Sunday, February 17, 2013

Mr & Mrs. Puvvada Nageshwara rao


రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తిగా, సి.పి.ఐ ఫ్లోర్ లీడర్‌గా, ఎమ్.ఎల్.ఎగా, ఎమ్.ఎల్.సిగా రాష్ట్ర ప్రజలకు ఆయన చిరపరిచితులు. పేరు పువ్వాడ నాగేశ్వరరావు. ఆయన రాజకీయ జీవితానికి అరవై ఏళ్లు,వైవాహిక జీవితానికి యాభై ఏళ్లు నిండాయి. ఆయన సతీమణి విజయలక్ష్మి. భర్త ప్రతి అడుగులోనూ ఒద్దికగా నిలిచిన ఇల్లాలు. ఖమ్మం జిల్లాలో ఉంటున్న ఈ దంపతులను కలిసిసినప్పుడు- ‘కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లితేనే సమాజం సుసంపన్నంగా ఉంటుంది’ అన్నారు. వివాహం తమ జీవితానికి ఎంతటి నిండుదనాన్ని తీసుకువచ్చిందో వివరించారు. వారి దాంపత్య విశేషాలే ఇవాళ్టి బెటర్ హాఫ్...

ఇద్దరివీ కమ్యూనిస్టు కుటుంబాలే! నిరుపేదల పక్షాన నిలిచి ఉండే వ్యక్తుల నడుమ పెరిగినవారే! అప్పటికి అమ్మాయి ఇంటర్మీడియట్, అబ్బాయి డిగ్రీ పూర్తి చేశారు. పెద్దలు కుదిర్చిన సంబంధమే! కలిగిన కుటుంబాలే అయినా పెద్దలు వీరిని 1963 ఫిబ్రవరి 14న నిరాడంబరంగా దండల పెళ్లితో ఒక్కటి చేశారు. ‘ఈ రోజుల్లో పెళ్లిని ఆడంబరంగా చేసుకోవడానికి ఇచ్చినంత ప్రాధాన్యత జీవితాన్ని అందంగా మలుచుకోవడంలో చూపించడంలేదు’ అన్నారు నాగేశ్వరరావు. ‘భార్యా భర్త ఎక్కువ తక్కువలనే భావాలకు తావివ్వకుండా ఎవరి పనులు వారు సవ్యంగా చూసుకుంటూనే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటే ఏ దాంపత్యమైనా కలకాలం నిలుస్తుంది’ అన్నారు విజయలక్ష్మి. 

ఇప్పటికీ మరవని ప్రేమ

పువ్వాడ: ఈ ఏడాది నుంచే నేను కాస్త లీజర్‌గా ఉంటున్నాను. అంతకుముందు ఏ టైమ్‌కు ఎక్కడ ఉండేవాణ్ణో నాకే తెలియనంత బిజీగా గడిపాను. ఇంటి బాధ్యతలన్నీ ఈవిడే చూసుకునేది. మేం ముగ్గురం అన్నదమ్ములం, ఇద్దరు చెల్లెళ్లు. ఉమ్మడి కుటుంబం. అయినా ఏనాడూ ఫలానా సమస్య అని నేను ఇంటికి రాగానే చెప్పినట్టు, నేను చిరాకు పడిన ట్టు ఒక్కటీ గుర్తులేదు. పైగా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇంటికి వచ్చినా ఓపిగ్గా వండి పెట్టేది. ఇప్పుడు ఈమెకు డెభ్బై ఏళ్లు. నేను వారించినా ఇంట్లో పనివాళ్లు, కోడళ్లు ఉన్నా నాకు అవసరమైన వాటిని ఈవిడే దగ్గరుండి చూస్తుంది. నేనింతవరకు షాపింగ్ చేసిందే లేదు. కర్చీఫ్ దగ్గర నుంచి కాలికి ధరించే సాక్స్‌ల వరకు అన్నీ ఓర్పుగా కొని తెస్తుంది. నాకు బి.పి, షుగర్.. ట్యాబ్లెట్లు అన్నీ విడివిడిగా ప్యాకెట్లలో పోసి, వాటి మీద టైమ్, వివరాలన్నీ రాసి ఉంచుతుంది. భర్త అవసరాలు చూడటమేనా భార్య అంటే కాదు, బాధ్యతతో కూడిన ప్రేమ ఇల్లాలిది. డెభ్బై ఐదేళ్లకు కూడా నేనింత బాగున్నానంటే ఆ ప్రేమ మా లక్ష్మిలో ఉండబట్టే! 

విజయలక్ష్మి: ముగ్గురు తోబుట్టువుల మధ్య పెరిగాను. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో మా అమ్మ ద్వారా గ్రహించాను. ఈయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా చెప్పిన టైమ్‌కి రాకపోతే ఏమీ అనరు. మరో పనికి వెళ్లిపోతారు. అవతలి వారే ఈయన నిబద్ధతను అర్ధం చేసుకుని నడుచుకుంటారు. అలా నేనూ ఈయనకు అనుగుణంగా నా పద్ధతులను మార్చుకున్నాను. ఈయన బయట ఎంతోమంది మధ్య తిరిగే వ్యక్తి. ఇంటికి ఎంత ఒత్తిడితో వస్తారో నాకు తెలుసు. అందుకే ఇంటి చికాకులేవీ ఈయన ముందుకు తెచ్చేదాన్ని కాదు. అలాగే ఈయన బయట చికాకులు, గొడవలు, పదవులు... ఎన్నడూ ఇంటికి తెచ్చేవారు కాదు. కసుర్లు, విసుర్లు, మాట విరుపులు ఎప్పుడైనా నీటి మీద బుడగల్లా వచ్చిపోయేవే తప్ప మనసు కష్టపెట్టిన మాట ఒక్కటీ గుర్తుకులేదు. ఈయన చేతుల మీదుగా వేదికలపై వందల పెళ్లిళ్లు చేశారు. ఆ సందర్భంలో ఎప్పుడూ ఒక మాట చెబుతారు. ‘కుటుంబం ఆనందంగా ఉంటేనే సమాజం బాగుంటుంది’ అని. అదే నా భావన కూడా! 

ఆటపాటల హరివిల్లు

పువ్వాడ: దాంపత్యబంధానికి బలం చేకూర్చేది పిల్లలే! మాకు ఇద్దరు అబ్బాయిలు. ఉదయ్‌కుమార్, అజయ్‌కుమార్. వారి పెంపకం బాధ్యతలో నా పాత్ర చాలా తక్కువ! పొద్దున లేచింది మొదలు పార్టీ పనులంటూ వెళ్లిపోయేవాడిని. వారి చదువులన్నీ లక్ష్మీయే చూసుకుంది. అబ్బాయిలే అయినా ఎవరిసాయం లేకుండా వారి పనులు వారే సొంతంగా చేసుకునేలా అలవాటు చేసినట్టు చాలాసార్లు గ్రహించాను. అందుకే కాలేజీ స్థాయికి వచ్చాక పెద్దవాడు రష్యాలో ఆరేళ్లు, చిన్నవాడు బెంగుళూరులో రెండేళ్లు ఉండి తమ పనులు తాము చేసుకుంటూ చదువుకోగలిగారు. 

విజయలక్ష్మి: ఈయన బయట ఎన్ని పనులు ఉన్నా, ఇంటికి వస్తే చిన్నపిల్లాడైపోయేవారు. పిల్లలిద్దరినీ చెరో వైపు భుజం మీద కూర్చోబెట్టుకొని తిప్పిన రోజులు ఇప్పటికీ కళ్లకు కట్టినట్టున్నాయి. ఇద్దరినీ ఒళ్లో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. ఈయనకు పిల్లల్ని డాక్టర్లను చేయాలని ఉండేది. కాని ఆ ఇష్టాన్ని ఎప్పుడూ వారిమీద చూపించలేదు. పిల్లలు స్వేచ్ఛగా తమకు నచ్చినవే ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. పిల్లలు కూడా ఏం చేయాలనుకున్నా ముందుగా ఈయనతోనే చర్చించేవారు. పెద్దవాడు ఉదయ్ పార్టీలోనే చురుగ్గా పాల్గొనేవాడు. చిన్నవాడు హైదరాబాద్‌లో ప్రెస్ పెట్టుకున్నా డు. ఇప్పుడు రాష్ట్రంలోనే పెద్ద పేరున్న (మమతా మెడికల్ కాలేజీ) మెడికల్ కాలేజీని నిర్వహిస్తున్నాడు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ విషయంలోనూ వాడి ఇష్టానికే స్వేచ్ఛను ఇచ్చారీయన. 

కలసి ఉంటే కలదు సుఖం

పువ్వాడ: ఎవరి పెళ్లికైనా వెళ్లడం మినహా నేనెలాగూ ఎవరికీ అందుబాటులో ఉండేవాడిని కాదు. నా బంధువులు, తన బంధువులు అనే భేదం లేకుండా ఎవరొచ్చినా ఈవిడే చూసుకునేది. మా చెళ్లెళ్లు, వారి పురుళ్లు, పెట్టుపోతల విషయాలు.. ఈవిడే చూసుకుంది. ఇప్పటికీ కోడళ్లను కూతుళ్లలా చూసుకుంటుంది. వెయ్యి రూపాయలిచ్చినా దాంతోనే ఆ నెలంతా ఇల్లు నడిపేది. ఇంత తక్కువా అన్నది కూడా ఎన్నడూ లేదు. ఇల్లాలిని బట్టి ఇల్లు ఉంటుంది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. 

విజయలక్ష్మి: ఈయన ఏనాడూ దేనికీ ఆంక్షలు పెట్టింది లేదు. డబ్బు విషయంలోనూ అంతే! పదివేలు ఇచ్చినప్పుడు దాచి, వెయ్యి రూపాయలే ఇచ్చినప్పుడు సర్దిపుచ్చేదాన్ని. సంపాదించేది ఒక్కరు, తినేవి పది నోళ్లు. ఆ మాత్రం సర్దుబాటు ఇల్లాలిగా నాకు లేకపోతే అవస్థలు పడతామని తెలుసు. అందుకే పొదుపు పాటించేదాన్ని. ఈయనలో అమితంగా నచ్చే అంశం ఎవరైనా సరే స్వేచ్ఛగా ఉండాలంటారు. మా పిల్లల పెళ్లిళ్ల విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మా పెద్దబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఈయన వెంటనే సరే అన్నారు. ఈయన మాటే నా మాట. వాడిష్టప్రకారమే దండల పెళ్లి చేశాం. కొడుకులే కాదు కోడళ్లూ చదుకోవాలని, వారి చేత డిగ్రీలు చేయించారు. ఇల్లాలు చదువుకుంటే ఇల్లు బాగుపడుతుంది అనేవారు. 

కష్టాలలో తోడూనీడ

పువ్వాడ: పెద్దవాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోదామనుకున్నారు. అప్పుడు ఈవిడా, నేను చాలా బాధపడ్డాం. వారిద్దరినీ కలిపి ఉంచడానికి చాలా ప్రయత్నించాం. వారింటికి వెళ్లి నచ్చజెప్పాం కూడా. కాని అప్పటికే వారిద్దరూ నిర్ణయం తీసేసుకున్నారు. విడిపోయారు. ఆ సమయంలో ఈవిడ నాకు ఎంతో మనోధైర్యాన్ని కలిగించింది. 

విజయలక్ష్మి: పెద్దబ్బాయి రెండో పెళ్లి విషయంలోనూ ఈయన వాడి స్వేచ్ఛకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈయన తీసుకునే నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో నాకు చాలా సార్లు రుజువు అయ్యింది. జీవితంలో స్థిరపడడానికి ఉదయ్, అజయ్ చాలా కష్టాలు పడ్డారు. వారి అవస్థలు చూసి నాకు బాధ కలిగేది. ‘ఎదుగుదలలో శ్రమ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది’ అని ఈయన నాకు తరచూ చెబుతూండేవారు. ఆ మాటలు నాకు ఎంతో ఊరట కలిగించేవి. ఆ తర్వాత వాళ్లూ వృద్ధిలోకి వచ్చి మమ్మల్ని సంతోషపెట్టారు. ఆరేళ్ల క్రితం మా పెద్దబాబు ఉదయ్ ప్రమాదవశాత్తు మరణించాడు. వాడి జ్ఞాపకాలే ఇంకా మమ్మల్ని వీడటం లేదు. ‘ఎంతటివారైనా విధికి తలవంచాలి, తప్పదు’ అని పుట్టెడు దుఃఖంతో ఉండీ ఈయన నాకు ధైర్యం చెప్పారు. ఏ ఇల్లాలైనా భర్త నుంచి ధైర్యం, నమ్మకం, గౌరవం కోరుకుంటుంది. అవన్నీ ఈయన నుంచి అందుకున్న నేను అదృష్టవంతురాలిని. 

వివాహం ఇద్దరు వ్యక్తులనే కాదు, రెండు కుటుంబాలను కలిపే బంధం. కుటుంబం చుట్టూ, బాధ్యతల చుట్టూ అల్లుకుపోయే అనుబంధం. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆ బంధం శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై ఎందరికో నీడనిస్తుంది. ఆ చల్లదనం అందించే హాయిని ఇప్పుడు ఎన్నో జంటలు ఆస్వాదిస్తున్నాయి. కష్టసుఖాలను సమంగా పంచుకోమని ఈ దంపతులు చెప్పే నాలుగు మంచి మాటలు ఎన్నో జంటలకు సరైన దారిని చూపుతున్నాయి. 

బాధ్యతతో కూడిన ప్రేమ ఇల్లాలిది. ఆ ప్రేమ మా లక్ష్మిలో చూశాను.
- పువ్వాడ నాగేశ్వరరావు

ఏ ఇల్లాలైనా భర్త నుంచి ధైర్యం, నమ్మకం, గౌరవం కోరుకుంటుంది. అవన్నీ ఈయన నుంచి అందుకున్న నేను అదృష్టవంతురాలిని.
- విజయలక్ష్మి

No comments: