరిపాటి. మనలో చాలామంది జలగ అనే పదం ఉపయోగిస్తుంటాం. కాని చూసినవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. కానీ అందరికీ జలగ తత్వం, అది చేసే పనులు తెలుసు. కానీ, మనకు తెలియని... జలగ కోణం ఈరోజు తెలుసుకుందాం.



జలగలతో వైద్యాన్ని హిరుడోథెరపీ అంటారు. జలగ సాంకేతిక నామం హిరుడోస్. పద్దెనిమిది, పందొమ్మిది శతకాలలో జలగలను వైద్యానికి విరివిగా వాడేవారు. జలగలు వైద్యానికి ఉపయోగపడతాయని మొట్టమొదటిసారి చెప్పింది హిప్పోక్రేట్స్. శరీరంలో మలినాలు పెరిగినపుడు అనారోగ్యం సంభవిస్తుందని ఆ వైద్యశాస్త్ర పితామహుడు నమ్మాడు. అందుకనే ఎవరికైనా తీవ్ర అనారోగ్యం చేస్తే జలగల్ని పెట్టి రోగి రక్తం పీల్పించేసేవాడు. ఆ విధంగా మొదలైన వైద్యం పందొమ్మిదో శతకంలో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆరోజులో... యువకులు బురద గుంటల్లో కాళ్లు పెట్టి కూర్చుని, జలగలు వీళ్ల కాళ్లని పట్టుకోగానే, ఆ జలగల్ని వీళ్లు పట్టుకొని వచ్చి డాక్టరుకి అమ్మేవారు. ఆ తర్వాత జలగల్ని పట్టుకోవడంలో కూడా కార్పొరేట్ సంస్థలు ప్రవేశించాయి (1850 ప్రాంతంలో లెండి!). చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఫ్రాన్స్ దేశంలోని ఒక సంస్థ ఆ రోజుల్లో సంవత్సరానికి 4.5 కోట్ల జలగలను ఎగుమతి చేసిందట!


అసలు జలగ పట్టుకుంటే ఎంత నొప్పి ఉంటుంది!

జలగలు ఒక జీవిని పట్టుకున్నప్పుడు రక్తం పీల్చడానికి ముందు చర్మంలోనికి ఆ ప్రాంతం వరకు స్పర్శ తెలియకుండా రసాయనపదార్ధాలను వదిలి నొప్పిలేకుండా రక్తం పీల్చడం మొదలు పెడతాయి. అందువలన రక్తం పోతున్నా ఆ వ్యక్తికి నొప్పి తెలియదు. ఈ గుణాన్ని ఉపయోగించుకుంటూ, ఆ కాలంలో వైద్యులు అతి సున్నిత ప్రాంతాలలో వైద్యం చేయడానికి జలగలను వాడేవారు. జలగలు రక్తం గడ్డకట్టకుండా ఆపటానికి ఒక రసాయనాన్ని తయారుచేసి జంతువుల రక్తంలోకి వదులుతారు. ఆ రసాయనం పేరు హిరుడిన్. ఆ రసాయన ప్రభావంతో రక్తం గడ్డకట్టదు. జలగ నిరంతరాయంగా రక్తం పీల్చేస్తుంది.


 
జలగలకు, వైద్యులకు సంబంధం?

గ్రాంథిక ఆంగ్లంలో లేస్ (laes in anglosaxon)... అంటే మృదువుగా గాయాలను మానిపించేవాడు అని అర్థం. ఈ లేస్ నుంచే ఆంగ్లంలో లీచ్ ( జలగ) అనే పదం వచ్చింది. మృదువుగా వైద్యం చేస్తారు కాబట్టి వైద్యులను ఆరోజుల్లో లీచ్ అనేవారట! ఈ రోజుల్లో కూడా కొంతమంది వైద్యులను జలగలు అంటూ ఉంటారు. కాని దాని సందర్భం వేరు!

ప్రస్తుతం జలగలను వైద్యంలో మళ్లీ వాడుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీలో ముఖం మీద చర్మం గ్రాఫ్చేసిన తర్వాత చర్మం కింద రక్తం గడ్డకడితే దాన్ని తొలగించడానికి జలగలను వాడుతున్నారు. బ్రిటన్‌లో 80 శాతం ప్లాస్టిక్ సర్జన్లు కనీసం ఒక్కసారైనా ఈ జలగను వైద్యానికి వాడుతున్నారట. అంతేకాదు ఊడిపోయిన ముక్కు, చెవి, వేళ్లు... వీటిని తిరిగి అతికించడానికి కూడా మన జలగలు ఎంతగానో ఉపయోగపడతాయట. మోకాలి చిప్పలు అరిగిపోయినప్పుడు కూడా జలగలను వాడి, కీళ్ళలో పేరుకుపోయిన రక్తం, మలినాలను తీసివేస్తున్నారట! (కీళ్లనొప్పులు వస్తే- సమీపంలోని మందుల దుకాణంలో జలగలను అడగటం మరవకండే)!


జలగలతో వ్యాపారం

బ్రిటన్‌లో బయోఫార్మ్ అనే సంస్థ ప్రస్తుతం సంవత్సరానికి 50,000 జలగలను ఎగుమతి చేస్తోందట. అంతేకాదు అమెరికా దేశపు ఎఫ్డీఏ జలగలను వైద్యానికి ఉపయోగపడే పరికరాల కింద పరిగణించి వాటికి లెసైన్సు కూడా మంజూరు చేసింది.


బయోడైవర్సిటీలో జలగల పాత్ర

కొన్ని అంతరించిపోతున్న రాశుల ఆనుపానులు పట్టుకోవడానికి జలగలను ఉపయోగిస్తున్నారు. దట్టమైన అడవులలో ఉన్న బురద గుంటలలో, చెరువులలో, నదులలో ఉన్న జలగలను పట్టుకుని, దాని నోటిలోని రక్తం తీసి డిఎన్‌ఏ పరీక్ష చేసి, ఏదైనా అంతరించిపోయే జీవరాశి ఉందా అని తెలుసుకోవటానికి ఉపయోగిస్తున్నారు. అలా వైద్యశాస్త్రంలోనే కాదు, బయోడైవర్సిటీలో కూడా జలగలు దినదినప్రవర్థమానం అవుతున్నాయి. (ఈ వ్యాసం చదివిన తర్వాత మన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆంధ్రదేశంలో రొయ్యల చెరువులు, చేపల చెరువులతోపాటు జలగల చెరువులు పెట్టినా అతిశయోక్తి కాదు)!


హృద్రోగంలో జలగల పాత్ర!

రక్తం గడ్డకట్టడం వలన గుండె, రక్తనాళాల సమస్యలు తరచు తలెత్తుతుంటాయి. హృద్రోగులకు వాడే మందులలో రక్తం పలచన చేసి గడ్డ కట్టకుండా ఉండే మందులు చాలా తక్కువ. అందుకనే హిరుడిస్ అనే మందును జలగల నుండి ఉత్పత్తి చేసి వాడతారు. జలగల నుండి ఈ మందు తీయటం కష్టం. కాబట్టి ఈ మందుకు కృత్రిమ ప్రత్యామ్నాయాలు తయారుచేసి ఉపయోగిస్తున్నారు.

No comments: