Thursday, February 14, 2013

My Mustaches will warn me.... Kanumuri Bapiraju


మీసాలు నన్ను హెచ్చరిస్తాయి
తప్పు చేయొద్దని జగన్‌కు చెప్పా
సోనియా వల్లే రెండు సార్లు టీటీడీ చైర్మన్ పదవి

పదవిని నా అవసరాలకు వాడుకోను
ఉద్యోగులను రోజూ హెచ్చరిస్తుంటా
ఇక నుంచి కఠిన చర్యలు చేపడతాం

పెద్ద మీసాలతో గంభీరంగా కనిపించే రాజకీయవేత్త కనుమూరి బాపిరాజు. తన మీసాల వెనుక కథ దగ్గరి నుంచి, టీటీడీని ప్రక్షాళన చేయాల్సి ఉందనేదాకా తన మనసులోని విషయాలను బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు నిర్మొహమాటంగా వెల్లడించారు. వారితో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమం విశేషాలు... 

మీ మీసాల వెనుక కథేంటి?
నాకు కాలేజీలో చదువుతున్నప్పటి నుంచీ మీసాలు పెద్దగా ఉండేవి. ఈ మీసాలను తల్లిదండ్రులుగా భావి స్తా. అవెప్పుడూ.. నువ్వు ఫలనా వ్యక్తివి, పార్టీవాడివి, ఫలానా ఊరివాడివి, ఫలానా వ్యక్తుల స్నేహితుడివి అంటూ హెచ్చరిస్తుంటాయి. అందువల్ల తప్పు చేయడానికి అవకాశం ఉండదు. 

ఇప్పటివరకు మీసాలు ఎన్ని సార్లు తీశారు?
హెచ్చెస్సీ పరీక్షలు రాశాక.. తిరుపతిలో గుండు తీయించుకున్నాను. మీసాలు తీయడం అదే మొదటి సా రి. మా నాన్న ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒకసారి తీశా ను. చిక్‌మంగళూరులో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు.. ఆమె ప్రధాని అయినప్పుడు... వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కావడం కోసం మొక్కుకుని, తీర్చుకున్నా. 

ఎక్సైజ్ మంత్రిగా వివాదం?
డిస్టిలరీలకు అనుమతి వివాదంలో నా తప్పేంలేదు. రామారావుగానీ, సీపీఐ, బీజేపీ వాళ్లుగానీ నేను అవినీతి కి పాల్పడ్డానని అనలేదు. బాధ్యత వహించాలనే డిమాం డ్ చేశారు. దాంతో నేనే రాజీనామా చేశా. చెన్నారెడ్డి హ యాంలో ఎక్సైజ్‌శాఖ ఇచ్చినా తీసుకోలేదు. కానీ విజయభాస్కర్‌రెడ్డి సీఎం అయ్యాక తప్పలేదు. 

రాజకీయాల్లో మీ ఆవిడ సహకారం?
స్థానికులకు ఏ సమస్య వచ్చినా అన్నపూర్ణమ్మ ముం దుంటుంది. నేను రాజకీయాల్లో బిజీగా ఉంటుండే వాడి ని. దాంతో ఎవరైనా రోగులకు సమస్య వస్తే.. ఆమే వారి ని స్వయంగా తీసుకెళ్లి వైద్యం చేయించేది. దీంతో ఆమెకు నియోజకర్గంలో పట్టు పెరిగింది. అన్నపూర్ణమ్మ: మేం చేసిన సహాయం వల్ల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఆత్మీయత కనిపిస్తుంది. టీటీడీ చైర్మన్ పదవి వచ్చాక స్వయంగా వెళ్లడం తగ్గిపోయింది. ఏదైనా ఉంటే ఫోన్ ద్వారా వీలైనంత సహాయం చేస్తున్నాం. 

రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
తొలుత 1978లో నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను. అప్పుడు మా నాన్న వచ్చి 'రాజకీయాలు పాడైపోయాయి. ప్రజలు అసహ్యించుకునే రోజులివి. నీ కు పదవి పిచ్చి పట్టిందేంట్రా' అని తిట్టారు. వినకపోవడంతో.. నా కాళ్లు పట్టుకున్నారు. కొందరు నాకు ఓటే స్తాం.. పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారని ఆయనకు వివరించాను. 'ఇరుక్కుపోయాను, ఎలాగూ గెలవను.. తిరిగి ఇంటికి వచ్చేస్తా. ఈ సారికి వదిలేయండి' అని బతిమాలడంతో.. వెళ్లిపోయారు. కానీ 46 ఓట్లతో గెలిచాను. అలా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రస్తుతం.. రాజకీయ వ్యవస్థే అవినీతిలో కూరుకుపోయింది. 

రెండు సార్లు టీటీడీ చైర్మన్ అవకాశమెలా వచ్చింది?
పదవి కోసం ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. అడగకుండానే సోనియా నాకు టీటీడీ చైర్మన్ అవకాశం ఇచ్చారు. నన్ను ఎంపిక చేయాలని సీఎం కిరణ్‌ను ఆదేశించారు. కిరణ్ దగ్గరికి వెళ్లినప్పుడు కూడా.. ఆ పదవికి ఏ బల మూ లేని నన్నెలా ఎంపిక చేశారని అడిగాను. టీటీడీ చైర్మన్ కావడానికి ప్రణబ్ సహకరించారనేది అవాస్తవం. 

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు విషయం?
అప్పుడు కేంద్ర మంత్రులు చిదంబరం, బన్సల్ తదితరులు కలిసి.. 'దేవుడి ప్రతినిధిగా బాపిరాజుతో యూపీఏ తరఫున మొదటి ఓటు వేయిద్దాం' అని నిర్ణయించారు. వీహెచ్ సహా వచ్చినోళ్లందరినీ ఆగాలని కోరి మరీ.. నాతో వేయించారు. అలాగే.. ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడూ తొలి ఓటు వేయించడానికి నన్ను పిలిచారు. అయితే.. ఈ సారి బెంగాల్ ఎంపీ ఒకరు నా కన్నా ముందే వచ్చారు. 'తిరుపతి బాలాజీ' తరఫున నాతో తొలిఓటు వేయిస్తామని వా రు చెప్పడంతో.. ఆ ఎంపీ కాస్త ఘాటెక్కారు. 'బెంగాల్ కాళీమాత తరఫున నేనే ముందు ఓటేస్తా' అని పట్టుబట్టా రు. వీహెచ్, మరికొందరు చెప్పినా ఆ ఎంపీ వినలేదు. 'ప్రపంచంలో అందమైన దేవత కాళీమాత. ఆమె ప్రతినిధిగా నేనే మొదటి ఓటేస్తా' అన్నారు. అంతలో బన్సల్ కల్పించుకుని.. 'సరే ఎవర్నీ బాధపెట్టడం మాకిష్టం లేదు. మీరే ఓటేయండి' అన్నాక ఆ ఎంపీ వెనక్కుతగ్గారు. 

టీటీడీ విషయంలో అన్నీ నాన్చుతారనే విమర్శలు?
ఇప్పటివరకు ఎప్పుడూ లేనన్ని నిర్ణయాలు నా ఆధ్వర్యంలో తీసుకున్నాం. ఉద్యోగుల సమస్యలను కూడా ప ట్టించుకోవాలి కదా. అందుకే ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చాను. టీటీడీ చైర్మన్‌గా నన్ను ఎంపిక చేయగానే.. నేనేదో చేస్తానని అందరూ ఆశపెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగా నేను వ్యవహరించక తప్పదు. నేనీ పదవిని వేరే పనుల కోసం ఉపయోగించుకోవడం లేదు. 

లడ్డూ నాణ్యత దారుణంగా ఉండడంపై?
అలాంటి వాటిని నియంత్రించడం కోసం లడ్డూలు తయారు చేసే ప్రదేశానికి స్వయంగా వెళ్లి పరిశీలించాను. నేను వచ్చిన మొదట్లో లడ్డూలు దొరకడం లేదన్నారు. ఆ కొరత తీర్చడంపై దృష్టి పెట్టాను. ఇటీవల నాణ్యతపైనా దృష్టిపెట్టాం. లడ్డూ తయారీ ప్రదేశం అత్యంత పరిశుభ్రంగా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాం. వెంట్రుకలు పడకుండా పనిచేసేవారికి తలకు ఆర్పాన్లు పెట్టాం. 

టీటీడీ సిబ్బందిలో అంకిత భావం తగ్గిపోతోందేం?
సిబ్బందిలో చాలా వరకు మర్యాదగా మాట్లాడటం అలవర్చుకున్నారు. "మనకు జీతం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎక్కడినుంచో వస్తున్న భక్తుల సొమ్మే తింటున్నాం. పైగా వాళ్లను బాధపెడుతుంటాం'' అని రోజూ హెచ్చరిస్తుంటా. తిరుమల నుంచి తిరిగి వెళ్లేవారు నవ్వు మొహంతో కనిపిస్తే.. మేం బాగా పనిచేసినట్లే. 

చర్యలు తీసుకోకుండా బతిమాలడం ఎందుకు?
అన్యమత ప్రచారంపై ప్రమాణం చేయించడం, బతిమాలి పనిచేయించుకోవడం వంటివి కొంతవరకు తప్పే. కానీ, ఇప్పటి నుంచి పద్ధతి మార్చాల్సిన అవసరం ఉం ది. కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధాన పూజారులు ప్రై వేటు వ్యక్తుల దగ్గరికి వెళ్లడం, వీఐపీలకు ఆశీర్వచనం ఇ వ్వడం వంటివి మార్చుకోవాల్సి ఉంది. టీటీడీలోని వ్యవహారాలన్నింటినీ పూర్తి నియంత్రణలోకి తీసుకువస్తాం. 

జగన్ పార్టీలోకి పిలుపు రాలేదా?
వైఎస్ మరణించాక జగన్ సీఎం కావాలని నేను కూడా కోరుకున్నా. ఆ తర్వాత కూడా పార్టీ వదలొద్దని చాలా సార్లు చెప్పాను. కొత్త పార్టీ ప్రస్తావన వచ్చినప్పు డు.. 'మీ నాన్న చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ను వ్వు తప్పు చేయొద్దు. తొందరపడొద్దు'' అని గట్టిగా చెప్పాను. కానీ... 'నా వల్ల కాదు. పార్టీ పెడుతున్నా. 2014లో మీరు నా పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేయాలి' అన్నాడు. కానీ, నేను తిరస్కరించా. 'ప్రాణం పోయినా పార్టీని వదిలిపెట్టేవాడిని కాను. ఒకవేళ నా నియోజకవర్గంలో నేను ఓడిపోయే పరిస్థితి వచ్చినా సరే.. నీ పార్టీ తరఫున నిలబడను'' అని చెప్పేశాను. 

మీ లక్ష్యం ఏమిటి?
శ్రీవారి సేవకన్నా కోరుకునేదేమీ లేదు. మనసు విప్పి మాట్లాడుకోలేని రోజులివి. ఈ కార్యక్రమం ద్వారా మనసులోని మాటలు చెప్పి హృదయంలోని భారాన్ని తగ్గించుకునే అవకాశం కల్పించారు, కృతజ్ఞతలు.

No comments: