Wednesday, February 20, 2013

Phobias


భయం చాలా స్వాభావికమైన లక్షణం. అది అందరికీ సహజంగా ఉండేదే. ఉదాహరణకు నేల మీద ఎలుకలు తిరుగుతుంటే చాలామంది భయపడతారు.అలాగే ఎలాంటి హానీ చెయ్యకుండా గోడ మీద బల్లులు తిరుగుతున్నా చాలా మందికి అవంటే భయమే! ఏదయినా భయం అర్థం లేనిదై, అది యాంగ్జైటీని కలిగిస్తూ... మీ దైనందిన వ్యవహారాలను సాగనియ్యనంత తీవ్రంగా ఉంటే దాన్ని‘ఫోబియా’ అంటారు. గతంలో ఫోబియాల మాట ఎలా ఉన్నా ఇప్పుడు వీటిని పూర్తిగా తగ్గించవచ్చు. ఫోబియాల కథా కమామిషులతో పాటు వాటి చికిత్స ప్రక్రియల వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. 

భయం విస్తృతి ఎంతంటే!?
మనలోని 29శాతం మందిలో ఏదో ఒక అంశంపై ఫోబియా ఉంటుంది. పురుషులతో పోలిస్తే ఫోబియాలు మహిళల్లో రెట్టింపు మందిని బాధిస్తుంటాయి. 

ఫోబియాతో బాధపడే వ్యక్తుల భవిష్యత్తు... 
కాగ్నిటివ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి ఇతర ప్రక్రియలను కలుపుతూ చేసే చికిత్సలు, రిలాక్సేషన్ టెక్నిక్స్... వీటన్నింటి సహాయంతో ఇప్పుడు ఫోబియాలను పూర్తిగా తగ్గించడం సాధ్యమే. 


ఫోబియా అంటే భయపడకూడని అంశాల పట్ల తీవ్రమైన భయం. చాలా మందికి చాలా విషయాల పట్ల భయాలు ఉంటాయి. ఉదాహరణకు తలుపులు వేసి ఉండే గదుల్లో ఉండటం కొందరికి భయం, అలాగే కొందరికి చాలా ఎత్తుకు ఎక్కడం భయం. కొందరికి హైవే పై డ్రైవింగ్, కీటకాలు, పాములు... ఆఖరికి సూదులన్నా కూడా భయమే. వాస్తవంగా చెప్పాలంటే ఏ అంశం గురించైనా అర్థం లేని భయాలు అభివృద్ధి చెందవచ్చు. ఇవి కొందరిలో చిన్నప్పట్నుంచే ఉంటే... మరికొందరిలో పెద్దయ్యాక అభివృద్ధి చెందవచ్చు. 

అందరిలోనూ సాధారణంగా భయం కలిగించని పరిస్థితికి, అర్థం లేకుండా, నిర్హేతుకంగా భయపడుతూ ఉండే కొందరు తమ భయాలకు తామే ధైర్యం చెప్పుకుంటూ, వాటిని అధిగమిస్తూ ఉంటారు. అయితే కొందరికి తాము భయపడుతున్న అంశాన్ని గుర్తుతెచ్చుకుంటేనే... అంటే సంకల్పమాత్రానే భయం వేస్తుంది. అలాంటిది ఆ పరిస్థితికి ఎక్స్‌పోజ్ అయితే అది మరింత తీవ్రతరమవుతుంది. 

పైన పేర్కొన్న నరాలను మెలిపెట్టే అలాంటి పరిస్థితిని తప్పుకోడానికి మనం నిత్యం చేయాల్సిన కొన్ని పనులను సైతం పక్కన పెట్టి వాటినుంచి పారిపోతూ ఉంటాం. ఇది జీవితంలో ఎన్నింటినో కోల్పోయేలా చేస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఎత్తు ప్రదేశంలో ఉండటం అంటే భయం. ఫలితంగా తమ ఉద్యోగరీత్యా బహుళ అంతస్తుల్లో పైన ఉండాల్సి వస్తే ఉండే భయం వల్ల బాగా జీతం వచ్చే మంచి ఉద్యోగాన్ని వదిలేసుకోవాల్సి వస్తే?! ఇలాంటి భయం వల్లనే కొందరు కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఆఫీసును ఫ్లై ఓవర్ ఎక్కి దాటడానికి మనస్కరించక కనీసం 20 కి.మీ. అదనంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు పోయేవారున్నారు. నిజానికి ఈ భయాలు అర్థం లేనివి. పైగా వాటివల్ల కోల్పోయేది కూడా ఎంతో ఉంది. అలాంటప్పుడు ఆ భయా (ఫోబియా)లకు చికిత్స తీసుకోవడం అవసరమవుతుంది. 

భయం, ఫోబియాల మధ్య తేడా... 
ఏదైనా భయం గొలిపే పరిస్థితుల్లో భయం కలగడం అనేది సహజం. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి లేదా వాటిని అధిగమించడానికి అది అవసరం కూడా. అంటే భయం అన్నది ఒక రక్షణ కల్పించే చర్య అన్నమాట. ఇక్కడ భయం వల్ల ఒక ప్రయోజనం నెరవేరుతుంది.

భయపడ్డప్పుడు మన శరీరం, మనసు అప్రమత్తంగా మారి ఏ రకమైన చర్యకైనా వెనకాడకుండా తయారవుతాయి. మన స్పందనలు, ప్రతిచర్యలు చాలా వేగవంతంగా మారి మనకు రక్షణ కల్పిస్తాయి. కానీ ఫోబియాలో అలా జరగదు. అక్కడ లేని ప్రమాదాన్ని రోగి ఊహిస్తుంటాడు. ఉదాహరణకు చాలా భయంకరమైన కుక్క ఎదురైనప్పుడు అది కరుస్తుందేమో అని భయపడటం సహజం. కానీ అది పెంపుడు కుక్క అయినా భయపడటం అర్థరహితం. డాగ్ ఫోబియా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.

సాధారణంగా మనలో ఉండే భయాలు, ఫోబియాలు
మనందరిలో సాధారణంగా ఉండే భయాలు, ఫోబియాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... 
జంతువుల ఫోబియా... చాలామందికి పాములు, తేళ్ల వంటి విషజీవులు, సాలెపురుగులు, ఎలుకలు, కుక్కలంటే భయంగా ఉంటుంది. 

స్వాభావిక పరిసరాల్లో కొన్నింటి పట్ల ఉండే ఫోబియా... ఉదాహరణకు ఎత్తుకు ఎక్కాక కిందికి చూడటం వల్ల, తుఫానులు, చాలా విశాలమైన నీటిని, చిమ్మచీకటిని చూసినప్పుడు భయం కలుగుతుంది. 

పరిస్థితుల వల్ల కలిగే ఫోబియాలు: కొన్ని పరిస్థితుల్లో మనకు భయంగా ఉంటుంది. ఉదాహరణకు... తలుపులు మూసి ఉంటే (క్లాస్ట్రోఫోబియా), డ్రైవింగ్ సమయాల్లో, గుహల్లోకి ప్రవేశించినప్పుడు, బ్రిడ్జ్‌పైకి వెళ్లినప్పుడు. 

గాయం, రక్తం, ఇంజక్షన్ వంటి భయాలు: వైద్యచికిత్సలో చేసే ప్రక్రియలు అంటే ఇంజక్షన్ వంటి వాటికి భయపడుతుంటారు. చాలామందిలో నలుగురిలో మాట్లాడటం అన్నా, కీటకాలన్నా లేదా ఎవరికైనా జబ్బుగా ఉండటం లేదా చనిపోతారన్న భయాల వంటివి ఉంటాయి. 

ఫోబియా లక్షణాలు... 
ఏదైనా భయం కాస్తా ఫోబియాగా మారినప్పుడు మొదట యాంగ్జైటీ కలిగి అది తీవ్రమై (ప్యానిక్) చాలా తీవ్రంగా వ్యవహరిస్తారు. దీన్ని ఫుల్‌బ్లోన్ ప్యానిక్ ఎటాక్ అనుకోవచ్చు. మనం భయపడుతున్న విషయానికి ఎంత దగ్గరగా ఉంటే భయం తాలూకు తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. భయం ఎంత ఎక్కువగా ఉంటే దాని నుంచి బయటపడటం అంత కష్టమవుతుంది. ఈ లక్షణాలు సైతం రెండు రకాలుగా కనిపిస్తాయి. అవి... 

భౌతికంగా కనిపించే లక్షణాలు: ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం గుండె వేగం అధికం కావడం ఛాతీలో నొప్పి లేదా ఛాతీ బిగదీసుకుపోవడం వణుకు నిద్రవస్తున్నట్లు లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం కడుపులో తిప్పినట్లుగా / దేవినట్లుగా అనిపించడం ఒంట్లోంచి వేడి ఆవిరులు బయటకు వస్తున్నట్లుగా అనిపించడం చెమటలు పట్టడం... వంటివి
ఉద్వేగపూరితమైన లక్షణాలు: యాంగ్జైటీ ఎక్కువ కావడం ఆ తర్వాత ప్యానిక్‌గా మారడం అక్కడి నుంచి పారిపోవాలన్న బలమైన కాంక్ష మనలోంచి మనమే వేరైన అనుభూతి మనపై మనం అదుపు కోల్పోవడం కాసేపట్లో చచ్చిపోతామా అన్న ఫీలింగ్ ఒక విషయం పట్ల మనం మితిమీరి స్పందిస్తున్నామని తెలిసినా దాన్ని నియంత్రించుకోలేని శక్తి. 

ఫోబియాల వల్ల కలిగే దుష్ర్పభావాలు: ఫోబియాలకు చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తే అవి వ్యక్తిగత జీవితాన్ని చాలా దుర్భరం చేస్తాయి. వాటిని దాచిపెట్టినా సరే... దాని ఫలితాలు మీ జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు విమాన ప్రయాణం అంటే భయం ఉంటే దాన్ని దాచితే జీవితంలో చాలా కోల్పోవచ్చు. అలాగే కొన్ని ఫోబియాల వల్ల వ్యక్తిగత జీవితంలో స్నేహితులకు, బంధువులకు దూరం కావడం, ఉద్యోగం కోల్పోవలసి రావడం వంటి తీవ్రపరిణామాలు సంభవించవచ్చు.

ఫోబియా ఉన్నవారు వాటిని అధిగమించదలచినప్పుడు క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. అంతేతప్ప... అకస్మాత్తుగా అంతా చక్కబడిపోదు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారికి మిగతా వారిలో పోలిస్తే ఫోబియాలకు గురయ్యే అవకాశాలు పదింతలు ఎక్కువ. అలాగే ఫోబియాలు ఉన్నవారు సైతం ఆల్కహాల్‌కు అలవాటు పడే అవకాశాలు సైతం రెండింతలు ఎక్కువ. ఒక్కోసారి ఫోబియా వల్ల కలిగే యాంగ్జైటీ (ఉద్విగ్నత) ప్రమాదకరమైన పరిస్థితికి, ఒక్కోసారి మరణానికి సైతం దారితీసే అవకాశం ఉంది. అది గుండెజబ్బులకూ దారితీయవచ్చు. 

ఫోబియా వర్గీకరణ ఇలా... సైకియాట్రిస్టులు ఫోబియాలను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. 
సామాజిక ఫోబియా (సోషల్ ఫోబియా): సాధారణంగా ఇవి అందరిలోనూ ఉండే సహజ భయాలే అయినా కొందరిలో మితిమీరి ఉంటాయి. ఉదాహరణకు కొందరు బయట తినడం అనే విషయం పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తూ దానివల్ల కలిగే పరిణామాలను అతిగా ఊహించుకుంటారు. సాధారణంగా సోషల్ ఫోబియాలు చికిత్సకు సైతం ఒకపట్టాన తేలిగ్గా లొంగవు. సామాజిక ఫోబియాలు తమకు చిన్నప్పుడు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా కలుగుతాయి. 

సాధారణంగా పదవ ఏటి కంటే ముందు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా ఏర్పడ్డ భయాలు కొందరిలో కాలక్రమేణా తొలగిపోవచ్చు. కానీ యుక్తవయసులో తమ స్నేహితుల నిరాదరణకు గురైన కారణంగా ఏర్పడ్డ భయాలు మాత్రం అంత తేలిగ్గా తొలగిపోవు. అవి వయసుతో పాటు పెరుగుతూ పోవచ్చు. నిర్దిష్ట ఫోబియాలు (స్పెసిఫిక్ ఫోబియాస్): ఈ ఫోబియాలు నిర్దిష్టంగా ఫలానా అంశం వల్ల కలుగుతుండే భయాలు అని చెప్పవచ్చు. ఉదా. పాములు, నీళ్లు, ఎత్తులు, విమానప్రయాణం, రోగభయం... ఇలాంటివన్నమాట. 

అగారోఫోబియా: ఇది ఇంటికి దూరంగా ఉన్నప్పుడు లేదా మనకు సురక్షితంగా ఉన్న స్థలానికి దూరంగా ఉన్నప్పుడు కలిగే తీవ్రమైన భయాలు అని చెప్పవచ్చు. 
ప్యానిక్ అటాక్ అంటే...: ఏదైనా ఫోబియాకు గురై భయపడటంలోని తీవ్రత తారస్థాయికి చేరినప్పుడు కలిగే మానసిక స్థితిని ప్యానిక్ అటాక్‌గా చెప్పవచ్చు. ఇది కలిగినప్పడు కనిపించే లక్షణాలు... తీవ్రమైన భయం గుండెవేగంలోని తీవ్రత చాలా ఎక్కువగా పెరగడం శ్వాస అందకపోవడం వణుకు ఒక్కోసారి స్పృహతప్పడం చనిపోయినట్లుగా అనుభూతి చెందడం అక్కడి నుంచి పారిపోవాలన్న తీవ్రమైన కాంక్ష. 

ప్రతికూల ఆలోచనలను అధిగమించడం... 
వాస్తవానికి ఒక ఫోబియా స్థితిలో అసలు భయం కంటే... దానివల్ల కలిగే ప్రతికూల (నెగెటివ్) ఆలోచనల వల్లనే ఎక్కువగా భయం కలుగుతుంది. ఉదాహరణకు ఒక బ్రిడ్జి మీద వెళ్తుంటే... అది బాగానే ఉన్నా... ఒకవేళ కుప్పకూలితే అన్న ఆలోచన కలగగానే ఆ అనంతర పరిణామాలను ఊహించడం వల్ల కలిగే భయమే ఎక్కువ. 

కాబట్టి ఇలాంటి అనవసరమైన ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుంటే భయాలు కలగనే కలగవు. అలాగే కొన్ని సాధారణ ఆలోచనలనూ వదులుకోవాలి. అంటే... కుక్కలన్నీ కరుస్తాయి. ఎద్దులన్నీ పొడుస్తాయి వంటి జనరలైజ్‌డ్ ఆలోచనలు వద్దు. ఒక ఉత్పాతం తప్పనిసరిగా జరుగుతుందని అనుకోవద్దు. ఉదాహరణకు మీరు విమానంలో ఉంటే అది తప్పక కూలిపోతుందేమోనని లేదా ఒకరికి దగ్గు వస్తే అది తప్పక స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనని... ఇలాంటి ఆలోచనలు వద్దు. 

ఏ వయసు పిల్లల్లో 
ఎలాంటి భయాలు...?
పిల్లల్లో సాధారణంగా కొన్ని కొన్ని వయసుల్లో కొన్ని విషయాలంటే భయం అధికంగా ఉంటుంది. అవి... 

0 - 2 ఏళ్ల పిల్లల్లో... పెద్ద శబ్దాలు, అపరిచితులు, తల్లిదండ్రుల నుంచి విడిగా ఉండాల్సి రావడం, పెద్ద పెద్ద వస్తువులంటే భయం. 

3-6 ఏళ్ల పిల్లల్లో... దెయ్యాలు, భూతాల వంటి అభూత కల్పనాత్మక పాత్రలంటే భయంతో పాటు ఒంటరిగా పడుకోవాల్సి రావడం, వింత శబ్దాలంటే భయంగా ఉంటుంది.

7- 16 ఏళ్ల పిల్లల్లో... ఇలాంటి పిల్లల్లో వాస్తవ విషయాలపట్ల అంటే ఆడుతున్నప్పుడు గాయాల భయాలు, జబ్బు భయాలు, తల్లిదండ్రుల మధ్య ఘర్షణ, స్కూల్లో పెర్‌ఫార్మెన్స్ తగ్గుతున్నప్పుడు కలిగే భయాలు, ప్రకృతి విలయాలు, స్వాభావిక ఉత్పాతాలంటే భయాలు ఉంటాయి. 

అధిగమించండిలా...
మీరు ఎలాంటి పరిస్థితుల్లో భయపడుతున్నారో ఆ జాబితాను తయారుచేసుకోండి. ఉదాహరణకు మీకు విమాన ప్రయాణం అంటే భయమనుకోండి. మీరు ఆ క్రమంలో జరిగే అనేక పనులను ఒక జాబితాగా రాయండి.

ఉదా: మీరు టికెట్ బుక్ చేస్తారు. ఆ తర్వాత ప్యాకింగ్, ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం, అనంతరం సెక్యూరిటీ చెక్‌కు వెళ్లడం, విమానం దిగడం - ఎగరడం చూడటం, విమానంలోకి ఎక్కడం (బోర్డింగ్), భద్రత కోసం ఫ్లైట్ అటెండెంట్స్ చెప్పే భద్రత చర్యలను పాటించడం... ఇక ఒక్కోదశలో జరిగే ప్రమాదాలను విశ్లేషించుకోండి. మీకు విమానం ఎగిరే దశలో చాలా కొద్దిపాటి రిస్క్ తప్ప మరేదశలోనూ సమస్య ఎదురవ్వదని అర్థమవుతుంది. అలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తున్న కొద్దీ భయం తొలగిపోతుంది. 

హైపోకాండ్రియాసిస్...
కొందరిలో ఈ భయాలు పెచ్చుమీరి తమకు ఏదైనా ఆరోగ్యసమస్య ఉందేమో అని అనుమానిస్తుంటారు. ఈ అనుమానం కాస్తా పెనుభూతమై తమకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుని భయపడుతుంటారు. అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకుంటూ, అందులో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాకపోయినా లేని లక్షణాలను ఉన్నట్లుగా ఊహించుకుంటూ బాధపడుతుంటారు.

మాటిమాటికీ పరీక్షలు చేయించుకోడానికి సూదులతో గుచ్చడం వల్ల పడే దుష్ర్పభావాలు, నొప్పి నివారణ మందులు వాడటం, యాంగ్జైటీని తగ్గించే మందులు వాడటం, సమస్య లేకపోయినా మాటిమాటికీ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ విలువైన తమ సమయాన్ని వృథా చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి భయాలను కూడా మంచి కౌన్సెలింగ్‌తో తొలగించడం సాధ్యమే.

ఫోబియాలకు చికిత్స...
ఫోబియాకు సమర్థమైన చికిత్స సైకోథెరపీ (కౌన్సెలింగ్). దీనితో పాటు మందులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ అవసరమవుతాయి. మీ భయాన్ని మీరే ఎదుర్కోండి. మనకు ఏదంటే భయమో ఆ విషయాన్ని మనకు మనమే మెల్లగా ధైర్యం చెప్పుకుంటూ ఎదుర్కొంటూ ఉండాలి. ఈ ప్రయత్నంలో ఫోబియా అన్నది మనం భయపడుతున్నంత భయంకరమైనది కాదని అనిపిస్తున్నకొద్దీ ఫలితం మరింత మెరుగవుతూ పరిస్థితులు మీ అదుపులోకి వచ్చేస్తాయి. 

కొన్నిసార్లు కేవలం 1 నుంచి 4 సెషన్స్‌లోనే ఫలితం వచ్చేస్త్తుంది భయాలను క్రమంగానూ, మాటిమాటికీ ఎదుర్కోవడం... మీకు ఏ విషయం గురించి భయమో దాన్ని నేరుగా ఒకేసారి కాకుండా... క్రమంగా, మాటిమాటికీ ఎదుర్కొంటూ పోతే అది మీరు ఊహించినంత భయంకరమైనది కాదని అర్థమవుతున్న కొద్దీ మీరు మీ భయాన్ని అధిగమిస్తూ, మీ ఫీలింగ్స్‌పై ఆధిక్యత సాధిస్తారు. 

రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకోవడం... 
మనకు ఏదైనా విషయంలో భయం వేయగానే ఉద్విగ్నత (యాంగ్జైటీ) కలుగుతుంది. దానివల్ల గుండెవేగం పెరగడం, ఊపిరి ఆడనట్లుగా ఉండటం (సఫొకేటింగ్) వంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. వీటివల్ల మన భయం మరింతగా పెరిగినట్లయి, నిరాశలోకి కూరుకుపోతారు. అందుకే యాంగ్జైటీని అధిగమించే ప్రయత్నంలో భాగంగా రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను నేర్చుకుని అవలంబించడం వల్ల క్రమంగా ఉద్విగ్నతను, ప్యానిక్ ఫీలింగ్స్‌ను, భయాన్ని ఎదుర్కొనవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్‌లో బలంగా ఊపిరిపీల్చడం (డీప్ బ్రీతింగ్), ధ్యానం, యోగా వంటి వాటితో ఉద్విగ్న పరిస్థితుల్లోనూ స్థిమితంగా ఉండటం ప్రాక్టీస్ చేయవచ్చు. 

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ): ఫోబియాలను గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడే చికిత్స ప్రక్రియ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సీబీటీ అంటే ఒకరకమైన కౌన్సెలింగ్. దీనితో పాటు మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్స్, బీటా బ్లాకర్ మెడిసిన్స్, బెంజోడయాజిపైన్స్ వంటి మందులతో పాటూ సీబీటీ చేయాల్సి ఉంటుంది.

No comments: