Saturday, December 1, 2012

హెచ్‌ఐవి - జానకి......

జానకిలాంటి వాళ్లందరికీ ఎయిడ్స్ డే సందర్భంగా అభినందనలు

జబ్బు నుంచి విముక్తి పొందడం కన్నా
సమాజం నుంచి విముక్తి పొందడం కష్టం.
భయం, అనుమానం, అవమానం, నిషేధం... వంటి క్రూరమైన ఆయుధాలతో సమాజం కొందరిని బాధ పెడుతుంది.
నువ్వు అక్కర్లేదు పో అని తరిమికొడుతుంది.
ఎదరించి నిలవడం, పోరాడి జీవించడం చాలా కష్టం.
కాని- జానకి సాధించింది. తనను మొదట ఒక మనిషిగా, ఆ తర్వాత హెచ్‌ఐవి బాధితురాలిగా యధాతధంగా గుర్తించే స్థితికి చేరుకుంది. తనకూ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని నినదించింది. తనలాంటి వాళ్లకు అదే స్థాయిభరోసాను ఇచ్చే స్థాయికి ఎదిగింది.

జానకి వయసు 35 ఏళ్లు. హైదరాబాద్ వనస్థలిపురంలో తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం అక్కడి నుంచే హైదరాబాద్ లోని ఓ ఆర్గనైజేషన్‌కు చేరుకుంటుంది. అక్కడకు వచ్చిన హెచ్‌ఐవి బాధిత గుండెల్లో ధైర్యం నింపుతుంది. అన్నిం టి కంటే మించి వాళ్లకు నవ్వడం నేర్పుతుంది. నవ్వడం మర్చిపోయేంత భయంకరమైన నేరం వారేం చేశారని? అడిగితే- ‘‘ఎనిమిదేళ్ల కిందట నవ్వడం మానేశాను. హెచ్‌ఐవి సోకిందని తెలిసి నేడో రేపో చావు ఖాయం అనుకున్నాను. కాని, ఇవాళ ఎంతోమంది హెచ్‌ఐవి బాధిత కళ్లల్లో వెలుగులు నింపుతూ సంతృప్తిగా జీవిస్తున్నాను’’ అంది జానకి. ఆమె కథనం ఆమె మాటల్లో...

‘‘మా అమ్మనాన్నలకు నలుగురం ఆడపిల్లలం. ఒక మగపిల్లాడు. పద్దెనిమిదేళ్ల వయసులో మేనత్త కొడుకుతో పెళ్లయింది. ఆయన ముంబయ్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అక్కడ అత్తమామ, ఇద్దరు మరుదులున్న ఉమ్మడి కుటుంబంలో ఏడేళ్లపాటు సంసారం సజావుగా సాగిపోయింది. ఏ ఒడిదొడుకులు లేవనుకున్న ఇంట్లో ఓ రోజు మా ఆయన జబ్బు కలకలం రేపింది. జ్వరం తగ్గుతున్నట్టే ఉండేది. మళ్లీ వచ్చేది. మెడికల్ షాపుల నుంచి మందుబిళ్లలు తెచ్చి వేశాం. తగ్గలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగాం. వారు చెప్పిన మందులు వాడాం. వారం రోజుల్లోనే మనిషి బాగా నీరసించిపోయాడు. విపరీతమైన దగ్గు. దీంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించాం. అక్కడ పరీక్షించిన డాక్టర్లు మా అత్తమామలకు ఏం చెప్పారో తెలియదు. కాని, మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిన వారు ఆసుపత్రి వంక రావడమే మానేశారు. ఏం జబ్బు అని నర్సులను అడిగితే హెచ్‌ఐవి అన్నారు. ఆ జబ్బు ఏమిటో ఎందుకు వస్తుందో నాకు తెలియదు. డాక్టర్లు చూస్తున్నారు, మందులు వాడుతున్నాం, తగ్గిపోతుందిలే అనుకున్నాను. చంటిపిల్లాడికి మల్లే సపర్యలు చేశాను. కాని, మనిషి దక్కలేదు. పదిరోజులైనా కాకముందే... నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు.’’

వెంటాడిన తప్పు..

‘‘ఎనిమిది రోజులకే ఎనభై ఏళ్లకు సరిపడా నరకం అనుభవించాననిపించింది ఆ ఆసుపత్రిలో. మా అమ్మనాన్నలకు ఈ విషయం తెలిసి వచ్చారు. వారికీ ఈ జబ్బు గురించి ఏమీ తెలియదు. మా అత్తమామతో గొడవపెట్టుకున్నారు. మా అత్త- కొడుకే పోయాడు, కోడలు మాత్రం ఎందుకు అనడంతో పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని అమ్మనాన్నలతో కలిసి హైదరాబాద్ వచ్చేశాను. ఏడాది తర్వాత ఉన్నట్టుండి నాకూ దగ్గు, ఆయాసం, జ్వరం మొదలయ్యాయి. సాధారణంగా వచ్చే సమస్యలే కదా అనుకొని కొన్నాళ్లు ఇంటి జాగ్రత్తలే పాటించాను. కాని లాభం లేకపోయింది. ప్రైవైట్ డాక్టర్లను సంప్రదించాను. ఏడాది పాటు ఎవరేం చెప్పినా ఆ మందులన్నీ వేసుకున్నాను. కాని అవేవీ పనిచేయలేదు. బరువు ఇరవై కేజీలకు పైగా తగ్గిపోయాను. నా ఒంటిరంగు, జుట్టు రంగూ మారిపోయాయి.

ఓ డాక్టర్ సలహా మేరకు ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో చేరాను. అక్కడ టెస్టులు చేసి, హెచ్‌ఐవి పాజిటివ్ అని చెప్పారు. అప్పుడు నా వయసు 27. బరువు 27. సిడి4 కౌంట్ 27. (ఆరోగ్యంగా ఉన్నవారిలో సిడి4 కౌంట్ 500పైగా ఉంటుంది. హెచ్‌ఐవి ఉన్నవారి లో ఈ కౌంట్ 350 కన్నా తగ్గితే ప్రమాదమని వైద్యులు చెబుతారు) సిడి4అంటే ఏంటో, హెచ్‌ఐవి అంటే ఏంటో అది ఎందుకు వస్తుందో తెలియదు. కాని అనారోగ్య కారణంగా పడే బాధలను తట్టుకోలేక చచ్చిపోతానా... అనిపించేది. మా ఆయన వల్లే ఈ జబ్బు నాకు సంక్రమించిందని అప్పుడూ తెలియలేదు. చెస్ట్ ఆసుపత్రి డాక్టర్లు ఉస్మానియా హాస్పిటల్‌లోని ఎఆర్‌టి సెంటర్‌కి రాశారు. అక్కడ వాళ్లు ఈ జబ్బు గురించి కొంత చెప్పారు. కాని అంతా గందరగోళంగా, భయం భయంగా అనిపించింది. ఈ జబ్బు ఎంత భయంకరమైనదో మెల్ల మెల్లగా తెలిసొచ్చింది.’’

సైడ్ ఎఫెక్ట్స్...

‘‘డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకుంటే ఒక బాధ, వేసుకోకపోతే ఒక బాధలా అయ్యింది నా పరిస్థితి. చాలా పవర్ ఉన్న ట్యాబ్లెట్లు అవడం వల్ల కడుపులో అల్సర్లు వచ్చాయి. విపరీతమైన మంట. బాధను తట్టుకోలేక విలవిల్లాడుతూ అరుస్తుంటే మా అమ్మ ఇంటి బయటకు వెళ్లిపోయి ఏడుస్తూ కూర్చునేది. ఇదేమి జబ్బో అని నన్ను తాకడానికి కూడా భయపడేది. రాత్రుళ్లు ఇంట్లో ఎవరికీ నిద్రలే ఉండేవి కావు. నా కంచం, మంచం, గ్లాసు, సబ్బు... అన్నీ వేరయిపోయాయి. మా చెల్లెళ్ల పిల్లలను దగ్గరకే రానిచ్చేవారు కాదు. ఇంట్లో ఈ తేడా నన్ను మరింతగా కుంగదీసింది. ఇవి చాలదన్నట్టు ఆ మందుల ఎఫెక్ట్‌కి చూపులో తేడా వచ్చింది. ఎడమకన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. వీపు మీద పెద్ద కణతి ఏర్పడింది. ఇన్ని సమస్యలను తట్టుకుంటూ ఇంకా బతకడం అవసరమా అని ఏడ్వని రోజు లేదు.’’

బతుకుపై బరోసానిచ్చింది ఓ  సంస్త ...

‘‘మందుల ప్రభావానికి శరీరం అలవాటు పడటం మొదలుపెట్టింది. ఎ.ఆర్.టి సెంటర్ వాళ్లు ఇచ్చే సూచనలు పాటించాను. అక్కడే ఓ అనే ఎన్.జి.ఓ సంస్థ గురించి తెలిసింది. అక్కడ నాలాంటి వారికి ఎన్నో సహాయసహకారాలు అందిస్తున్నారిని తెలిపింది. నా సమస్య నేనే పరిష్కరించుకోవాలని బెరుకుబెరుగ్గానే ఆ  సంస్థ సభ్యులను కలిశాను. నాకొచ్చిన సమస్య చెప్పాను. ‘ఇక్కడ ఉన్నవారంతా హెచ్‌ఐవి బాధితులే. భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అన్నింటికన్నా కావల్సింది మనోధైర్యం’ అని చెప్పారు వాళ్లు. అక్కడికెళ్లినప్పుడు ఎంత భయపడ్డానో, వారిచ్చిన కౌన్సెలింగ్ వల్ల అంత ధైర్యం వచ్చింది. పర్వాలేదు ఉన్నన్నాళ్లూ ఆరోగ్యంగా బతకగలను అనే నమ్మకం వచ్చింది.

పోషకాలు గల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ఎయిడ్స్ మందులు వాడటం, రోజూ ఏదో రకంగా ఆ  సంస్థ సభ్యులను కలుసుకోవడం చేశాను. అలా తొందరగానే కోలుకోగలిగాను. నాలాంటి హెచ్‌ఐవి బాధితులకు కౌన్సెలింగ్ చేయాలనుకున్నాను. అదే విషయం  సంస్థ సభ్యులకు చెప్పి, వారి సహకారంతో కౌన్సెలింగ్ చేయగలిగే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఆ సాయం నాలో ఎనలేని సంతృప్తిని నింపుతోంది. పిల్లలులేని నేను ఓ పాపను పెంచుకుంటున్నాను. ఇప్పుడా పాపకు ఏడేళ్లు. ఆ పాప భవిష్యత్తులోనే నా ఆనందాన్ని వెతుక్కుంటున్నాను’’ అని ముగించారు జానకి.

చావే పరిష్కారం అనుకునే ఎంతో మంది హెచ్‌ఐవి బాధితులకు మరణం అంచుల దాకా వెళ్లొచ్చిన జానకి కథనం ఓ ఆదర్శం. హెచ్‌ఐవి సమస్యను అధిగమించడానికి ఎంతోమంది అమాయకులకు కావలసిన మనోధైర్యాన్ని ఇవ్వగలిగే స్థాయికి చేరుకున్న జానకిలాంటి వాళ్లందరికీ ఎయిడ్స్ డే సందర్భంగా అభినందనలు తెలుపుదాం.

హెచ్‌ఐవి బాధితులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. సంసారజీవితాన్ని సరైన జాగ్రత్తలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. నన్నూ పెళ్లి చేసుకోమని కొంతమంది సూచించారు. కాని పెళ్లి చేసుకో వాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే జీవితంలో నాకో దిశ కనిపించింది. గమ్యం ఏంటో అర్థమైంది. అందుకే నాలో ధైర్యాన్ని నింపిన  ఆర్గనైజేషన్‌లోనే కౌన్సెలర్‌గా చేరాను.
- జానకి

No comments: