Sunday, February 10, 2013

Jaggareddy Open Heart


మీ పేరు జగ్గారెడ్డిగా ఎలా మారింది?
మా నాన్న పేరు జగ్గారెడ్డి. నేను కూడా ఆయన స్టయిల్‌లోనే పనిచేయడం వల్ల నాన్న స్నేహితులు, మరికొందరు జగ్గారెడ్డి అని పిలిచేవారు. ఆ తర్వాత అదే ప్రచారంలోకి వచ్చింది. నా గడ్డం వేంకటేశ్వరస్వామి మొక్కు. ఐదేళ్లకోసారి తిరుమల వెళ్లి తీస్తాను. మధ్యలో తీయను. సంగారెడ్డి నుంచి కుటుంబసమేతంగా నడుచుకుంటూ తిరుమల వెళతాం. 

చాలా దుందుడుకుగా ఉంటారేం?
ఏదైనా ఉంటే నేను ఓపెన్‌గా మాట్లాడతాను. ఓటమిని అంత సులువుగా అంగీకరించను. అవసరమైతే పోట్లాడి అయినా సాధించుకుంటాను. ఒకవేళ నాది సాగదు అని తెలిసినప్పుడు అన్నీ వదిలేసి 'హరే రామ' అనుకుంటూ గుళ్లో కూర్చుంటా. ఒంటిమీద దెబ్బ పడితే.. జనానికి మొహం చూపించను. ఎన్నికల్లో ఓడితే.. మళ్లీ పోటీ చేయను. నా జోలికి ఎవరైనా వస్తే.. ఊరుకోను. నేనే కాదు.. ఈ విషయం తెలిస్తే గంటలోపు పదివేల మంది కార్యకర్తలు వచ్చేస్తారు. నా వేషం చూసి చెడ్డవాణ్నని మాత్రం అనుకోవద్దని జనానికి విజ్ఞప్తి చేస్తున్నా. 

మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఎలా వచ్చింది?
చిన్నప్పటి నుంచీ నా స్నేహితులు ఆర్ఎస్ఎస్‌లో ఉండేవారు. అప్పుడే ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఏర్పడింది. 1980లో ఏబీవీపీలో విద్యార్థి నేతగా ఎన్నికయ్యాను. ఆ తర్వాత బీజేపీ తరఫున మున్సిపల్ కౌన్సిలర్‌గా, చైర్మన్‌గా ఎన్నికయ్యాను. తర్వాత కేసీఆర్ పిలవడంతో టీఆర్ఎస్‌లో చేరాను. 

టీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఎందుకు?
టీడీపీలో రాజకీయ భవిష్యత్తు లేక కేసీఆర్ టీఆర్ఎస్‌ను స్థాపించారు. అదే సమయంలో.. బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో నేను టీఆర్ఎస్‌లోకి వచ్చాను. అప్పటి ఉద్దేశాలు వేరు. కేసీఆర్ పార్టీ పెట్టింది తెలంగాణ ప్రజల మీద ప్రేమతో కాదు.. నేను అందులో చేరిందీ ఉద్యమం కోసం కాదు. తర్వాత పరిస్థితి మారింది. వాళ్ల అభిప్రాయాలు, మా అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. దాంతో కుదరకే బయటకు వచ్చాను. ఇప్పుడు టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను వ్యతిరేకించడానికి కారణం అదే. 

వైఎస్ రాజశేఖరరెడ్డి వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు?
అప్పట్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ చాలా స్థానాల్లో పోటీ చేసింది. కానీ, వైఎస్ మాత్రం పోలీసులు, ఉద్యోగులను ఉపయోగించుకుని టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడా గెలవకుండా ప్లాన్ చేశారు. నా పరిధిలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల విషయంగా నాపై పోలీసులు ఒత్తిడి చేశారు. నేను వినలేదు. నా మొండితనం నచ్చి వైఎస్ నన్ను పిలిపించారు. అప్పటికే కేసీఆర్‌తో విసుగెత్తి ఉండడంతో.. అటువైపు వెళ్లాను. హరీశ్‌రావు కూడా వైఎస్‌ను కలిశారు. వైఎస్ బతికుంటే.. హరీశ్ ఎప్పుడో కాంగ్రెస్‌లోకి వచ్చేవారు. టీఆర్ఎస్ ఎప్పుడో ఖాళీ అయ్యేది. విజయశాంతి అయితే.. తెలంగాణ పేరుతో ఉద్యమంలోకి వచ్చి అన్ని ఆస్తులూ అమ్ముకున్నారు. కష్టపడి సంపాదించుకున్న ముఫ్ఫై, నలభై కోట్లు నష్టపోయారు. 

జగన్ పార్టీ వైపు ఎందుకు వెళ్లలేదు?
వైసీపీలో చేరాలని జగన్ నన్ను పిలిచారు. కానీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ.. పైగా అధికారంలో ఉంది. ప్రజలకు సేవచేయాలంటే అది కావాలి. అందుకే వెళ్లలేదు. 

భూముల దందాల ఆరోపణలపై?
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న కొందరు నా స్నేహితులు డబ్బు ఇస్తుంటారు. అవసరానికి కార్యకర్తలు కూడా ఇస్తుంటారు. ఈ డబ్బంతా కూడా తిరిగి నా కార్యకర్తలకు, ప్రజలకు పంచేస్తుంటాను. సుమారు వందకోట్లకు పైగా సహాయంగా పంచిపెట్టి ఉంటాను. అనారోగ్యంతో ఉన్నవారికి ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తా. భూ ఆక్రమణలు అవాస్తవం. కానీ, భూముల విషయంలో గొడవలు తలెత్తితే.. ఇద్దరికీ న్యాయం జరిగేలా పరిష్కరిస్తుంటాం. అంతేగాని తప్పు చేయను. ఏవో కొన్ని ఆరోపణలు వచ్చినంత మాత్రాన నేను చేసేది మార్చుకోను. అమీర్‌పూర్ అసైన్డ్ భూముల అంశం వివాదాస్పదం అయింది. దానివల్లే నాపై మచ్చపడింది. 

కాంగ్రెస్‌లోనే ఉంటారా?
ఇప్పటికే చాలా తిరిగి వచ్చాను. ఇప్పుడే కాంగ్రెస్‌ను వదలను. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కాంగ్రెస్‌కు పెద్దగా లాభం ఉండదు. హైదరాబాద్, రంగారెడ్డిల్లో బీజేపీ ప్రభావం పెరుగుతుంది. తెలంగాణ ఇస్తే.. పార్టీని వదిలేస్తా. ఈ విషయాన్ని అధిష్ఠానానికి కూడా చెప్పాను. 

సమైక్యవాదిగా ఎందుకు మారిపోయారు?
నేను మొదటి నుంచీ అభివృద్ధిపైనే దృష్టి పెట్టాను. కొట్లాడి నిధులు సాధించుకోవాలిగానీ, విడిపోవడం ఎందుకనేది నా అభిప్రాయం. అందులోనూ నా మెద క్ జిల్లా ప్రజల గురించి నేను మాట్లాడుతా. మంజీరాలో కి నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నది కర్ణాటక. దాని గురిం చి నాకు అవసరం. ఇదే జిల్లాకు చెందిన కేసీఆర్‌గానీ, ఆయన కుటుంబంగానీ ఈ విషయాన్ని పట్టించుకోరేం? ఉద్యమం నడిపిస్తూనే.. అభివృద్ధి పనులు చేయరాదా? ఆకలితో ఉంటే ఉద్యమాలు నడుస్తాయన్నదే వాళ్ల పాలసీ. 

తర్వాత మీ లక్ష్యం?
ఇంకో పది పదిహేనేళ్లు రాజకీయాల్లో ఉండి, ప్రజా సేవ చేసుకోవాలనేది కోరిక. ఆ తర్వాత దైవ సేవలో గడుపుతా. 

ఇలాగైతే తెలంగాణ సాధించలేరు!
నమ్ముకున్నోళ్లకు కేసీఆర్ ఏమీ చేయడు. చివరి క్షణంలో ఏం చేస్తాడో తెలియదు. సమాజానికి దూరంగా ఉండి రాజకీయ జీవితం గడిపే వ్యక్తి కేసీఆర్. 2004లో ఎన్నికలకు ముందు అంతర్గత సమావేశాల్లో రాష్ట్రం, విభజన, యూపీఏ అంటూ ఎన్నో చెప్పారు. కానీ, ఫలితాల తర్వాత చేసిందొకటి. కేసీఆర్ తన 'సెల్ఫ్ (సొంతవారి)'కే ప్రాధాన్యత ఇస్తారు. 

త్యాగం చేసే గుణం ఆయనలో లేదు. ఇంత భారీ ఉద్యమం వచ్చినా, సాధారణ ప్రజల నుంచి ఉద్యోగుల దాకా అందరూ కలిసివచ్చినా.. రాష్ట్రాన్ని సాధించుకోలేక పోవడానికి కారణం అదే. ఇలాగే ఉంటే.. ఎప్పటికీ సాధించలేరు. వ్యక్తిగతంగా కేసీఆర్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. అందుకే నేను ఎంతగా విమర్శించినా.. ఆయన ఖండించరు.

No comments: