Tuesday, February 5, 2013

IBS (Irritable bowel syndrome)

ఐబిఎస్ కడుపులో సుడిగుండం

పెద్దపేగుల్లో జరిగే ఒక అతి ప్రకోపం, ఒక అసహజమైన ప్రేరణలే ఐబిఎస్ వ్యాధికి మూలం. దాతువుల్లో విషపదార్థాలు పేరుకుపోవడం ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం. జీర్ణశక్తి తగ్గిపోవడం, పోషక పదార్థాల లోపాలు, నాడీవ్యవస్థ సమతుల్యత కోల్పోవడం, సహజ జీవన శైలికి విరుద్దంగా వెళ్లడం ఇతర కారణాలు. వీటన్నిటినీ మించి శరీరంలో ఓజస్సు (ఇమ్యూనిటీ) తగ్గిపోవడం ఒక కీలక కారణమవుతుంది. ఇది ప్రాణాలేమీ హరించదు. 

కానీ, జీవితాన్ని నరకతుల్యం చేస్తుంది. మౌలికంగా, శరీర వ్యవస్థలో జరిగే కొన్ని లోపాలు, ఉత్పన్నమయ్యే రసాయనాల వ్యత్యాసాలు కారణంగా ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణమే. జీర్ణాశయ సమస్యల్లో ఎక్కువ మందిని వేధించేది ఈ సమస్యే. పురుషుల కన్నా మూడు రెట్లు అధికంగా స్త్రీలు ఈ వ్యాధి బారిన పడతారు. మొత్తంగా చూస్తే మనదేశంలో 20 శాతం మంది ఈ వ్యాధితో సతమతమవుతున్నారు.

ఎవరిలో ఎక్కువ
తరుచూ ప్రయాణాలు చేసేవారు, విరామం లేకుండా ఎక్కువ గంటలు పనిచేసేవారు, భోజన వేళలు పాటించని వారు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్ తినేవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. అలాగే జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లకు గురైన వారు ఆ వెంటనే ఐబిఎస్‌కు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. ఈ సమస్యకు మానసిక కారణాలు కూడా ఎక్కువే. జీర్ణాశయం అన్నది మనిషి భావోద్వేగాలు ప్రతిధ్వనించే వేదిక. భావోద్వేగాల తీరును బట్టే పేగుల కదలికలు ఉంటాయి. ప్రతికూల కదలికలు ఉంటే వాటి ప్రభావం నోటినుంచి విసర్జక భాగం దాకా కనపడుతూనే ఉంటాయి.

ఎలా తెలుస్తుంది?
ఐబిఎస్‌లో ప్రధానంగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్దకం, విరేచనం ఈ నాలుగు లక్షణాలూ కనిపిస్తాయి. మలబద్దకం, విరేచనం అనేది ఒకదాని తరువాత ఒకటిగా వేధిస్తూ ఉంటాయి. ఒక రోజు మలబద్దకంగానూ ఒకరోజు విరేచనాలు కావడం ఇలా అసహనాన్ని నింపుతాయి. వీటివల్ల రోజువారి కార్యక్రమాలన్నీ అస్తవ్యస్తం అవుతాయి. ఈ అస్తవ్యస్తత ముందు వ్యాధిగా మారుతుంది. ఆ వ్యాధి పలు సమస్యల సిండ్రోమ్‌గా మారుతుంది.

ఈ నాలుగు లక్షణాల్లో ఏదో ఒకటిగా దాదాపు అందరిలోనూ ఉంటాయి. కానీ, ఈ నాలుగూ కలగలిసి వేధించడమే ఈ ఐబిఎస్ ప్రత్యేకత. ఈ నాలుగే కాకుండా ఐబిఎస్ ఉపలక్షణాలుగా తేన్పులు, తరుచూ అపాన వాయువు విడుదల కావడం, జిగురు విసర్జన, రుచి తెలియకపోవడం, ఛాతీలో మంటగా అనిపించడం, వికారం, వాంతి భావన కలగవచ్చు. స్త్రీలలో ఇది రుతుక్రమం దెబ్బతినేందుకు కూడా కారణం కావచ్చు. కొంతమంది స్త్రీలలో మూత్రం విసర్జనపైన అదుపు లేకుండా పోవచ్చు. మరికొంత మంది స్త్రీలలో శృంగార సమయంలో నొప్పిరావచ్చు. పార్శ్వపు తలనొప్పి రావడానికి ఐబిఎస్ ఒక కీలక కారణమవుతుంది.

వీటితో పాటు కండరాల నొప్పులు, నిద్రలేమి, వెన్ను, పొట్టకింది భాగాల్లో నొప్పి రావచ్చు. దీర్ఘకాలికంగా ఈ సమస్య కొనసాగే వారిలో దిగులు, ఆందోళన, ఆత్మన్యూనత, ఆత్మనింద, ఆసహనం,కోపం, భయం వంటి మానసిక అవస్థలు కూడా ఏర్పడవచ్చు. మొత్తంగా చూస్తే ఇది పెద్దపేగులకో, చిన్నపేగులకో పరిమితమయ్యే సమస్య ఎంతమాత్రమూ కాదు. ఇది హార్మోన్ వ్యవస్థను, నాడీవ్యవస్థను,అలా సమస్త శరీర వ్యవస్థనూ దెబ్బ తీస్తుంది. తిన్నదంతా విసర్జనలో వెళ్లిపోవడంతో ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఇమడక సప్తధావులూ క్షీణిస్తాయి. ఫలితంగా శరీరం చిక్కి శల్యమవుతుంది. ఈ క్రమంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి శరీరం రోగాల నిలయమవుతుంది.

పరిపూర్ణ చికిత్స
వాస్తవానికి జీర్ణవ్యవ స్థలో గ్రహణి అనే ఒక విభాగం ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేసి, పోషకాలను, వ్యర్థాలనూ విడదీసి, వ్యర్థాలను బయటికి పంపించే విభాగం. శరీరంలో అగ్ని సరిగా లేనప్పుడు ఈ ప్రక్రియలేవీ సరిగా జరగక «ధాతువుల్లో విషపదార్థాలు ఆమం పేరుకుపోతాయి. ఈ ఆమమే ఐబిఎస్ సమస్యకు అసలు కారణం. అందుకే ఆయుర్వేదం, విషమూలమైన ఆమాన్ని బయటికి పంపడం మీదే అమిత ంగా తన దృష్టిని నిలుపుతుంది.

అందుకు అవసరమైన అగ్నిని పెంచుతుంది. అగ్నిని పెంచితే సమస్త రోగాలూ సమసిపోతాయి. అగ్నిని పెంచడమే ప్రధాన లక్ష్యం అయినందువల్లే ఆయుర్వేదాన్ని ఆగ్నేయ చికిత్స అంటారు. అందులో భాగంగానే లంఘనం, ఆమహర చికిత్సలు చేస్తాం. ఆకలిని పెంచడానికి దీపన చికిత్సలు చేస్తాం. పంచకర్మ చికిత్సలు చేస్తాం. ఇవన్నీ అయ్యాక శరీరంలో పునరుత్తేజం నింపే మరికొన్ని చికిత్సలు చేస్తాం. ఇవన్నీ కలిసి ఐబిఎస్ సమస్యను సమూలంగా, శాశ్వతంగా తొలగించివేస్తాయి.

No comments: