Monday, February 4, 2013

పసిపిల్లల కేన్సర్లను పసిగట్టడమే ముఖ్యం

కేన్సర్ అంటే అదేదో పెద్దవారిలో వచ్చే వ్యాధిగానే చాలా మంది భావిస్తారు. కానీ, అరుదుగానే అయినా పసిపిల్లలూ కేన్సర్ బారిన పడుతారు. పెద్దవారైతే ఆ కేన్సర్ తాలూకు బాధల్ని వెంటనే చెప్పగలుగుతారు. పిల్లల్లో ఆ శక్తి లేకపోవడం వల్ల సమస్య బాగా ముదిరిపోయే వరకు బయటపడే అవకాశం ఉండదు. తల్లిదండ్రులే ఆ సమస్యను గుర్తించాలంటే వారికి ఆ వ్యాధి లక్షణాల గురించి తెలియాలి. లక్షణాలను గుర్తించి వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే సకాలంలో సరియైన చికిత్సలు ఇప్పించి తమ పిల్లల ప్రాణాలను రక్షించుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు కేన్సర్ నిపుణులు డాక్టర్ సిహెచ్ మోహన వంశీ. 

చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లు పెద్ద వాళ్లల్లో వచ్చే కేన్సర్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. పెద్ద వాళ్లల్లో కేన్సర్‌రావడానికి వాతావరణం, ఇతర పరిస్థితులు, జీవన శైలి లోపాలు,అలవాట్లు జన్యుపరమైన మూలాలు ఇవన్నీ కారణాలైతే, చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో అత్యధిక భాగం, జన్యుపరమైన అంశాలు, డిఎన్ఏ మార్పులే ప్రధాన కారణంగా ఉంటాయి. నిజానికి, కేన్సర్ చికిత్సలకు పెద్దవాళ్లకన్నా చిన్నపిల్లల శరీరాలే బాగా స్పందిస్తాయి. శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా ఉన్నా వాటినుంచి బయటపడే సామర్థ్యం వారిలో ఎక్కువగా ఉంటుంది. వైద్య చికిత్సలకు ప్రత్యేకించి కీమోథెరపీకి పెద్ద వాళ్ల కన్నా చిన్నపిల్లలే బాగా తట్టుకుంటారు. లేత వయసే అయినా వారి శరీర కణజాలానికి ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది.

సాధారణ లక్షణాలు
అన్ని కేన్సర్లలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఏ భాగంలోనైనా ఒక కణితి ఏర్పడటం లేదా వాపు రావడం, శరీరమంతా పాలిపోయినట్లు అనిపించడం, ఏ చిన్న దెబ్బ తగిలినా ఎర్రబారి బాగా కమిలిపోవడం ప్రధానంగా కనిపిస్తాయి. కొంతమంది పిల్లల్లో శరీరంలోని ఏదో ఒక భాగంలో నొప్పి రావడ ం, నడుస్తున్నప్పుడు నొప్పి అనిపించడం, పరుగెత్తలేకపోవడం లేదా కుంటుతూ నడవడం, ఒక మోస్తరు జ్వరం, ఆకలి త గ్గిపోవడం, బలహీనంగా మారడం, హఠాత్తుగా దృష్టిలోపాలు ఏర్పడటం, హఠాత్తుగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కచ్ఛితంగా కేన్సర్ లక్షణాలే అని కాదు. కాకపోతే, ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయకూడదు.

లుకేమియా
చిన్నపిల్లల్లో కనిపించే కేన్సర్లలో 34 శాతం లుకేమియా కేన్సర్లే ఉంటాయి. ఇది తెల్లరక్తకణాల్లో వచ్చే కేన్సర్. తెల్లరక్తకణాలు మైలార్డ్ అనీ, లింఫాటిక్ అనీ రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండింటిలో వేటిలోనయినా లుకేమియా కేన్సర్ రావచ్చు. తెల్లరక్తకణాల సంఖ్య పెరగడమే ఇక్కడ సమస్య. ఈ కేన్సర్‌లో ఎముకలు, కీళ్ళల్లో నొప్పి ఉంటుంది. బాగా నీరసం ఉంటుంది. శక్తిహీనత, రక్తస్రావం, అతిచిన్నదెబ్బకే శరీరం కందిపోవడం, తరుచూ ఇన్‌ఫెక్షన్లు రావడం ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. అయినా ఈ కేన్సర్ కీమో థెరపీతో బాగా అదుపులోకి వస్తుంది. కాకపోతే ఈ థెరపీని ఎక్కువ రోజులే తీసుకోవలసి ఉంటుంది. ఈ థెరపీని కూడా పిల్లలు బాగానే త ట్టుకుంటారు. పిల్లల్లో వచ్చే ఈ కేన్సర్లు 70 శాతంమందిలో పూర్తిగా నయమవుతాయి. ఇదే కేన్సర్ పెద్దవాళ్లలో వస్తే ఇంత శాతం ఉండకపోవచ్చు.

కేంద్రనాడీ వ్యవస్థలో వచ్చే కణుతులు
ఈ కణుతులు మెదడులో రావచ్చు లేదా వెన్నుపాములో రావచ్చు. ఈ కణుతులు పెద్దవారిలో అయితే, మెదడు ఉపరిభాగం (సెరెబ్రెల్)లో వస్తాయి. చిన్నపిల్లల్లో అయితే, మెదడు కింది భాగం (బ్రెయిన్ స్టెమ్) లో వస్తాయి. చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో నాలుగోవంతు ఈ మెదడు కేన్సర్లే ఉంటాయి. ఈ కేన్సర్లలో తలనొప్పి, వికారం, వాంతులు, అస్పష్టమైన చూపు, లేదా ఒక వస్తువు రెండుగా కనిపించడం, మగతగా ఉండడం, తూగిపడటం లేదా బేలన్స్ లేకపోవడం, కణితి ఉన్న భాగాన్ని బట్టి, కీమోథెరపీ గానీ, రేడియో థెరపీ గానీ, లేదా సర్జరీ గానీ, ఇవ్వాల్సిరావచ్చు.

న్యూరోబ్లాస్టోమా
చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో 7 శాతం ఇవే ఉంటాయి. ఈ కేన్సర్లు నాడీకణజాలంలో వస్తాయి. 5 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలోనే ఈ కేన్సర్లు ఎక్కువగా వస్తాయి. పదేళ్లుదాటిన వారిలో ఇవి రావడం చాలా అరుదు. ఇవి శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ ఎక్కువ మంది పిల్లల్లో ఇవి పొట్టలోనే వస్తాయి. కడుపు ఉబ్బరం, వాపు, నొప్పి రావచ్చు, ఎముకల్లో నొప్పి, జ్వరం, బరువు తగ్గడం, పొట్ట పెరిగి శరీరమంతా సన్నబడటం ఇవి ఈ కేన్సర్ లక్షణాలు. ఒక మోస్తరు జ్వరం రావడం కూడా ఈ వ్యా«ధి లక్షణాల్లో ఒకటి. ఈ వ్యాధికి సర్జరీగానీ, కీమోథెరపీ గానీ, అవసరం కావచ్చు. చాలా సార్లు ఈ రెండూ అవసరమవుతాయి. కేన్సర్‌ను గుర్తించడంలో ఆలస్యమైనప్పుడు ముందు కీమోథెరపీ ఇచ్చి ఆ తరువాత సర్జరీ చేయవలసి ఉంటుంది.

విల్మ్స్ ట్యూమర్
ఇవి కిడ్నీల్లో వచ్చే కేన్సర్లు. చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో 5 శాతం ఇవే ఉంటాయి. ఇవి మూడు నుంచి నాలుగేళ్ల లోపు పిల్లలోనే వస్తాయి. 5 ఏళ్లు దాటిన వారిలో ఇవి రావడం చాలా అరుదు. ఈ కేన్సర్లలో పొట్టలో వాపు రావడం, నొప్పి కొద్దిపాటి జ్వరం, వికారం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఈ కేన్సర్‌కు సర్జరీయే ప్రధాన చికిత్స. కణితిని గుర్తించడంలో ఆలస్యమై, అప్పటికే అది బాగా పెరిగిపోయి ఉంటే, ముందు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా కణితిని కుంచింపచేసి, ఆ తరువాత సర్జరీ చేయవలసి ఉంటుంది. అవసరమైతే ఆ భాగంలో రేడియేషన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.

లింఫోమా
లింఫ్ గ్రంధుల్లో వచ్చే కేన్సర్లను లింఫోమా అంటారు. చాలా సార్లు ఈ కేన్సర్లు ఎముక మజ్జకు కూడా పాకుతూ ఉంటాయి. ఈ కేన్సర్‌లో కొద్దిపాటి జ్వరం, బరువు తగ్గడం, ఎక్కువగా చెమట రావడం, శరీరం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లింఫ్ గ్రంధులు రెండు రకాలు. అందులో ఒకటి హాచ్‌కిన్స్ లింఫోమా రెండవది నాన్‌హాచ్‌కిన్స్ లింఫోమా. హాచ్‌కిన్స్ లింఫోమా ఎక్కువగా 15 నుంచి 20 ఏళ్లలోపు వారిలో కనిపిస్తుంది. వీటిలో అత్యధిక శాతంపూర్తిగా నయమైపోయే కేన్సర్లు. ఇక నాన్‌హాచ్‌కిన్స్ లింఫోమాలు 5 ఏళ్లలోపు పిల్లల్లోనే ఎక్కువగా కనిస్తాయి. ఈ కేన్సర్ తీవ్రత కాస్త ఎక్కువే అయినా, కీమోథెరపీతో అదుపులోకి వస్తుంది. ముక్కపరీక్ష చేసి, కేన్సర్ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకుని కీమోథెరపీ ఇవ్వవలసి ఉంటుంది.

ర్యాబ్డోమయో సార్కోమా
ఇది కండరాల్లో వచ్చే కేన్సర్. కండరాల్లో వాపు, నొప్పి రావడం. కండరాలు బలహీనమైపోవడం ఈ కేన్సర్‌లోని ప్రధాన లక్షణం. ఇవి కీమోథెరపీకి బాగా స్పందిస్తాయి. కొన్నిసార్లు రేడియేషన్, సర్జరీ కూడా అవసరం కావచ్చు.

రెటినోబ్లాస్టోమా
ఇవి కంట్లో (కనుపాప)వచ్చే కేన్సర్లు. చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో ఇవి 3 శాతం కనిపిస్తాయి. సాధారణంగా 18 మాసాల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లల్లో కనిపిస్తాయి. 6 ఏళ్లు దాటిన పిల్లల్లో ఇది పెద్దగా కనపడదు. ఈ కేన్సర్ సోకిన వారిలో కనుపాపలు నల్లగా కాకుండా మెరుస్తూ, పిల్లిక ళ్లలా కనిపిస్తాయి. మనం నేరుగా గుర్తించకపోయినా ఫోటోగ్రాఫ్‌లో ఆ కన్ను తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది. కనురెప్పల్లో వాపు కనిపిస్తుంది. కొందరిలో కనుగుడ్లు బయటికి ఉబ్బవచ్చు. ఈ కేన్సర్లకు కీమోథెరపీ, సర్జరీ అవసరమవుతాయి.

బోన్ కేన్సర్
ఎముకల్లో వచ్చే ఈ కేన్సర్లు బాల్యం నుంచి టీనేజ్‌దాకా ఎప్పుడైనా రావచ్చు అయితే ఇవి పెరగడం అన్నది ఏ వయసులోనైనా జరగవచ్చు. కొన్ని దఫాలుగా కీమో థెరపీ ఇచ్చి ఆ తరువాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సర్జరీగా అనువుగా లేకపోతే, రేడియేషన్ ఇవ్వవలసి ఉంటుంది. కాకపోతే ఈ చికిత్స ఎక్కువ రోజులే తీసుకోవలసి ఉంటుంది.

సర్వైవల్ రేట్
లుకేమియా కేన్సర్‌లో 80 శాతం దాకా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. బ్రెయిన్ ట్యూమర్లయితే 70 శాతం మందికి వ్యాధి నయమవుతుంది. హాచ్‌కిన్స్ లింఫోమాలో అన్నిటికన్నా ఎక్కువగా అంటే 95 శాతం మందికి పూర్తిగా నయమవుతుంది. విల్మ్స్ ట్యూమర్స్ 80 శాతం దాకా నమవుతుంది. మొత్తంగా చూస్తే సగటున చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో 70 శాతం పూర్తిగా నయమవుతాయి. అయితే పిల్లలకు చికిత్స విషయంలో వివిధ శాఖలకు చెందిన డాక్టర్ల టీమ్ అవసరం అవుతుంది. పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఒక సైకాలజిస్టు కూడా అవసరం.

కొన్ని ప్రతికూల ప్రభావాలు
రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చిన పిల్లల్లో కొత్త విషయాలు నేర్చుకోవడంలో వెనుకబాటుతనం, ఐక్యూ తగ్గిపోవడం, చేతికీ కంటికీ మధ్య సమన్వయం లేకపోవడం, జ్ఞాపక శకి తగ్గిపోవడ ం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో సహజంగా పలురకాల హార్మోన్లు ఉత్పన్నం అవుతాయి. రే డియేషన్ తరువాత ఈ హర్మోన్ వ్యవస్థ కొంత మేరకు దుష్ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే పిల్లల ఎదుగుదల కూడా కుంటుపడవచ్చు. రెటీనా బ్లాస్టోమా కారణంగా కంటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు కొందరిలో దృష్టిలోపాలు ఏర్పడవచ్చు. 

కీమో థెరపీతోనూ మసకగా కనపించడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మెదడుకు ఇచ్చే రేడియేషన్ వల్ల పిల్లలకు వినికిడి లోపాలు కూడా ఏర్పడవచ్చు. పెరుగుదల కుంటుపడిపోవడం, ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడం, ఎముకల పెరుగుద ల కుంటుపడిపోవడం వంటివి కూడా ఉంటాయి. ఆ ప్రభావాలను గమనించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే, ఆ దుష్ప్రభావాలను కొంత మేరకు తగ్గించే అవకాశం ఉంటుంది. కేన్సర్ ట్రీట్‌మెంట్స్ జరిగింది అతి చిన్న వయసులోనే కాబట్టి వారి ముందు ఇంకా ఒక సుదీర్ఘమైన జీవిత కాలం ఉందని కదా! అందుకే ఈ కాలంలోనే కొంత మంది పిల్లల్లో రెండవసారి కేన్సర్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందుకే దుష్ప్రభావాల కారణంగా పిల్లల్లో వచ్చే మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం చాలా అవసరం. ఏవైనా ప్రతికూల మార్పులు కనిపించినప్పుడు వెంటనే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

No comments: