Friday, February 8, 2013

థైరాయిడ్ సమతుల్యతతో చర్మంపై పొలుసుల సమస్య మాయం

మానవాళికి ప్రకృతి ప్రసాదించిన కవచకుండళం చర్మం. నేటి ఆధునిక ప్రపంచంలో చర్మసౌందర్యానికి చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రాముఖ్యతనివ్వడం మానసిక స్థైర్యానిపై దానికున్న ప్రభావానికి తార్కాణంగా నిలుస్తోంది. అలాగే ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, ఇతర ముఖ్య అవయవాలను కాపాడే చర్మం శరీరంలోనే అతి పెద్ద అవయవం కావడం గమనార్హం. అయితే ఈ చర్మసౌందర్యం, ఆరోగ్యం పెంపొందించడంలో థైరాయిడ్ గ్రంథి పాత్ర గురించి చాలా మందికి తెలియదు.

థైరాయిడ్ గ్రంథి జీవక్రియలకు అవసరమగు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ శరీర అవయవముల ఎదుగుదలకు, రక్తపోటు, గుండె పనితీరు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, శరీరకణాల జీవరసాయన క్రియలు, ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది. థైరాయిడ్, పిట్యూటరి గ్రంథి కలిసి యవ్వనంలో జరుగు జననేంద్రియాల ఎదుగుదల, హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతాయి. అలాగే చర్మంపై తేమశాతాన్ని క్రమబద్దీకరించడానికి థైరాయిడ్ హార్మోన్లు తోడ్పడతాయి. అయితే దీర్ఘకాలికంగా అసహజక్రియలు చోటుచేసుకున్నప్పుడు శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా వ్యాధులు వచ్చిపడతాయి. అయితే నియంత్రణ ప్రక్రియలో భాగంగా మొదట ప్రభావం పడే అవయవాలలో థైరాయిడ్ మరియు చర్మం ముఖ్యమైనవి చెప్పవచ్చు.

ముఖ్య లక్షణాలు
థైరాయిడ్ పనితీరు శరీర అవసరాలకు తగినంతగా లేనప్పుడు జీవక్రియలు తగ్గిపోయి చర్మం పొడిబారి జీవం లేనట్లుగా మారుతుంది. చెమట కూడా తగ్గుముఖం పట్టి అరిచేతులు, పాదాలు పొడిగా తయారయి చర్మం దళసరిగా పెచ్చులు కట్టినట్లుగా తయారవుతుంది. కొన్నిసార్లు చర్మం రంగు పసుపు వర్ణంలోకి మారటం విటమిన్-ఎ లోపానికి సంకేతంగా నిలుస్తుంది. జుట్టురాలడం, కనుబొమ్మలు పలుచబడటం, గోళ్లు పగిలి ఊడిపోవడం, జుట్టు పలచబడి జీవం కోల్పోవడం, వాపులు రావడం, దురద, గాయాలు త్వరగా మానకపోవడం జరుగుతుంటుంది.

అలాగే బరువు పెరగడం, నిరాశ, అలసత్వం, కండరాలు బిగుసుకుపోవడం, మలబద్ధకం, ముఖంలో మార్పు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు అవసరానికి మించి జరిగినపుడు అంటే టీ3, టీ 4 ఉత్పత్తి పెరిగినపుడు చర్మకణాలకు కావలసిన ప్రొటీన్లు, కొవ్వుకణాలు , కార్బోహైడ్రేట్లు అందకపోవడం వల్ల చర్మం కొన్ని ప్రదేశాలలో పలచబడటం జరుగుతుంది. మరికొన్ని ప్రదేశాలలో దళసరిగా కావడం, మచ్చలు, పొట్టురాలడం జరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టడం, కాళ్లవాపు, దద్దుర్లు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దుష్పరిణామాలు
చర్మంపై పొట్టు సమస్యలకు మూలం కనిపెట్టక చాలా మంది పైపూతలతో సరిపెట్టడం, తాత్కాలిక ఉపశమనంతో తృప్తిచెందడం చేయడం వల్ల సమస్య మరింత జటిలం కావచ్చు. పొట్టుతో కూడిన లక్షణాలకు దీర్ఘకాలంపాటు రకరకాల మందుల వాడినపుడు రోగనిరోధక కణాల కార్యాచరణ మారి శరీర కీళ్లపై దుశ్చర్య మొదలుపెట్టి ఆర్థరైటిస్‌కు దారితీయవచ్చు. థైరాయిడ్ అసమతుల్యత వల్ల ఒబేసిటి, డయాబెటిస్, గుండె సమస్యలు, స్పాండిలైటిస్ సమస్యలు రావచ్చు. స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ సమస్యలు ప్రారంభం కావచ్చు. సంతానలేమి సమస్య ఉత్పన్నం కావచ్చు.

సంకేతాలు
పొట్టు రాలడం, చర్మంలో పగుళ్లు ఏర్పడటంతోపాటు ఇన్ఫెక్లన్ల వల్ల వాటిపైన ద్రవం కారడం, చీము ఏర్పడటం జరగవచ్చు. తలలో చుండ్రులాంటి లక్షణాలు ప్రారంభమై పెచ్చులు కట్టడం, జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం జరుగుతుంది. పెద్దపెద్ద పొలుసులుగా చర్మంపై పగుళ్లు ఏర్పడటం, కొంతమందిలో చెవుల వెనుక, నుదుటిపై పొలుసులు మొదలవడం జరుగుతుంది.

నిర్ధారణ
చర్మలక్షణాలతో పాటు రోగి చెబుతున్న లక్షణాలను బట్టి సమస్య మూలాలను గుర్తించవచ్చు. స్కిన్ బయాప్సీ, ఐజీఈ, ఇస్నోఫిల్ కౌంట్, ఈఎస్ఆర్, సీబీపీ, స్కిన్ అలర్జీ టెస్ట్, హార్మోనల్ అనాలసిస్ వంటివి సమస్య ఉదృతిని తెలియజేస్తాయి. లివర్, కిడ్నీలపై భారాన్ని కనుగొనడానికి స్కానింగ్, సంబంధిత ఫంక్షన్ టెస్ట్‌లు చేయించాలి. థైరాయిడ్ అసమతుల్యతకు సంబంధించి టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్లోన్ల పరీక్ష, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కాన్ వంటివి అవసరం పడవచ్చు.

చికిత్స జాగ్రత్తలు : 
స్వభావ లక్షణాలు, చిన్నతనం నుంచి శరీరంలో జరుగుతున్న ముఖ్య మార్పులు, పర్యవసానాలు చర్మం స్వభావం అంటే తేమశాతం, పొడిగా లేదా జిడ్డుగా ఉండటం, పొక్కులు, పొట్టు స్వభావం పడిన అవయవాలు, ప్రదేశాలు చికిత్సలో కీలకం. ఈ వ్యాధికి తాత్కాలిక ఉపశమనాన్ని అందించే చికిత్స తీసుకోవడం కన్నా సరైన  వైద్యం తీసుకోవడం ఉత్తమం. సరైన చికిత్సతో  రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేయడం వల్ల తర్వాత ఎటువంటి పునరావృతాలు జరగవు. పైగా జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

No comments: