Sunday, February 10, 2013

Jaggareddy Open Heart


మీ పేరు జగ్గారెడ్డిగా ఎలా మారింది?
మా నాన్న పేరు జగ్గారెడ్డి. నేను కూడా ఆయన స్టయిల్‌లోనే పనిచేయడం వల్ల నాన్న స్నేహితులు, మరికొందరు జగ్గారెడ్డి అని పిలిచేవారు. ఆ తర్వాత అదే ప్రచారంలోకి వచ్చింది. నా గడ్డం వేంకటేశ్వరస్వామి మొక్కు. ఐదేళ్లకోసారి తిరుమల వెళ్లి తీస్తాను. మధ్యలో తీయను. సంగారెడ్డి నుంచి కుటుంబసమేతంగా నడుచుకుంటూ తిరుమల వెళతాం. 

చాలా దుందుడుకుగా ఉంటారేం?
ఏదైనా ఉంటే నేను ఓపెన్‌గా మాట్లాడతాను. ఓటమిని అంత సులువుగా అంగీకరించను. అవసరమైతే పోట్లాడి అయినా సాధించుకుంటాను. ఒకవేళ నాది సాగదు అని తెలిసినప్పుడు అన్నీ వదిలేసి 'హరే రామ' అనుకుంటూ గుళ్లో కూర్చుంటా. ఒంటిమీద దెబ్బ పడితే.. జనానికి మొహం చూపించను. ఎన్నికల్లో ఓడితే.. మళ్లీ పోటీ చేయను. నా జోలికి ఎవరైనా వస్తే.. ఊరుకోను. నేనే కాదు.. ఈ విషయం తెలిస్తే గంటలోపు పదివేల మంది కార్యకర్తలు వచ్చేస్తారు. నా వేషం చూసి చెడ్డవాణ్నని మాత్రం అనుకోవద్దని జనానికి విజ్ఞప్తి చేస్తున్నా. 

మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఎలా వచ్చింది?
చిన్నప్పటి నుంచీ నా స్నేహితులు ఆర్ఎస్ఎస్‌లో ఉండేవారు. అప్పుడే ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఏర్పడింది. 1980లో ఏబీవీపీలో విద్యార్థి నేతగా ఎన్నికయ్యాను. ఆ తర్వాత బీజేపీ తరఫున మున్సిపల్ కౌన్సిలర్‌గా, చైర్మన్‌గా ఎన్నికయ్యాను. తర్వాత కేసీఆర్ పిలవడంతో టీఆర్ఎస్‌లో చేరాను. 

టీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఎందుకు?
టీడీపీలో రాజకీయ భవిష్యత్తు లేక కేసీఆర్ టీఆర్ఎస్‌ను స్థాపించారు. అదే సమయంలో.. బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో నేను టీఆర్ఎస్‌లోకి వచ్చాను. అప్పటి ఉద్దేశాలు వేరు. కేసీఆర్ పార్టీ పెట్టింది తెలంగాణ ప్రజల మీద ప్రేమతో కాదు.. నేను అందులో చేరిందీ ఉద్యమం కోసం కాదు. తర్వాత పరిస్థితి మారింది. వాళ్ల అభిప్రాయాలు, మా అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. దాంతో కుదరకే బయటకు వచ్చాను. ఇప్పుడు టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను వ్యతిరేకించడానికి కారణం అదే. 

వైఎస్ రాజశేఖరరెడ్డి వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు?
అప్పట్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ చాలా స్థానాల్లో పోటీ చేసింది. కానీ, వైఎస్ మాత్రం పోలీసులు, ఉద్యోగులను ఉపయోగించుకుని టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడా గెలవకుండా ప్లాన్ చేశారు. నా పరిధిలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల విషయంగా నాపై పోలీసులు ఒత్తిడి చేశారు. నేను వినలేదు. నా మొండితనం నచ్చి వైఎస్ నన్ను పిలిపించారు. అప్పటికే కేసీఆర్‌తో విసుగెత్తి ఉండడంతో.. అటువైపు వెళ్లాను. హరీశ్‌రావు కూడా వైఎస్‌ను కలిశారు. వైఎస్ బతికుంటే.. హరీశ్ ఎప్పుడో కాంగ్రెస్‌లోకి వచ్చేవారు. టీఆర్ఎస్ ఎప్పుడో ఖాళీ అయ్యేది. విజయశాంతి అయితే.. తెలంగాణ పేరుతో ఉద్యమంలోకి వచ్చి అన్ని ఆస్తులూ అమ్ముకున్నారు. కష్టపడి సంపాదించుకున్న ముఫ్ఫై, నలభై కోట్లు నష్టపోయారు. 

జగన్ పార్టీ వైపు ఎందుకు వెళ్లలేదు?
వైసీపీలో చేరాలని జగన్ నన్ను పిలిచారు. కానీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ.. పైగా అధికారంలో ఉంది. ప్రజలకు సేవచేయాలంటే అది కావాలి. అందుకే వెళ్లలేదు. 

భూముల దందాల ఆరోపణలపై?
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న కొందరు నా స్నేహితులు డబ్బు ఇస్తుంటారు. అవసరానికి కార్యకర్తలు కూడా ఇస్తుంటారు. ఈ డబ్బంతా కూడా తిరిగి నా కార్యకర్తలకు, ప్రజలకు పంచేస్తుంటాను. సుమారు వందకోట్లకు పైగా సహాయంగా పంచిపెట్టి ఉంటాను. అనారోగ్యంతో ఉన్నవారికి ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తా. భూ ఆక్రమణలు అవాస్తవం. కానీ, భూముల విషయంలో గొడవలు తలెత్తితే.. ఇద్దరికీ న్యాయం జరిగేలా పరిష్కరిస్తుంటాం. అంతేగాని తప్పు చేయను. ఏవో కొన్ని ఆరోపణలు వచ్చినంత మాత్రాన నేను చేసేది మార్చుకోను. అమీర్‌పూర్ అసైన్డ్ భూముల అంశం వివాదాస్పదం అయింది. దానివల్లే నాపై మచ్చపడింది. 

కాంగ్రెస్‌లోనే ఉంటారా?
ఇప్పటికే చాలా తిరిగి వచ్చాను. ఇప్పుడే కాంగ్రెస్‌ను వదలను. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కాంగ్రెస్‌కు పెద్దగా లాభం ఉండదు. హైదరాబాద్, రంగారెడ్డిల్లో బీజేపీ ప్రభావం పెరుగుతుంది. తెలంగాణ ఇస్తే.. పార్టీని వదిలేస్తా. ఈ విషయాన్ని అధిష్ఠానానికి కూడా చెప్పాను. 

సమైక్యవాదిగా ఎందుకు మారిపోయారు?
నేను మొదటి నుంచీ అభివృద్ధిపైనే దృష్టి పెట్టాను. కొట్లాడి నిధులు సాధించుకోవాలిగానీ, విడిపోవడం ఎందుకనేది నా అభిప్రాయం. అందులోనూ నా మెద క్ జిల్లా ప్రజల గురించి నేను మాట్లాడుతా. మంజీరాలో కి నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నది కర్ణాటక. దాని గురిం చి నాకు అవసరం. ఇదే జిల్లాకు చెందిన కేసీఆర్‌గానీ, ఆయన కుటుంబంగానీ ఈ విషయాన్ని పట్టించుకోరేం? ఉద్యమం నడిపిస్తూనే.. అభివృద్ధి పనులు చేయరాదా? ఆకలితో ఉంటే ఉద్యమాలు నడుస్తాయన్నదే వాళ్ల పాలసీ. 

తర్వాత మీ లక్ష్యం?
ఇంకో పది పదిహేనేళ్లు రాజకీయాల్లో ఉండి, ప్రజా సేవ చేసుకోవాలనేది కోరిక. ఆ తర్వాత దైవ సేవలో గడుపుతా. 

ఇలాగైతే తెలంగాణ సాధించలేరు!
నమ్ముకున్నోళ్లకు కేసీఆర్ ఏమీ చేయడు. చివరి క్షణంలో ఏం చేస్తాడో తెలియదు. సమాజానికి దూరంగా ఉండి రాజకీయ జీవితం గడిపే వ్యక్తి కేసీఆర్. 2004లో ఎన్నికలకు ముందు అంతర్గత సమావేశాల్లో రాష్ట్రం, విభజన, యూపీఏ అంటూ ఎన్నో చెప్పారు. కానీ, ఫలితాల తర్వాత చేసిందొకటి. కేసీఆర్ తన 'సెల్ఫ్ (సొంతవారి)'కే ప్రాధాన్యత ఇస్తారు. 

త్యాగం చేసే గుణం ఆయనలో లేదు. ఇంత భారీ ఉద్యమం వచ్చినా, సాధారణ ప్రజల నుంచి ఉద్యోగుల దాకా అందరూ కలిసివచ్చినా.. రాష్ట్రాన్ని సాధించుకోలేక పోవడానికి కారణం అదే. ఇలాగే ఉంటే.. ఎప్పటికీ సాధించలేరు. వ్యక్తిగతంగా కేసీఆర్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. అందుకే నేను ఎంతగా విమర్శించినా.. ఆయన ఖండించరు.

Friday, February 8, 2013

థైరాయిడ్ సమతుల్యతతో చర్మంపై పొలుసుల సమస్య మాయం

మానవాళికి ప్రకృతి ప్రసాదించిన కవచకుండళం చర్మం. నేటి ఆధునిక ప్రపంచంలో చర్మసౌందర్యానికి చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రాముఖ్యతనివ్వడం మానసిక స్థైర్యానిపై దానికున్న ప్రభావానికి తార్కాణంగా నిలుస్తోంది. అలాగే ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, ఇతర ముఖ్య అవయవాలను కాపాడే చర్మం శరీరంలోనే అతి పెద్ద అవయవం కావడం గమనార్హం. అయితే ఈ చర్మసౌందర్యం, ఆరోగ్యం పెంపొందించడంలో థైరాయిడ్ గ్రంథి పాత్ర గురించి చాలా మందికి తెలియదు.

థైరాయిడ్ గ్రంథి జీవక్రియలకు అవసరమగు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ శరీర అవయవముల ఎదుగుదలకు, రక్తపోటు, గుండె పనితీరు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, శరీరకణాల జీవరసాయన క్రియలు, ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది. థైరాయిడ్, పిట్యూటరి గ్రంథి కలిసి యవ్వనంలో జరుగు జననేంద్రియాల ఎదుగుదల, హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతాయి. అలాగే చర్మంపై తేమశాతాన్ని క్రమబద్దీకరించడానికి థైరాయిడ్ హార్మోన్లు తోడ్పడతాయి. అయితే దీర్ఘకాలికంగా అసహజక్రియలు చోటుచేసుకున్నప్పుడు శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా వ్యాధులు వచ్చిపడతాయి. అయితే నియంత్రణ ప్రక్రియలో భాగంగా మొదట ప్రభావం పడే అవయవాలలో థైరాయిడ్ మరియు చర్మం ముఖ్యమైనవి చెప్పవచ్చు.

ముఖ్య లక్షణాలు
థైరాయిడ్ పనితీరు శరీర అవసరాలకు తగినంతగా లేనప్పుడు జీవక్రియలు తగ్గిపోయి చర్మం పొడిబారి జీవం లేనట్లుగా మారుతుంది. చెమట కూడా తగ్గుముఖం పట్టి అరిచేతులు, పాదాలు పొడిగా తయారయి చర్మం దళసరిగా పెచ్చులు కట్టినట్లుగా తయారవుతుంది. కొన్నిసార్లు చర్మం రంగు పసుపు వర్ణంలోకి మారటం విటమిన్-ఎ లోపానికి సంకేతంగా నిలుస్తుంది. జుట్టురాలడం, కనుబొమ్మలు పలుచబడటం, గోళ్లు పగిలి ఊడిపోవడం, జుట్టు పలచబడి జీవం కోల్పోవడం, వాపులు రావడం, దురద, గాయాలు త్వరగా మానకపోవడం జరుగుతుంటుంది.

అలాగే బరువు పెరగడం, నిరాశ, అలసత్వం, కండరాలు బిగుసుకుపోవడం, మలబద్ధకం, ముఖంలో మార్పు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు అవసరానికి మించి జరిగినపుడు అంటే టీ3, టీ 4 ఉత్పత్తి పెరిగినపుడు చర్మకణాలకు కావలసిన ప్రొటీన్లు, కొవ్వుకణాలు , కార్బోహైడ్రేట్లు అందకపోవడం వల్ల చర్మం కొన్ని ప్రదేశాలలో పలచబడటం జరుగుతుంది. మరికొన్ని ప్రదేశాలలో దళసరిగా కావడం, మచ్చలు, పొట్టురాలడం జరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టడం, కాళ్లవాపు, దద్దుర్లు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దుష్పరిణామాలు
చర్మంపై పొట్టు సమస్యలకు మూలం కనిపెట్టక చాలా మంది పైపూతలతో సరిపెట్టడం, తాత్కాలిక ఉపశమనంతో తృప్తిచెందడం చేయడం వల్ల సమస్య మరింత జటిలం కావచ్చు. పొట్టుతో కూడిన లక్షణాలకు దీర్ఘకాలంపాటు రకరకాల మందుల వాడినపుడు రోగనిరోధక కణాల కార్యాచరణ మారి శరీర కీళ్లపై దుశ్చర్య మొదలుపెట్టి ఆర్థరైటిస్‌కు దారితీయవచ్చు. థైరాయిడ్ అసమతుల్యత వల్ల ఒబేసిటి, డయాబెటిస్, గుండె సమస్యలు, స్పాండిలైటిస్ సమస్యలు రావచ్చు. స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ సమస్యలు ప్రారంభం కావచ్చు. సంతానలేమి సమస్య ఉత్పన్నం కావచ్చు.

సంకేతాలు
పొట్టు రాలడం, చర్మంలో పగుళ్లు ఏర్పడటంతోపాటు ఇన్ఫెక్లన్ల వల్ల వాటిపైన ద్రవం కారడం, చీము ఏర్పడటం జరగవచ్చు. తలలో చుండ్రులాంటి లక్షణాలు ప్రారంభమై పెచ్చులు కట్టడం, జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం జరుగుతుంది. పెద్దపెద్ద పొలుసులుగా చర్మంపై పగుళ్లు ఏర్పడటం, కొంతమందిలో చెవుల వెనుక, నుదుటిపై పొలుసులు మొదలవడం జరుగుతుంది.

నిర్ధారణ
చర్మలక్షణాలతో పాటు రోగి చెబుతున్న లక్షణాలను బట్టి సమస్య మూలాలను గుర్తించవచ్చు. స్కిన్ బయాప్సీ, ఐజీఈ, ఇస్నోఫిల్ కౌంట్, ఈఎస్ఆర్, సీబీపీ, స్కిన్ అలర్జీ టెస్ట్, హార్మోనల్ అనాలసిస్ వంటివి సమస్య ఉదృతిని తెలియజేస్తాయి. లివర్, కిడ్నీలపై భారాన్ని కనుగొనడానికి స్కానింగ్, సంబంధిత ఫంక్షన్ టెస్ట్‌లు చేయించాలి. థైరాయిడ్ అసమతుల్యతకు సంబంధించి టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్లోన్ల పరీక్ష, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కాన్ వంటివి అవసరం పడవచ్చు.

చికిత్స జాగ్రత్తలు : 
స్వభావ లక్షణాలు, చిన్నతనం నుంచి శరీరంలో జరుగుతున్న ముఖ్య మార్పులు, పర్యవసానాలు చర్మం స్వభావం అంటే తేమశాతం, పొడిగా లేదా జిడ్డుగా ఉండటం, పొక్కులు, పొట్టు స్వభావం పడిన అవయవాలు, ప్రదేశాలు చికిత్సలో కీలకం. ఈ వ్యాధికి తాత్కాలిక ఉపశమనాన్ని అందించే చికిత్స తీసుకోవడం కన్నా సరైన  వైద్యం తీసుకోవడం ఉత్తమం. సరైన చికిత్సతో  రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేయడం వల్ల తర్వాత ఎటువంటి పునరావృతాలు జరగవు. పైగా జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

Wednesday, February 6, 2013

హోమియోతో సొరియాసిస్ నుంచి విముక్తి

సొరియాసిస్ ఏ వయసులో వారికైనా వచ్చే అవకాశం ఉంది. మన చర్మం రెండు పొరలతో నిర్మితమై ఉంటుంది. బయటిపొరను ఎపిడెర్మిస్ అని, లోపలి పొరను డెర్మిస్ అని అంటారు. కణాలు డెర్మిస్ పొరలో పుట్టి ఎపిడెర్మిస్‌లోకి వస్తుంటాయి. ప్రతీ 28 నుంచి 30 రోజులకొకసారి ఎపిడెర్మిస్‌లోని కణాలు డెర్మిస్‌లో తయారయిన కొత్తకణాలతో రీప్లేస్ చేయబడతాయి. సొరియాసిస్ వ్యాధిలో కణాలు తయారయ్యే ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

కొత్తకణాలు వేగంగా తయారయి చర్మంపై భాగానికి వచ్చేస్తుంటాయి. అధికంగా వచ్చేసిన ఆ కణాలు పేరుకుపోయి బిళ్లల మాదిరిగా తయారువుతుంది. సొరియాసిస్ అంటువ్యాధికాదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. సొరియాసిస్‌ను చర్మానికి సంబంధించిన వ్యాధిగా మాత్రమే పరిగణించి పైపూత మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఈ మందుల ద్వారా అప్పటికప్పుడు ఉపశమనం కనిపించినా, తిరిగి అదే ప్రదేశంలో లేక వేరే ప్రాంతంలో మరింత తీవ్రస్థాయిలో వ్యాధి బయటపడుతుంది. సొరియాసిస్ ఎక్కువగా మోచేతులు, మెకాలు, తల, వీపు భాగాల్లో కనిపిస్తుంది. కాలిగోళ్లు, చేతిగోళ్లలోకి విస్తరిస్తుంది.

కారణాలు
ఆటో ఇమ్యూన్ కండీషన్ సొరియాసిస్‌కు కారణమవుతోంది. శరీరంలోని ఇమ్యూన్‌సెల్స్ పొరపాటున సొంత కణాలపై దాడిచేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ అబ్‌నార్మల్ రెస్పాన్స్ వల్ల అబ్‌నార్మల్‌గా కణాలు తయారవుతాయి. వంశపారంపర్యంగా ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి అటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటే వారి సంతానానికి సొరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెప్టోకాకల్ ఇన్‌ఫెక్షన్, మానసిక ఒత్తిడి కూడా సొరియాసిస్‌కు కారణమవుతుంటాయి.

రకాలెన్నో...
సొరియాసిస్‌లో పలు రకాలున్నాయి. వ్యక్తికి వ్యక్తికి లక్షణాలు మారుతుంటాయి. సొరియాసిస్ విస్తరించిన ప్రదేశం, వ్యాధి ఉన్న కాలాన్నిబట్టి లక్షణాలుంటాయి.

ప్లేక్ సొరియాసిస్ : ప్లేక్ సొరియాసిస్ అతి సాధారణంగా వచ్చే వ్యాధి. 9 నుంచి 10 శాతం మంది రోగులు ప్లేక్ సొరియాసిస్‌తో బాధపడుతుంటారు. ఎర్రని ప్యాచ్‌ల మాదిరిగా ప్లేక్స్ చర్మంపై ఏర్పడతాయి. గోకినపుడు దురద, మంట ఉంటుంది. చర్మం పొడిబారినపుడు చర్మంపై పగుళ్లు ఏర్పడటంతో పాటు, రక్తస్రావం అవుతుంది. కీళ్లపై ప్రభావం పడినపుడు కీళ్ల దగ్గర వాపు, నొప్పి ఉంటుంది.

గట్టేట్ సొరియాసిస్ : గట్టేట్ సొరియాసిస్ పిల్లలతోపాటు యువతీ,యువకుల్లో ప్రారంభదశలో వచ్చే వ్యాధి. ఈ వ్యాధి వైరస్, బాక్టీరియాల వల్ల వచ్చి శ్వాసకోశ సమస్య ఏర్పడుతుంది. తల,చేతులు, కాళ్లపై ప్యాచ్‌లు ఏర్పడుతుంటాయి. ఇన్‌వర్స్ సొరియాసిస్ : చంకలు, ఛాతీ భాగంలో చర్మం మడతలుగా మారి ప్యాచ్‌లు ఏర్పడుతుంటాయి. ఈ వ్యాధికి చికిత్స చేయడం కష్టం.

సెబోరిక్ సొరియాసిస్ : ఎర్రని ప్యాచెస్‌లు చర్మంపై ఏర్పడతాయి. చెవులు, భుజం, ముఖంపై ఎర్రని మచ్చలు ఏర్పడతాయి.

నెయిల్ సొరియాసిస్ : చేతికున్న గోళ్లు పసుపు పచ్చగా మారతాయి. వేళ్లపై ఉన్న చర్మంపై పొక్కులు ఏర్పడుతుంటాయి.

పస్టులార్ సొరియాసిస్ : ప్యాచెస్‌లలో పస్ చేరి పగులుతుంటాయి. చేతులు, కాళ్లపై ఈ వ్యాధి కనిపిపిస్తుంటుంది.

సొరియాటిక్ ఆర్థరైటిస్: ఈ వ్యాధి మూలంగా జాయింటులు బిగుసుకుపోవడం, నొప్పి ఉంటుంది. సొరియాసిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిలో సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో 80 శాతం మందిలో సొరియాసిస్ గోళ్లలో కనిపిస్తుంది. సిమ్మెట్రిక్ సొరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో శరీరంలో రెండు వైపులా ఒకే ప్రదేశంలో లక్షణాలు కనిపిస్తాయి. మల్టిపుల్ జాయింట్స్‌పై ప్రభావం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగా ఉంటుంది. వెన్నులో ఉన్నప్పుడు నడుం బిగుసుకుపోవడం, మెడపై మంటగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. సొరియాసిస్ వ్యాధి ప్రభావం శారీరకంగానే కాకుండా మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది.

జంబుష్ సొరియాసిస్ : ఎరిథ్రోడెర్మిక్, పస్టులార్ సోరియాస్ వ్యాధుల లక్షణాలు జంబుష్ సొరియాసిస్ వ్యాధిగ్రస్థుల్లో కనిపిస్తుంటాయి. ఈ వ్యాధి సోకిన రోగికి జ్వరం,మజిల్స్ బలహీనపడటం, బరువు కోల్పోవడం, ప్రొటీన్ లాస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి పెద్దవారిలో వస్తే ప్రమాదం పొంచి ఉంటుంది.

హోమియో చికిత్స
సొరియాసిస్‌కు హోమియో వైద్య విధానంలో చక్కని చికిత్స అందుబాటులో ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించి, గ్రంథులను ఉత్తేజపరిచి, వ్యాధి కారకములను తగ్గించే విధంగా చికిత్స అందించడం ద్వారా సొరియాసిస్‌ను సమూలంగా తగ్గించవచ్చు. ఈ చికిత్సకణజాల స్థాయిలో పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని సాధారణ స్థాయికి తీసుకుస్తుంది. గ్రాఫైటిస్, నేట్రంమూర్, లైకోపోడియం, సల్ఫర్, సెపియా, స్టెపిసాగరియా, బరేటా కర్బ్, ప్రాస్పరస్,పల్సటిల్లా వంటి మందులు సొరియాసిస్ చికిత్సలో బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సా కాలం ఉంటుంది. నిపుణులైన హోమియో వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది.

Tuesday, February 5, 2013

IBS (Irritable bowel syndrome)

ఐబిఎస్ కడుపులో సుడిగుండం

పెద్దపేగుల్లో జరిగే ఒక అతి ప్రకోపం, ఒక అసహజమైన ప్రేరణలే ఐబిఎస్ వ్యాధికి మూలం. దాతువుల్లో విషపదార్థాలు పేరుకుపోవడం ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం. జీర్ణశక్తి తగ్గిపోవడం, పోషక పదార్థాల లోపాలు, నాడీవ్యవస్థ సమతుల్యత కోల్పోవడం, సహజ జీవన శైలికి విరుద్దంగా వెళ్లడం ఇతర కారణాలు. వీటన్నిటినీ మించి శరీరంలో ఓజస్సు (ఇమ్యూనిటీ) తగ్గిపోవడం ఒక కీలక కారణమవుతుంది. ఇది ప్రాణాలేమీ హరించదు. 

కానీ, జీవితాన్ని నరకతుల్యం చేస్తుంది. మౌలికంగా, శరీర వ్యవస్థలో జరిగే కొన్ని లోపాలు, ఉత్పన్నమయ్యే రసాయనాల వ్యత్యాసాలు కారణంగా ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణమే. జీర్ణాశయ సమస్యల్లో ఎక్కువ మందిని వేధించేది ఈ సమస్యే. పురుషుల కన్నా మూడు రెట్లు అధికంగా స్త్రీలు ఈ వ్యాధి బారిన పడతారు. మొత్తంగా చూస్తే మనదేశంలో 20 శాతం మంది ఈ వ్యాధితో సతమతమవుతున్నారు.

ఎవరిలో ఎక్కువ
తరుచూ ప్రయాణాలు చేసేవారు, విరామం లేకుండా ఎక్కువ గంటలు పనిచేసేవారు, భోజన వేళలు పాటించని వారు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్ తినేవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. అలాగే జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లకు గురైన వారు ఆ వెంటనే ఐబిఎస్‌కు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. ఈ సమస్యకు మానసిక కారణాలు కూడా ఎక్కువే. జీర్ణాశయం అన్నది మనిషి భావోద్వేగాలు ప్రతిధ్వనించే వేదిక. భావోద్వేగాల తీరును బట్టే పేగుల కదలికలు ఉంటాయి. ప్రతికూల కదలికలు ఉంటే వాటి ప్రభావం నోటినుంచి విసర్జక భాగం దాకా కనపడుతూనే ఉంటాయి.

ఎలా తెలుస్తుంది?
ఐబిఎస్‌లో ప్రధానంగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్దకం, విరేచనం ఈ నాలుగు లక్షణాలూ కనిపిస్తాయి. మలబద్దకం, విరేచనం అనేది ఒకదాని తరువాత ఒకటిగా వేధిస్తూ ఉంటాయి. ఒక రోజు మలబద్దకంగానూ ఒకరోజు విరేచనాలు కావడం ఇలా అసహనాన్ని నింపుతాయి. వీటివల్ల రోజువారి కార్యక్రమాలన్నీ అస్తవ్యస్తం అవుతాయి. ఈ అస్తవ్యస్తత ముందు వ్యాధిగా మారుతుంది. ఆ వ్యాధి పలు సమస్యల సిండ్రోమ్‌గా మారుతుంది.

ఈ నాలుగు లక్షణాల్లో ఏదో ఒకటిగా దాదాపు అందరిలోనూ ఉంటాయి. కానీ, ఈ నాలుగూ కలగలిసి వేధించడమే ఈ ఐబిఎస్ ప్రత్యేకత. ఈ నాలుగే కాకుండా ఐబిఎస్ ఉపలక్షణాలుగా తేన్పులు, తరుచూ అపాన వాయువు విడుదల కావడం, జిగురు విసర్జన, రుచి తెలియకపోవడం, ఛాతీలో మంటగా అనిపించడం, వికారం, వాంతి భావన కలగవచ్చు. స్త్రీలలో ఇది రుతుక్రమం దెబ్బతినేందుకు కూడా కారణం కావచ్చు. కొంతమంది స్త్రీలలో మూత్రం విసర్జనపైన అదుపు లేకుండా పోవచ్చు. మరికొంత మంది స్త్రీలలో శృంగార సమయంలో నొప్పిరావచ్చు. పార్శ్వపు తలనొప్పి రావడానికి ఐబిఎస్ ఒక కీలక కారణమవుతుంది.

వీటితో పాటు కండరాల నొప్పులు, నిద్రలేమి, వెన్ను, పొట్టకింది భాగాల్లో నొప్పి రావచ్చు. దీర్ఘకాలికంగా ఈ సమస్య కొనసాగే వారిలో దిగులు, ఆందోళన, ఆత్మన్యూనత, ఆత్మనింద, ఆసహనం,కోపం, భయం వంటి మానసిక అవస్థలు కూడా ఏర్పడవచ్చు. మొత్తంగా చూస్తే ఇది పెద్దపేగులకో, చిన్నపేగులకో పరిమితమయ్యే సమస్య ఎంతమాత్రమూ కాదు. ఇది హార్మోన్ వ్యవస్థను, నాడీవ్యవస్థను,అలా సమస్త శరీర వ్యవస్థనూ దెబ్బ తీస్తుంది. తిన్నదంతా విసర్జనలో వెళ్లిపోవడంతో ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఇమడక సప్తధావులూ క్షీణిస్తాయి. ఫలితంగా శరీరం చిక్కి శల్యమవుతుంది. ఈ క్రమంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి శరీరం రోగాల నిలయమవుతుంది.

పరిపూర్ణ చికిత్స
వాస్తవానికి జీర్ణవ్యవ స్థలో గ్రహణి అనే ఒక విభాగం ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేసి, పోషకాలను, వ్యర్థాలనూ విడదీసి, వ్యర్థాలను బయటికి పంపించే విభాగం. శరీరంలో అగ్ని సరిగా లేనప్పుడు ఈ ప్రక్రియలేవీ సరిగా జరగక «ధాతువుల్లో విషపదార్థాలు ఆమం పేరుకుపోతాయి. ఈ ఆమమే ఐబిఎస్ సమస్యకు అసలు కారణం. అందుకే ఆయుర్వేదం, విషమూలమైన ఆమాన్ని బయటికి పంపడం మీదే అమిత ంగా తన దృష్టిని నిలుపుతుంది.

అందుకు అవసరమైన అగ్నిని పెంచుతుంది. అగ్నిని పెంచితే సమస్త రోగాలూ సమసిపోతాయి. అగ్నిని పెంచడమే ప్రధాన లక్ష్యం అయినందువల్లే ఆయుర్వేదాన్ని ఆగ్నేయ చికిత్స అంటారు. అందులో భాగంగానే లంఘనం, ఆమహర చికిత్సలు చేస్తాం. ఆకలిని పెంచడానికి దీపన చికిత్సలు చేస్తాం. పంచకర్మ చికిత్సలు చేస్తాం. ఇవన్నీ అయ్యాక శరీరంలో పునరుత్తేజం నింపే మరికొన్ని చికిత్సలు చేస్తాం. ఇవన్నీ కలిసి ఐబిఎస్ సమస్యను సమూలంగా, శాశ్వతంగా తొలగించివేస్తాయి.

Monday, February 4, 2013

పసిపిల్లల కేన్సర్లను పసిగట్టడమే ముఖ్యం

కేన్సర్ అంటే అదేదో పెద్దవారిలో వచ్చే వ్యాధిగానే చాలా మంది భావిస్తారు. కానీ, అరుదుగానే అయినా పసిపిల్లలూ కేన్సర్ బారిన పడుతారు. పెద్దవారైతే ఆ కేన్సర్ తాలూకు బాధల్ని వెంటనే చెప్పగలుగుతారు. పిల్లల్లో ఆ శక్తి లేకపోవడం వల్ల సమస్య బాగా ముదిరిపోయే వరకు బయటపడే అవకాశం ఉండదు. తల్లిదండ్రులే ఆ సమస్యను గుర్తించాలంటే వారికి ఆ వ్యాధి లక్షణాల గురించి తెలియాలి. లక్షణాలను గుర్తించి వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే సకాలంలో సరియైన చికిత్సలు ఇప్పించి తమ పిల్లల ప్రాణాలను రక్షించుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు కేన్సర్ నిపుణులు డాక్టర్ సిహెచ్ మోహన వంశీ. 

చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లు పెద్ద వాళ్లల్లో వచ్చే కేన్సర్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. పెద్ద వాళ్లల్లో కేన్సర్‌రావడానికి వాతావరణం, ఇతర పరిస్థితులు, జీవన శైలి లోపాలు,అలవాట్లు జన్యుపరమైన మూలాలు ఇవన్నీ కారణాలైతే, చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో అత్యధిక భాగం, జన్యుపరమైన అంశాలు, డిఎన్ఏ మార్పులే ప్రధాన కారణంగా ఉంటాయి. నిజానికి, కేన్సర్ చికిత్సలకు పెద్దవాళ్లకన్నా చిన్నపిల్లల శరీరాలే బాగా స్పందిస్తాయి. శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా ఉన్నా వాటినుంచి బయటపడే సామర్థ్యం వారిలో ఎక్కువగా ఉంటుంది. వైద్య చికిత్సలకు ప్రత్యేకించి కీమోథెరపీకి పెద్ద వాళ్ల కన్నా చిన్నపిల్లలే బాగా తట్టుకుంటారు. లేత వయసే అయినా వారి శరీర కణజాలానికి ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది.

సాధారణ లక్షణాలు
అన్ని కేన్సర్లలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఏ భాగంలోనైనా ఒక కణితి ఏర్పడటం లేదా వాపు రావడం, శరీరమంతా పాలిపోయినట్లు అనిపించడం, ఏ చిన్న దెబ్బ తగిలినా ఎర్రబారి బాగా కమిలిపోవడం ప్రధానంగా కనిపిస్తాయి. కొంతమంది పిల్లల్లో శరీరంలోని ఏదో ఒక భాగంలో నొప్పి రావడ ం, నడుస్తున్నప్పుడు నొప్పి అనిపించడం, పరుగెత్తలేకపోవడం లేదా కుంటుతూ నడవడం, ఒక మోస్తరు జ్వరం, ఆకలి త గ్గిపోవడం, బలహీనంగా మారడం, హఠాత్తుగా దృష్టిలోపాలు ఏర్పడటం, హఠాత్తుగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కచ్ఛితంగా కేన్సర్ లక్షణాలే అని కాదు. కాకపోతే, ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయకూడదు.

లుకేమియా
చిన్నపిల్లల్లో కనిపించే కేన్సర్లలో 34 శాతం లుకేమియా కేన్సర్లే ఉంటాయి. ఇది తెల్లరక్తకణాల్లో వచ్చే కేన్సర్. తెల్లరక్తకణాలు మైలార్డ్ అనీ, లింఫాటిక్ అనీ రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండింటిలో వేటిలోనయినా లుకేమియా కేన్సర్ రావచ్చు. తెల్లరక్తకణాల సంఖ్య పెరగడమే ఇక్కడ సమస్య. ఈ కేన్సర్‌లో ఎముకలు, కీళ్ళల్లో నొప్పి ఉంటుంది. బాగా నీరసం ఉంటుంది. శక్తిహీనత, రక్తస్రావం, అతిచిన్నదెబ్బకే శరీరం కందిపోవడం, తరుచూ ఇన్‌ఫెక్షన్లు రావడం ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. అయినా ఈ కేన్సర్ కీమో థెరపీతో బాగా అదుపులోకి వస్తుంది. కాకపోతే ఈ థెరపీని ఎక్కువ రోజులే తీసుకోవలసి ఉంటుంది. ఈ థెరపీని కూడా పిల్లలు బాగానే త ట్టుకుంటారు. పిల్లల్లో వచ్చే ఈ కేన్సర్లు 70 శాతంమందిలో పూర్తిగా నయమవుతాయి. ఇదే కేన్సర్ పెద్దవాళ్లలో వస్తే ఇంత శాతం ఉండకపోవచ్చు.

కేంద్రనాడీ వ్యవస్థలో వచ్చే కణుతులు
ఈ కణుతులు మెదడులో రావచ్చు లేదా వెన్నుపాములో రావచ్చు. ఈ కణుతులు పెద్దవారిలో అయితే, మెదడు ఉపరిభాగం (సెరెబ్రెల్)లో వస్తాయి. చిన్నపిల్లల్లో అయితే, మెదడు కింది భాగం (బ్రెయిన్ స్టెమ్) లో వస్తాయి. చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో నాలుగోవంతు ఈ మెదడు కేన్సర్లే ఉంటాయి. ఈ కేన్సర్లలో తలనొప్పి, వికారం, వాంతులు, అస్పష్టమైన చూపు, లేదా ఒక వస్తువు రెండుగా కనిపించడం, మగతగా ఉండడం, తూగిపడటం లేదా బేలన్స్ లేకపోవడం, కణితి ఉన్న భాగాన్ని బట్టి, కీమోథెరపీ గానీ, రేడియో థెరపీ గానీ, లేదా సర్జరీ గానీ, ఇవ్వాల్సిరావచ్చు.

న్యూరోబ్లాస్టోమా
చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో 7 శాతం ఇవే ఉంటాయి. ఈ కేన్సర్లు నాడీకణజాలంలో వస్తాయి. 5 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలోనే ఈ కేన్సర్లు ఎక్కువగా వస్తాయి. పదేళ్లుదాటిన వారిలో ఇవి రావడం చాలా అరుదు. ఇవి శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ ఎక్కువ మంది పిల్లల్లో ఇవి పొట్టలోనే వస్తాయి. కడుపు ఉబ్బరం, వాపు, నొప్పి రావచ్చు, ఎముకల్లో నొప్పి, జ్వరం, బరువు తగ్గడం, పొట్ట పెరిగి శరీరమంతా సన్నబడటం ఇవి ఈ కేన్సర్ లక్షణాలు. ఒక మోస్తరు జ్వరం రావడం కూడా ఈ వ్యా«ధి లక్షణాల్లో ఒకటి. ఈ వ్యాధికి సర్జరీగానీ, కీమోథెరపీ గానీ, అవసరం కావచ్చు. చాలా సార్లు ఈ రెండూ అవసరమవుతాయి. కేన్సర్‌ను గుర్తించడంలో ఆలస్యమైనప్పుడు ముందు కీమోథెరపీ ఇచ్చి ఆ తరువాత సర్జరీ చేయవలసి ఉంటుంది.

విల్మ్స్ ట్యూమర్
ఇవి కిడ్నీల్లో వచ్చే కేన్సర్లు. చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో 5 శాతం ఇవే ఉంటాయి. ఇవి మూడు నుంచి నాలుగేళ్ల లోపు పిల్లలోనే వస్తాయి. 5 ఏళ్లు దాటిన వారిలో ఇవి రావడం చాలా అరుదు. ఈ కేన్సర్లలో పొట్టలో వాపు రావడం, నొప్పి కొద్దిపాటి జ్వరం, వికారం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఈ కేన్సర్‌కు సర్జరీయే ప్రధాన చికిత్స. కణితిని గుర్తించడంలో ఆలస్యమై, అప్పటికే అది బాగా పెరిగిపోయి ఉంటే, ముందు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా కణితిని కుంచింపచేసి, ఆ తరువాత సర్జరీ చేయవలసి ఉంటుంది. అవసరమైతే ఆ భాగంలో రేడియేషన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.

లింఫోమా
లింఫ్ గ్రంధుల్లో వచ్చే కేన్సర్లను లింఫోమా అంటారు. చాలా సార్లు ఈ కేన్సర్లు ఎముక మజ్జకు కూడా పాకుతూ ఉంటాయి. ఈ కేన్సర్‌లో కొద్దిపాటి జ్వరం, బరువు తగ్గడం, ఎక్కువగా చెమట రావడం, శరీరం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లింఫ్ గ్రంధులు రెండు రకాలు. అందులో ఒకటి హాచ్‌కిన్స్ లింఫోమా రెండవది నాన్‌హాచ్‌కిన్స్ లింఫోమా. హాచ్‌కిన్స్ లింఫోమా ఎక్కువగా 15 నుంచి 20 ఏళ్లలోపు వారిలో కనిపిస్తుంది. వీటిలో అత్యధిక శాతంపూర్తిగా నయమైపోయే కేన్సర్లు. ఇక నాన్‌హాచ్‌కిన్స్ లింఫోమాలు 5 ఏళ్లలోపు పిల్లల్లోనే ఎక్కువగా కనిస్తాయి. ఈ కేన్సర్ తీవ్రత కాస్త ఎక్కువే అయినా, కీమోథెరపీతో అదుపులోకి వస్తుంది. ముక్కపరీక్ష చేసి, కేన్సర్ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకుని కీమోథెరపీ ఇవ్వవలసి ఉంటుంది.

ర్యాబ్డోమయో సార్కోమా
ఇది కండరాల్లో వచ్చే కేన్సర్. కండరాల్లో వాపు, నొప్పి రావడం. కండరాలు బలహీనమైపోవడం ఈ కేన్సర్‌లోని ప్రధాన లక్షణం. ఇవి కీమోథెరపీకి బాగా స్పందిస్తాయి. కొన్నిసార్లు రేడియేషన్, సర్జరీ కూడా అవసరం కావచ్చు.

రెటినోబ్లాస్టోమా
ఇవి కంట్లో (కనుపాప)వచ్చే కేన్సర్లు. చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో ఇవి 3 శాతం కనిపిస్తాయి. సాధారణంగా 18 మాసాల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లల్లో కనిపిస్తాయి. 6 ఏళ్లు దాటిన పిల్లల్లో ఇది పెద్దగా కనపడదు. ఈ కేన్సర్ సోకిన వారిలో కనుపాపలు నల్లగా కాకుండా మెరుస్తూ, పిల్లిక ళ్లలా కనిపిస్తాయి. మనం నేరుగా గుర్తించకపోయినా ఫోటోగ్రాఫ్‌లో ఆ కన్ను తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది. కనురెప్పల్లో వాపు కనిపిస్తుంది. కొందరిలో కనుగుడ్లు బయటికి ఉబ్బవచ్చు. ఈ కేన్సర్లకు కీమోథెరపీ, సర్జరీ అవసరమవుతాయి.

బోన్ కేన్సర్
ఎముకల్లో వచ్చే ఈ కేన్సర్లు బాల్యం నుంచి టీనేజ్‌దాకా ఎప్పుడైనా రావచ్చు అయితే ఇవి పెరగడం అన్నది ఏ వయసులోనైనా జరగవచ్చు. కొన్ని దఫాలుగా కీమో థెరపీ ఇచ్చి ఆ తరువాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సర్జరీగా అనువుగా లేకపోతే, రేడియేషన్ ఇవ్వవలసి ఉంటుంది. కాకపోతే ఈ చికిత్స ఎక్కువ రోజులే తీసుకోవలసి ఉంటుంది.

సర్వైవల్ రేట్
లుకేమియా కేన్సర్‌లో 80 శాతం దాకా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. బ్రెయిన్ ట్యూమర్లయితే 70 శాతం మందికి వ్యాధి నయమవుతుంది. హాచ్‌కిన్స్ లింఫోమాలో అన్నిటికన్నా ఎక్కువగా అంటే 95 శాతం మందికి పూర్తిగా నయమవుతుంది. విల్మ్స్ ట్యూమర్స్ 80 శాతం దాకా నమవుతుంది. మొత్తంగా చూస్తే సగటున చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో 70 శాతం పూర్తిగా నయమవుతాయి. అయితే పిల్లలకు చికిత్స విషయంలో వివిధ శాఖలకు చెందిన డాక్టర్ల టీమ్ అవసరం అవుతుంది. పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఒక సైకాలజిస్టు కూడా అవసరం.

కొన్ని ప్రతికూల ప్రభావాలు
రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చిన పిల్లల్లో కొత్త విషయాలు నేర్చుకోవడంలో వెనుకబాటుతనం, ఐక్యూ తగ్గిపోవడం, చేతికీ కంటికీ మధ్య సమన్వయం లేకపోవడం, జ్ఞాపక శకి తగ్గిపోవడ ం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో సహజంగా పలురకాల హార్మోన్లు ఉత్పన్నం అవుతాయి. రే డియేషన్ తరువాత ఈ హర్మోన్ వ్యవస్థ కొంత మేరకు దుష్ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే పిల్లల ఎదుగుదల కూడా కుంటుపడవచ్చు. రెటీనా బ్లాస్టోమా కారణంగా కంటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు కొందరిలో దృష్టిలోపాలు ఏర్పడవచ్చు. 

కీమో థెరపీతోనూ మసకగా కనపించడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మెదడుకు ఇచ్చే రేడియేషన్ వల్ల పిల్లలకు వినికిడి లోపాలు కూడా ఏర్పడవచ్చు. పెరుగుదల కుంటుపడిపోవడం, ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడం, ఎముకల పెరుగుద ల కుంటుపడిపోవడం వంటివి కూడా ఉంటాయి. ఆ ప్రభావాలను గమనించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే, ఆ దుష్ప్రభావాలను కొంత మేరకు తగ్గించే అవకాశం ఉంటుంది. కేన్సర్ ట్రీట్‌మెంట్స్ జరిగింది అతి చిన్న వయసులోనే కాబట్టి వారి ముందు ఇంకా ఒక సుదీర్ఘమైన జీవిత కాలం ఉందని కదా! అందుకే ఈ కాలంలోనే కొంత మంది పిల్లల్లో రెండవసారి కేన్సర్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందుకే దుష్ప్రభావాల కారణంగా పిల్లల్లో వచ్చే మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం చాలా అవసరం. ఏవైనా ప్రతికూల మార్పులు కనిపించినప్పుడు వెంటనే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

Tuesday, December 4, 2012

ఆయుర్వేదం సాధించిన అద్భుతం నడుమునొప్పి మాయం

చిన్న ప్రమాదంలో నడుముకు తగిలిన దెబ్బ నాలుగేళ్లు స్వాతిని వేధించింది. చూడని ఆర్థోపెడిక్ డాక్టర్ లేరు. తీయించని ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ స్కానింగ్‌లు లేవు. నడుము నొప్పికి కిడ్నీలో రాళ్లు కూడా కారణం కావచ్చన్న అనుమానంతో మరికొన్ని స్కానింగ్‌లు. ఏ వైద్యానికి లొంగని ఆ నడుము నొప్పి నెల రోజుల్లోనే మటుమాయమైంది. ఇది ఆయుర్వేద వైద్యంలోని వైశిష్ట్యమని అంటున్నారు డాక్టర్ బుక్కా మహేశ్‌బాబు.

ఆమె పేరు స్వాతి. వయసు 28 సంవత్సరాలు. స్వస్థలం అమలాపురం. భర్త ఉద్యోగరీత్యా కర్నూలులో ఉంటున్నారు. వారికి ఒక నాలుగేళ్ల పాప. ఒకరోజు అమలాపురంలో భర్తతో కలసి బైక్ మీద వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడింది స్వాతి. ఫ్రాక్చర్ లాంటిదేదీ కానప్పటికీ నడుం దగ్గర కొద్దిగా నొప్పి ఉండేది. మామూలు నొప్పే కదా తగ్గిపోతుందిలా అనుకున్నారామె. అయితే నెలరోజులైనా నొప్పి తగ్గలేదు సరికదా పెరుగుతూ పోతోంది. కర్నూలులో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్‌ను ఆమె సంప్రదించారు. ఆయన రాసిన పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు క్యాప్సిళ్లను గుప్పిళ్లు గుప్పిళ్లు మింగినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. నొప్పి మాత్రం తగ్గలేదు.

నొప్పికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఎంఆర్ఐ తీయించారు ఆ డాక్టర్. డిస్క్ కొంచెం తేడాగా ఉంది... అరిగినట్లు కనపడుతోంది...విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి బెల్ట్ వేసుకోమన్నారు ఆ డాక్టర్. ఇలా ఒక సంవత్సరం గడిచింది. విశ్రాంతి తీసుకున్నా, బెల్ట్ పెట్టుకున్నా నొప్పిలో మాత్రం మార్పు లేదు. సూదులతో పొడుస్తున్నట్లు వచ్చే నడుంనొప్పిని పంటి బిగువున భరిస్తూ ఇంటి పని, వంట పని చూసుకోవడం ఆమెకు నరకంగా మారింది. ఈ నొప్పి ఇంతేనా? జీవితాంతం భరించాల్సిందేనా? అన్న ఆవేదన ఆమెను చుట్టుముట్టేవి. ఆ సమయంలో మరో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించారు ఆమె. ఆయన సలహామేరకు మళ్లీ నడుముకు ఎక్సరేలు, ఎంఆర్ఐ స్కాన్‌లు అన్నీ తీయించారు.

నడుముకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పారు ఆ డాక్టర్. అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవద్దని ఆమె సన్నిహితులు సలహా ఇవ్వడంతో డాక్టర్ దగ్గర వెన్నులో ఇంజెక్షన్ తీసుకోకుండా కేవలం మందులు మాత్రం తీసుకున్నారు స్వాతి. నెల రోజులు మందులు వాడినా ఏ విధమైన ప్రయోజనం లభించలేదు. నిరాశా నిస్పృహలు ఆమెను ఆవహించాయి. జీవితం దుర్భరంగా మారుతోంది. ఈ క్రమంలో కర్నూలులో ఉన్న ఆర్థో డాక్టర్లు, సర్జన్లనందరినీ సంప్రదించారు స్వాతి. ఆయా డాక్టర్లు తమ అనుభవాన్నంతా రంగరించి తమకు తోచిన విధంగా చికిత్స చేశారు. ఇలా మూడు సంవత్సరాలు గడచిపోయాయి.

కొంతమంది డాక్టర్లు ఈ నొప్పి కిడ్నీలో రాళ్ల వల్ల వస్తున్నదేమో అన్న అనుమానంతో యూరాలజిస్ట్‌ని సంప్రదించవలసిందిగా ఆమెకు సలహా ఇచ్చారు. దాంతో యూరాలజిస్ట్‌ని కలిశారు. ఆయన దాదాపు 30 రకాల స్కానింగ్‌లు తీయించారు. కిడ్నీలో చాలా సూక్ష్మమైన రాళ్లు ఉన్నాయి...వాటి వల్ల ఇంత నొప్పి వచ్చే అవకాశం లేదు కాబట్టి బాగా నీళ్లు తాగమని, ఆ రాళ్లు వాటంతటవే కరిగిపోతాయని ఆమెకు సలహా ఇచ్చారు. బిందెల కొద్దీ నీళ్లు తాగినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. నొప్పి యథాప్రకారం అక్కడే తిష్టవేసుకుని కూర్చుంది. కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్థో సమస్య కాదనుకుని యూరాలజిస్ట్ దగ్గరకు వెళితే మళ్లీ ఆర్థో డాక్టర్‌నే కలవమని ఆయన సలహా ఇచ్చారు. సమస్య ఏమిటో తెలియకుండా తిరిగిన డాక్టర్ల దగ్గరకే మళ్లీ వెళ్లవలసి వచ్చినందుకు స్వాతిలో తీవ్రమైన ఆవేదన, నైరాశ్యం అలుముకున్నాయి.

దుష్ప్రభావాలు మొదలయ్యాయి...
డాక్టర్లు రాసిన మందులు ఎక్కువకాలం గుప్పిళ్ల కొద్దీ మింగడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ పెరగటం, విపరీతంగా బరువు పెరగటం లాంటి దుష్ప్రభావాలు స్వాతిలో తలెత్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించుకోవడానికి చాలా డబ్బు ఖర్చుపెట్టి బరువు తగ్గించే మందులు కూడా ఆమె వాడారు. అయినా బరువు తగ్గలేదు... నడుము నొప్పీ పోలేదు. అసలు వ్యాధి ఏమిటో ఎన్ని ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ స్కానింగ్‌లు, కిడ్నీ స్కానింగ్‌లు చేసినా నిర్ధారణ కాలేదు. అసలు వ్యాధి నిర్ధారణ జరిగేతేనే కదా ఔషధం పనితీరు ప్రభావం తెలిసేది! ఈ పరిస్థితుల్లో అంతిమ పరిష్కారంగా మొట్టమొదటిసారి ధైర్యం కూడగట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వెదకడం ప్రారంభించారు ఆమె.

తమ కుటుంబ మిత్రుడొకరికి గుండుసూది కూడా మోపలేనంతగా శరీరమంతటా సొరియాసిస్ ఆవరించి ఉన్న పరిస్థితుల్లో ఆయుర్వేద మందులతో పూర్తిగా తగ్గిపోయిన విషయం ఆమె దృష్టికి వచ్చింది. వెంటనే ఆ మిత్రుడిని కలుసుకుని ఆయర్వేదం గురించి వాకబు చేశారామె. ఆ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు కర్నూలు నుంచి పయనమై నన్ను సంప్రదించారు ఆమె. నెలరోజుల క్రితం స్వాతి నా దగ్గరకు వచ్చినపుడు ఆమె చెప్పిన వ్యాధి లక్షణాలు ఇలా ఉన్నాయి.

వ్యాధి లక్షణాలు

- నడుములో కుడివైపు భాగంలో తీవ్రమైన నొప్పి.

- మెలిపెట్టినట్లు, గట్టిగా పిండినట్లు నడుములో నొప్పి.

- నొప్పి వచ్చినపుడు కుడికాలు పూర్తిగా స్పర్శను కోల్పోతుంది. అడుగు తీసి అడుగు వేయడం సాధ్యం కాదు.

- పద్మాసనం వేసుకుని కూర్చుంటే రెండు కాళ్లలో తిమ్మిర్లు.

- పాదాలు కింద పెడితే అరికాళ్లలో మంటలు.

- ఓ గంట సేపు కూర్చుని లేవాలంటే కాళ్లు సహకరించవు.

- నొప్పి ఉన్న వైపు పడుకుంటేనే ఉపశమనంగా ఉండేది.

- పడుకున్నపుడు అటు, ఇటు తిరగడానికి వీలయ్యేది కాదు.

- పడుకున్న తరువాత నిద్రలేవాలంటే కాళ్లు సహకరించేవి కావు. కాళ్లు స్వాధీనంలోకి రావడానికి అరగంట పట్టేది.

- తన సొంత పనులను కూడా చేసుకోలేని పరిస్థితి.

- మోకాలి పిక్కలు ఎవరో పిసికేసినట్టుగా నొప్పి వస్తుంది.

ఈ వ్యాధి లక్షణాలతో దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఆమె బాధపడుతున్నారు.

వ్యాధి నిర్ధారణ ఇలా జరిగింది...
ఆమె శారీరక లక్షణాలను బట్టి ఈ వ్యాధిని కుడివైపు వచ్చే గృద్రసి వాత వ్యాధిగా నిర్ధారణ చేయడం జరిగింది. దీనితోపాటుగా ఇతరత్రా వివరాల కోసం ఎంఆర్ఐ రిపోర్ట్స్‌ను నిశితంగా పరిశీలించి వ్యాధి నిర్ధారణకు అవసరమయ్యే సమాచారాన్ని సేకరించడం జరిగింది. అతి సూక్ష్మమైన ఇసుకరేణువుల రూపంలో ఉన్న రాళ్లు కిడ్నీలో ఉన్నప్పటికీ నిరంతరం అతి తీవ్రమైన నడుమునొప్పి ఆ ప్రాంతంలో ఉండదు. అందుచేత ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కిడ్నీలోని రాళ్లు కరగడానికి ఒక ప్రత్యేకమైన ఆకును వండి తినవలసిందిగా సూచించడం జరిగింది. ఎంఆర్ఐలోని అంశాలు ఇలా ఉన్నాయి.

ఎల్3-ఎల్4, ఎల్4-ఎల్5 డిస్క్‌ల మధ్య నుంచి వచ్చే వెన్నుపాము నర్వ్ సిగ్నల్స్ తగ్గినట్లుగా తేలింది. ఇది చిన్న వయసులో ఎముకల అరుగుదల ఏర్పడటం వల్ల వచ్చే సమస్య. డి-12 వర్టిబ్రా నుంచి ఎల్-4 వర్టిబ్రా వరకు స్క్రూమోల్ కణుపులు అంటే వెన్నెముక చివరలో కొవ్వు గడ్డలాంటివి పెరగటం జరిగింది. ఎల్3-ఎల్4, ఎల్4-ఎల్5 మధ్యలో వెనుక భాగంలో డిస్క్ బల్జ్‌లు జరిగాయి. వెన్నుపాము వెళ్లేదారి ఇరుకై వెన్నుపాముపై పొరపై ఒత్తిడి పెరిగింది. ఇది ఎల్4-ఎల్5 మధ్య ఎక్కువగా ఉంది.

దీనికి తోడు రోగి మెడనొప్పితో బాధపడుతున్నప్పటికీ నడుము నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల ఆ విషయానికి ఆమె అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే మెడ ప్రాంతంలోని సి2- సి3, సి4-సి5, సి5-సి6 ప్రాంతంలో వెన్నెముకల్లో అరుగుదల ఏర్పడినట్లు తేలింది. దీనివల్ల ఈ వెన్నెముకల వెనుక భాగంలో డిస్క్ బల్జ్‌లు ఏర్పడి వెన్నుపాము పైపొరపై ఒత్తిడిని కలుగచేస్తున్నాయి. దీనిని డీ జనరేటివ్ సర్వైకల్ డిస్క్ డిసీజ్ అంటారు.

ఇంకో అతి ముఖ్యమైన విషయం నడుము నిటారుగా నిలబెట్టడానికి అవసరమయ్యే లిగమెంటమ్ ఫ్లేవమ్ పట్టుజారి డి10 వర్టిబ్రా ప్రాంతంలో వెన్నుపాముపైన, వెన్నుపాము పైపొరపైన ఒత్తిడి కలుగచేస్తోంది. ఎంఆర్ఐ రిపోర్ట్స్‌ను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పేషెంట్ వాహనం మీద నుంచి పడటం వల్లనే వెన్నుకు దెబ్బతగలడం వల్ల సమస్య ఇంత తీవ్రతరం అయ్యిందని కచ్ఛితమైన నిర్ధారణకు రావడం జరిగింది. అనంతరం చికిత్స ప్రణాళికను రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా చెదిరిన డిస్క్‌లు, సాగిన ఫ్లేవమ్ లిగమెంట్లను సరిచేసి వెన్నుపాముపై ఒత్తిడి తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కావలసిన ఔషధాలను, వాటి డోసేజ్‌లను నిర్ధారించుకుని చికిత్స మొదలు పెట్టాము.

చికిత్సా విధానం ఇలా ఉంది...
వ్యాధి నిర్ధారణ, ఔషధాల ఎంపిక, వాటి డోసేజ్‌ల పరిమాణం, అవి వాడే విధివిధానం, ఏమేమి సలహాలు, సూచనలు పాటించాలి, చికిత్సలో మెరుగైన ఫలితాలు చికిత్సలో మెరుగైన ఫలితాలు పొందడానికి అతి ముఖ్యమైన అంశాలు. ఈ రోగి విషయానికి వస్తే సాధారణంగా అందరూ చెప్పే పథ్యాలైన వంకాయ, గోంగూర, దుంపకూరలు, సెనగపిండి లాంటివి తినవద్దని సూచించలేదు. కేరళ వైద్యం లాంటి మసాజ్‌లు కూడా ఏమీ చెప్పలేదు. మేము చేపట్టిన చికిత్సలో తైలమర్ధనలు అన్న ప్రయోగమే లేదు.

చెదిరిన డిస్క్‌లు సరిచేయడానికి, సాగిన లిగమెంట్ మామూలు స్థితికి రావడానికి, ఎముకల అరుగుదల సరిచేయడానికి ప్రాచీన కాలంలోనే ఆయుర్వేద సిద్ధ శాస్త్రవేత్తలు కనిపెట్టిన అత్యంత సూక్ష్మ ఔషధాలను(నానో) ఉపయోగించాము. ఇవి అత్యంత ప్రభావశీలమైన ఔషధ గుణాలతో కూడిన ఆకులు, బెరడులు, గింజలు, వేర్లు, జిగుర్లు, శుద్ధి చేసిన ఖనిజ భస్మాలతో తయారుచేసిన ఔషధాలు. నిరపాయకరమైన ఈ ఔషధాలు శరీర జీవ క్రియను మెరుగుపరచి, అత్యంత సూక్ష్మమైన కణాలలోకి కూడా బయో మాలిక్యూల్స్‌ను తీసుకువెళతాయి. రోగికి నెలరోజులకు అవసరమైన ఔషధాలను చికిత్సగా అందచేయడం జరిగింది.

చికిత్సా ఫలితం
నాలుగు వారాలపాటు ఔషధాలను వాడిన స్వాతికి అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. నాలుగేళ్లుగా పట్టిపీడిస్తున్న నడుము నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నాలుగడుగులు నడవడానికే కష్టపడే ఆమె ఇప్పుడు నాలుగు గంటలసేపు నిలబడి వంటచేయగలుగుతోంది. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు తగ్గిపోయాయి. ఏ ఆసరా లేకుండానే చకచకా నడవగలుగుతోంది.

కూర్చున్నా, లేచినా, నిలబడినా వేధించే నొప్పి ఇప్పుడు లేనేలేదు. నిద్రించే సమయంలో అటు, ఇటు తిరగడం ఇప్పుడు సులువైంది. నిద్ర లేచిన వెంటనే సొంత పనులే కాక ఇంటి పనులు కూడా చేయగలుగుతోంది. ప్రశాంతంగా నిద్రించడంతోపాటు బరువు కూడా తగ్గడం మొదలైంది. మరో రెండు నెలల పాటు ఔషధ చికిత్సను కొనసాగించడం వల్ల నడుము నొప్పి ఇతర సమస్యలన్నీ కూడా ఆమెకు శాశ్వతంగా దూరమైపోవడం ఖాయం.

నాలుగేళ్లుగా పట్టిపీడిస్తున్న నడుము నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నాలుగడుగులు నడవడానికే కష్టపడే ఆమె ఇప్పుడు నాలుగు గంటలసేపు నిలబడి వంటచేయగలుగుతోంది. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు తగ్గిపోయాయి. ఏ ఆసరా లేకుండానే చకచకా నడవగలుగుతోంది.

Saturday, December 1, 2012

హెచ్‌ఐవీ వైరస్... తెలివితేటలు!

హెచ్‌ఐవీ వైరస్ చాలా తెలివైనది. అది శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధకశక్తిని ఇచ్చే సీడీ-4 సెల్స్‌ను నాశనం చేయడం పాటు తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది. యాంటీ రెట్రోవైరల్ (ఏఆర్‌డీ) మందులు సీడీ-4 సెల్‌కౌంట్‌ను తగ్గకుండా చూస్తాయన్నమాట. ఈ వైరస్ ఎంత తెలివైనదంటే ఒకరకం మందులకు అలవాటు పడ్డ తర్వాత ఆ మందుకు తన నిరోధకశక్తి (రెసిస్టెన్స్) ని పెంచుకుంటుంది. తద్వారా తనను తాను (కాపీ చేసుకోవడం ద్వారా) వృద్ధి చేసుకోవడం మళ్లీ ప్రారంభిస్తుంది. అందుకే దాన్ని తప్పుదారి పట్టించేందుకు మూడు రకాల ఏఆర్‌వీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా అది ఏ మెడిసిన్ పట్లా తన నిరోధకశక్తిని పెంపొందించుకోకుండా చేయవచ్చు.