జాజ్‌పూర్ (ఒడిశా): కేవలం సెల్‌ఫోన్, మెమరీ కార్డులు, జీన్స్ వంటి వస్తువులు కొనుక్కునేందుకే ఒడిశాలో ఓ తల్లి 17 నెలల మగబిడ్డను అమ్మేసినట్లు బుధవారం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జైలులో ఉన్న భర్తను విడిపించుకునేందుకు డబ్బు అవసరమై బిడ్డను విక్ర యించినట్లు తొలుత బుకాయించిన ఆమె తర్వాత చెప్పిన విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా ముందమల గ్రామానికి చెందిన రాఖీ పాత్రా(20) అనే మహిళ ఓ రిక్షా కార్మికుడితో కలిసి రూ. 5 వేలకే తన మగబిడ్డను విక్రయించింది. సెప్టెంబరు 17న కటక్‌కు చెందిన వ్యక్తి బిడ్డను కొనుగోలు చేసినట్లు మీడియా కథనాల ద్వారా వెలుగుచూడటంతో ఒరిస్సా హైకోర్టు సూ మోటోగా విచారణ ప్రారంభించి దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో పోలీసులు బాలుడిని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె పిల్లాడిని తీసుకోవడానికి నిరాకరించడంతో శిశు సంక్షేమ కమిటీకి అప్పగించారు. కొనుగోలుచేసిన వస్తువులను బట్టి చూస్తే పేదరికం వల్ల కాకుండా వాటి పట్ల వ్యామోహంతోనే ఆమె బిడ్డను అమ్మినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.
No comments:
Post a Comment