Saturday, February 16, 2013

మూడు తరాల 'చిత్రం'!


తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తన కుమారుడు నాగ చైతన్యలతో కలిసి నటించనున్నట్టు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు కలిసి వెండి తెర పంచుకోనున్నారని వస్తున్న ఊహాగానాలకు నాగ్ తెర దించారు. తాము కలిసి నటించే సినిమా ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ జ్యుయెలర్స్ దుకాణాన్ని విశాఖపట్టణంలో శనివారంనాడు-ఫిబ్రవరి 16న- నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ- అభిమానుల అభిలాష మేరకు తన తండ్రి, కొడుకు కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. 

అక్కినేని త్రయం కలిసి నటించే సినిమా మూడు తరాల 'చిత్రం' అవుతుంది. మొదటి తరానికి చెందిన నాగేశ్వరరావు, రెండో తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నాగార్జున, మూడో తరానికి చెందిన చైతన్య సిల్వర్ స్క్రీన్ పై మెరిస్తే ఇక అక్కినేని అభిమానులకు పండుగే. మూడు తరాలు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిన ఘనత కూడా అక్కినేని కుటుంబానికే చెందుతుంది. ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న మల్టీ స్టారర్ ట్రెండ్ తర్వాత మూడు తరాల దిశగా సాగేందుకు అడుగులు పడుతున్నాయనడానికి అక్కినేని త్రయం సినిమానే ఉదాహరణ. అయితే మూడు తరాలు హీరోలున్న ఫ్యామిలీలు చాలా తక్కువగా ఉండడంతో ఇటువంటి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయనడంలో సందేహం లేదు. 

తెలుగు చిత్రసీమలో 'కుటుంబ' సినిమాలు కొత్తేంకాదు. గతంలో చాలా మంది హీరోలు తమ కొడుకులు, అన్నలు, తమ్ముళ్లు, మనవలు, మనవరాళ్లతో కలిసి సినిమాల్లో కనిపించిన సందర్భాలున్నాయి. పెద్ద ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ, బాలకృష్ణతో నటించారు. సూపర్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి పలు చిత్రాల్లో ఫ్యాన్స్ కు వినోదం పంచారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా తన కుమారుడు నాగార్జున తో నటించారు. చిరంజీవి తన సోదరుడు నాగబాబుతో చాలా సినిమాల్లో సందడి చేశారు. అయితే పూర్తిస్థాయి మూడు తరాల సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పొచ్చు. ఆ లోటును అక్కినేని వంశం తీర్చనుంది. 

కథ దొరికితే కలిసి నటించేందుకు మూడు తరాలు నటులు సిద్ధపడుతుండడంతో ఈ ట్రెండ్ భవిష్యత్ లో మరింత విస్తరించనుంది. తన తండ్రి బాబాయ్ తో కలిసి నటించేందుకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొణిదెల వంశంలో నటన చిరంజీవి నుంచి ప్రారంభమయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ను రెండో తరంగా పరిగణించాల్సివుంటుంది. అటు ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రానా కూడా తాత, బాబాయ్ తో సినిమా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 

ఇక టాలీవుడ్ లో కుటుంబ చిత్రాలకైతే కొదవే లేదు. ఇప్పుడున్న యువ హీరోలు తమ వంశంలో స్టార్ డమ్ వున్న తమ ముందువారితో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చాలా మంది ఇప్పటికే నటించారు. కృష్ణంరాజు-ప్రభాస్, నాగార్జున-సుమంత్, మోహన్ బాబు- విష్ణు-మనోజ్ కాంబినేషన్లు ఈ కోవకు చెందినవే. అయితే మూడు తరాల 'చిత్రం' అభిమానులకు ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదనడంలో అతిశయోక్తి లేదెమో!

No comments: