Monday, February 11, 2013

Gummadi Narsaiah Open Heart


రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
పేదలకోసం పాటుపడాలనే లక్ష్యంతో న్యూడెమోక్రసీలో చేరా ను. 1981లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాను. 83లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాను. తర్వాత 1994లో మినహా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మా ప్రాంతంలాగే.. మాది బాగా వెనుకబడ్డ కుటుంబం. నా నివాసం ఖమ్మం జిల్లా టేకులగూడెం. నాకు వారసత్వంగా వచ్చింది రెండెకరాల పొలం మాత్రమే. 

మరి అప్పట్లో చురుగ్గా ఉన్న పీపుల్స్‌వార్‌లో ఎందుకు చేరలేదు?
అప్పటికి పీపుల్స్‌వార్ ఇంకా యుద్ధపంథాలోనే ఉంది. న్యూడెమోక్రసీ మాత్రం అడవుల్లోంచి బయటకు వచ్చి, చట్టబద్ధం గా పోరాటం ప్రారంభించింది. రాజ్య వ్యవస్థతో పోరాడడం అయ్యేపనేనా? అనే ఆలోచనతో పాటు.. పోరాట సంస్థలకు మద్దతు ఉంటుందని న్యూడెమోక్రసీలో చేరాను. 

ఏ కార్యక్రమానికి వెళ్లాలన్నా పార్టీ అనుమతి కావాల్సిందేనా?
పార్టీలో క్రమశిక్షణతో పాటు స్వీయ కట్టుబాట్లు కూడా ఉంటా యి. ఏదైనా సమావేశానికి వెళ్లినా.. పార్టీ అనుమతి తీసుకోవాలి. ఆ కార్యక్రమంలో ఎలా ఉండాలనేదానిపైనా పార్టీ నియంత్రణలు ఉంటాయి. పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా నష్టం జరుగకూడదనే ఈ విధానం. అలా ఉండడం వల్లే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నెగ్గుకు రాగలుగుతున్నాం. ఇతరులకు మాకు మధ్య తేడాను జనం గుర్తించగలుతున్నారు. 

ఎంత పట్టున్నా.. మధ్యలో ఓటమి పాలయ్యారు కారణం?
రాజకీయంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో మాకు ఇమేజ్ ఉన్నప్పటికీ ఓడిపోయాం. కారణం డబ్బు, రాజకీయాలు. మమ్మల్ని ఓడించడానికి ఇతర పార్టీలు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ కూడా టీడీపీకి మద్దతిచ్చింది. ఒక సారి నియోజకవర్గాల పునర్విభజన కొంత దెబ్బతీసింది. 

మీకు ఎమ్మెల్యేగా వచ్చిన వేతనం, అలవెన్సులు పార్టీకే ఇచ్చారా?
నాకు ఎమ్మెల్యేగా వచ్చేదంతా.. ఇప్పుడు పెన్షన్‌తో సహా పార్టీకే ఇచ్చేస్తాం. నేను తిరగడానికి, మా ఇంటి ఖర్చులకు పార్టీ ఇస్తుంది. ఎక్కడికైనా వెళితే.. వాహనాల డీజిల్, తిండి ఖర్చులు సహా పార్టీకి లెక్కచెబుతాం. ఇంట్లో వ్యక్తిగత ఖర్చులకు వ్యవసాయమే దిక్కు. 

నిజాయితీకే మా మద్దతు!
ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధారం
బలవంతపు వసూళ్లు అవాస్తవం
పార్టీలన్నీ కలిసి ఓడించాయి
ఓ కబ్జాకు సంబంధించి పీజేఆర్ ఆఫర్ ఇచ్చాడు

మీకు ఎవరూ డబ్బు ఆఫర్ చేయలేదా?
ఒకసారి తన సస్పెన్షన్ గొడవకు సంబంధించి.. హౌజింగ్ బోర్డు ఏఈ డబ్బు తీసుకొచ్చాడు. ఇంట్లోకి వచ్చి కొద్దిసేపు మాట్లాడాడు. నాకు విషయం చెప్పకుండా అక్కడో కవరు పెట్టి, నా భార్యకు చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత అవి తీసుకెళ్లి ఇచ్చేసి.. మళ్లీ అలా చేయొద్దని హెచ్చరించి వచ్చాను. మరోసారి ఆయనే ప్రజల డబ్బు కాజేశాడు. దానిపై నేను ఫిర్యాదు చేస్తే.. సస్పెండయ్యా డు. కొద్ది రోజులకు యూనియన్ నేతలతో కలిసి వచ్చి.. రెండు లక్షలు ఇస్తా, ఫిర్యాదు వెనక్కితీసుకోవాలని కోరాడు. వాళ్లందరినీ తిట్టి పంపించాను. నిజాయితీగా ఉండడానికి నా భార్య మద్దతు ఎక్కువ. అక్రమంగా సంపాదించే డబ్బు మనకు వద్దని చెబుతుం ది. మా పిల్లలూ అక్రమాలను సహించరు. 

మీపై ఎప్పుడైనా ఒత్తిళ్లు వచ్చాయా?
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ కబ్జాకు సంబంధించి.. నేను అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తాను. అప్పుడు మంత్రిగా ఉన్న పి. జనార్దన రెడ్డి.. దానిని వెనక్కి తీసుకోవాలని కోరారు. అది తన పరిధిలోకి వస్తుందని, తాను చూసుకుంటానన్నారు. ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని ఆఫర్ చేశారు. నేను పట్టించుకోలేదు. చిత్రమేమిటంటే.. మరుసటిరోజు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రిని సభకు రాకుండా చేశారు. 

ఖమ్మంలో మీ పార్టీపై 'వసూళ్ల' ఆరోపణలేమిటి?
అలాంటి ఆరోపణలేవీ మా దృష్టికి రాలేదు. ఏడాదికోసారి కూలీలు, రైతుల నుంచి చందాలు మాత్రం తీసుకుంటాం. మా పార్టీకి విరాళం ఇవ్వాల్సిందిగా.. ఆ ప్రాంతంలో పనులు చేసే కాం ట్రాక్టర్లను అడుగుతుంటాం. అంతేగానీ బలవంతమేమీ ఉండదు. కానీ, వసూళ్ల ముద్రవేసి కాంట్రాక్టర్లు మా దగ్గర పనులను ఆపేశా రు. దానికి కారణం కొందరు మంత్రుల బెదిరింపులు.. వాళ్లకు సం బంధించిన వాళ్లకు పనులు దక్కాలని ఇలాంటి పని చేస్తున్నారు. 

మొదట్లో తెలంగాణను వ్యతిరేకించి ఇప్పుడు మద్దతిస్తున్నారేం?
మాకంటే ముందు మావోయిస్టు పార్టీ తెలంగాణ ఇవ్వాలని కోరింది. ఇప్పుడు జనశక్తికి జనం లేరు. మావోయిస్టులు బయటికి రాలేరు. అందువల్ల వారికి మద్దతుగా మా పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాం. మొదట్లో కూడా మేం తెలంగాణను వద్దనలేదు.

No comments: